
కాజీపేట: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని సిద్దార్ధనగర్‌లో ఓ ఇంట్లో దాచి ఉంచిన సుమారు రూ.3.5 కోట్ల నగదును బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వర్ధన్నపేట ప్రజా ఫ్రంట్ అభ్యర్థి డాక్టర్ పి.దేవయ్యకు సమీప బంధువైన కాంగ్రెస్ నాయకుడు గంగారపు అమృతరావు ఇంటి సమీపంలో ఉంటున్న కేరళకు చెందిన ఓ వ్యక్తి నివాసంలో ఈ నగదు దొరికింది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దార్ధనగర్‌లో నివాసం ఉండే అమృతరావు తన ఇంటి పక్కన ఉన్న కేరళ వ్యక్తి ఇంటిని బుధవారం అద్దెకు తీసుకున్నారు. అద్దెకు ఇచ్చిన కొద్దిసేపటికే ముగ్గురు యువకులు లగేజీ బ్యాగ్‌లతో రెండు కార్లలో వచ్చారు. ఆ కొద్దిసేపటికే టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి.. ఆ ఇంటిలో ఉన్న దాదాపు రూ.3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
యువకుల మధ్య గొడవే పట్టించిందా...
రెండు వాహనాల్లో నగదును తెచ్చిన యువకులు బహిరంగంగా రోడ్డుపై గొడవ పడడమే డబ్బుల గుట్టు తెలియడానికి కారణమైందనే చర్చ కాజీపేట పట్టణంలో జరుగుతోంది. ఎన్నికల అవసరాల కోసం తెచ్చిన డబ్బులు ఎవరి వద్ద ఉండాలనే విషయంలో యువకులు రోడ్డుపై వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో అటుగా వచ్చిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది విషయాన్ని ఆరా తీసి అధికారులకు సమాచారం అందించడంతో చాకచక్యంగా వ్యవహరించి నగదును పట్టుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు.
అమృతరావు ఇంటిపై దాడి..
అమృతరావు ఇంటిలో ఇంకా ఏమైనా నగదు నిల్వలు ఉండొచ్చనే ఉద్దేశంతో పోలీసులు తనిఖీలు చేశారు. యువకులు డబ్బులతో వచ్చిన వాహనాలను తనిఖీ చేయగా కాంగ్రెస్ కండువాలు, జెండాలు బయటపడ్డట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment