Cash Siezed
-
చల్మెడ చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు
-
మునుగోడు పోరు: కారులో ‘కోటి’ స్వాధీనం.. ఎవరిది ఆ డబ్బు?
సాక్షి,నల్గొండ: ఉప ఎన్నిక సమీపిస్తున్నకొద్దీ మునుగోడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓటర్లను ప్రలోభా పెట్టడానికి పార్టీ నేతలు భారీ నగదు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మునుగోడు మండలం చల్మెడ చెక్‌పోస్టు వద్ద పోలీసులు సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీలో భాగంగా నంబర్ ప్లేట్లోని టాటా సఫారీ కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి వాహనంగా గుర్తించారు. కారులో దొరికిన నగదు బీజేపీ నేతకు చెందినదిగా పోలీసులు తెలిపారు. కరీంనగర్ 13 డివిజన్ కార్పొరేటర్ భర్త సొప్పరి వేణు..డబ్బును విజయవాడ నుంచి మునుగోడుకి తరలిస్తుండగా పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన డబ్బుపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. చదవండి: మళ్లీ మొదటికొచ్చిన పీసీసీ సమస్య.. స్లాట్ బుకింగ్‌కే 3 వారాలు -
విశాఖలో హవాలా రాకెట్ గుట్టురట్టు..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో హవాలా రాకెట్ గుట్టురట్టయింది. ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.50.38 లక్షల బ్లాక్ మనీని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన గ్రంథి నరసింహారావు నరసాపురంలో జయదేవి జ్యువెలర్స్ లో గుమస్తాగా పనిచేస్తాడు. అతను అనుమానాస్పదంగా విశాఖ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో తిరుగుతుండటంపై టాస్క్ ఫోర్స్ పోలీసులకి సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ త్రినాధ్ ఆధ్వర్యంలో బృందం అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా 50.38 లక్షలను విశాఖ నుంచి నరసాపురం తరలించడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. నరసాపురంలోని జయదేవి జ్యువెలర్స్ యాజమాని ప్రవీణ్ కుమార్ జైన్ తనని ఇక్కడికి పంపించారని...అంతకుమించి తనకు తెలియదని గుమస్తా నరసింహరావు టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అతని దగ్గర ఉన్న ఫోన్ లో సీక్రెట్ కోడ్ ఉండటంతో హవాలా మార్గంలో తరలిస్తున్న బ్లాక్ మనీగా టాస్క్ ఫోర్స్ పోలీసులు భావించి నగదుతో సహా టూ టౌన్ పోలీసులకి అతనిని అప్పగించారు. పన్నులు ఎగవేతలో భాగంగా అక్రమంగా ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న బ్లాక్ మనీగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై విశాఖ టూ టౌన్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 41, 102 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. -
దుస్తుల్లో రూ.1.36 కోట్లు తరలింపు
సాక్షి ప్రతినిధి, చెన్నై: దుస్తుల్లో దాచి రహస్యంగా రూ. 1.36 కోట్లు తీసుకెళుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యక్తులను చెన్నై ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలోని వాల్టాక్స్ రోడ్లో సోమవారం ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని అధికారులు చూశారు. వారిని దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు. తనిఖీ చేయగా వారు ధరించిన దుస్తుల నుంచి కట్టలు కట్టలుగా రూ. 1.36 కోట్ల నగదు బయటపడింది. వీరిని విజయవాడకు చెందిన బాషా, శ్రీనివాసులు, ఆంజనేయులు, షేక్ సలీంగా గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలూ లేకపోవడంతో ఎన్నికల్లో పంచేందుకు తరలిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. -
వరంగల్‌లో రూ.3.5 కోట్ల నగదు స్వాధీనం
కాజీపేట: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని సిద్దార్ధనగర్‌లో ఓ ఇంట్లో దాచి ఉంచిన సుమారు రూ.3.5 కోట్ల నగదును బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వర్ధన్నపేట ప్రజా ఫ్రంట్ అభ్యర్థి డాక్టర్ పి.దేవయ్యకు సమీప బంధువైన కాంగ్రెస్ నాయకుడు గంగారపు అమృతరావు ఇంటి సమీపంలో ఉంటున్న కేరళకు చెందిన ఓ వ్యక్తి నివాసంలో ఈ నగదు దొరికింది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దార్ధనగర్‌లో నివాసం ఉండే అమృతరావు తన ఇంటి పక్కన ఉన్న కేరళ వ్యక్తి ఇంటిని బుధవారం అద్దెకు తీసుకున్నారు. అద్దెకు ఇచ్చిన కొద్దిసేపటికే ముగ్గురు యువకులు లగేజీ బ్యాగ్‌లతో రెండు కార్లలో వచ్చారు. ఆ కొద్దిసేపటికే టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి.. ఆ ఇంటిలో ఉన్న దాదాపు రూ.3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. యువకుల మధ్య గొడవే పట్టించిందా... రెండు వాహనాల్లో నగదును తెచ్చిన యువకులు బహిరంగంగా రోడ్డుపై గొడవ పడడమే డబ్బుల గుట్టు తెలియడానికి కారణమైందనే చర్చ కాజీపేట పట్టణంలో జరుగుతోంది. ఎన్నికల అవసరాల కోసం తెచ్చిన డబ్బులు ఎవరి వద్ద ఉండాలనే విషయంలో యువకులు రోడ్డుపై వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో అటుగా వచ్చిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది విషయాన్ని ఆరా తీసి అధికారులకు సమాచారం అందించడంతో చాకచక్యంగా వ్యవహరించి నగదును పట్టుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అమృతరావు ఇంటిపై దాడి.. అమృతరావు ఇంటిలో ఇంకా ఏమైనా నగదు నిల్వలు ఉండొచ్చనే ఉద్దేశంతో పోలీసులు తనిఖీలు చేశారు. యువకులు డబ్బులతో వచ్చిన వాహనాలను తనిఖీ చేయగా కాంగ్రెస్ కండువాలు, జెండాలు బయటపడ్డట్టు తెలుస్తోంది. -
రూ.7.51 కోట్ల హవాలా నగదు స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి అవసరమైన నగదును రాజకీయ నేతలకు సమకూర్చడానికి హవాలా ఏజెంట్లు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా భారీ స్థాయిలో లిక్విడ్ క్యాష్‌ను సమీకరించుకుంటున్నారు. ఇలాంటి ఓ ముఠాపై పక్కా సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు నగరంలోని మూడు ప్రాంతాల్లో బుధవారం వరుస దాడులు చేశారు. ఈ దాడుల్లో మొత్తం రూ.7,51,10,300 నగదు స్వాధీనం చేసుకోవడంతోపాటు నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిలో ఒకరి నుంచి తుపాకీ సైతం రికవరీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారం ఆదాయపు పన్ను శాఖతో (ఐటీ) పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు (ఈడీ) అందిచనున్నట్టు సీపీ తెలిపారు. ఈ కేసు పూర్తి వివరాలను మధ్య మండల, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు పి.విశ్వప్రసాద్, పి.రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. వెల్లడించారు. ఇటు హవాలా..అటు మిత్తి దందా బంజారాహిల్స్‌లోని నవీన్‌నగర్ ప్రాంతానికి చెందిన తండ్రీకొడుకులు సునీల్ కుమార్ అహూజ, ఆషిశ్ కుమార్ అహూజాలు వీరిద్దరీ పేరుమీదా కొన్ని షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వ్యవస్థీకృతంగా నగదు అక్రమ లావాదేవీలు చేస్తున్నారు. సునీల్ పేరుతో ఏడు, ఆషిశ్ పేరుతో మరో ఆరు బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆయా కంపెనీల లావాదేవీల పేరుతో దేశవిదేశాల నుంచి భారీగా నిధులను బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ డబ్బును వివిధ ఓచర్ల సాయంతో డ్రా చేసి లిక్విడ్ క్యాష్‌గా మార్చి తమ ఇంట్లో భద్రపరుస్తున్నారు. ఈ తండ్రీకొడుకులిద్దరూ ఉత్తరాదితో పాటు విదేశాల్లో ఉన్న హవాలా ఏజెంట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి సూచనల మేరకు కమీషన్ తీసుకుంటూ నగరంలో నగదు డెలివరీ చేస్తున్నారు. అలాగే ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలను నగదు పంపాలని భావించిన వారి నుంచి డబ్బు తీసుకుంటూ ఆయాచోట్ల ఉన్న తమ ఏజెంట్ల ద్వారా డెలివరీ చేస్తున్నారు. దీంతోపాటు డబ్బు అవసరమైన వారికి దస్తావేజులు ష్యూరిటీగా పెట్టుకుని భారీ వడ్డీకి అప్పులు సైతం ఇస్తున్నారు. ‘ఎన్నికల నిధి’ ఏర్పాటు ప్రయత్నాల్లో.. ఎన్నికల్లో తమ ఖాతాల నుంచి తీసి ఖర్చు చేస్తే ఎన్నికల సంఘానికి దొరికిపోయే అవకాశం ఉంది కాబట్టి మొత్తాన్ని అక్రమమార్గంలో సమీకరించుకోవడానికి రాజకీయ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఈ తండ్రీకొడుకులతో టచ్‌లో ఉన్నారు. దీంతో ఎన్నికల ఖర్చులకు అవసరమైన డబ్బును కోరిన వారికి, కోరిన చోట అందించేందుకు ఈ వీరిద్దరూ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా అధిక వడ్డీకి, ఇతర అవసరాల నిమిత్తం ఇచ్చిన మొత్తాలను తిరిగి తీసుకుని తమ ఇంట్లో దాచారు. ఇందులో భాగంగా గోషామహల్ ప్రాంతానికి చెందిన వ్యాపారి భబుత్‌సింగ్ రాజ్ పురోహిత్‌కు అప్పుగా ఇచ్చిన రూ.2 కోట్లను బుధవారం తిరిగి తీసుకునే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయారు. మూడున్నర గంటల్లో మూడు చోట్ల.. భబుత్‌సింగ్ రాజ్ పురోహిత్‌కు అప్పుగా ఇచ్చిన రూ.2 కోట్లను తీసుకునేందుకు ఆషిశ్ తన డ్రైవర్‌తో కలిసి కారులో బయల్దేరారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న నగర పోలీసు కమిషనర్ దాడులకు ఆదేశించారు. దీంతో డీసీపీ, అదనపు డీసీపీల పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు సాయిని శ్రీనివాసరావు, బి.గట్టుమల్లు, సైఫాబాద్ ఇన్స్పెక్టర్ సీహెచ్ సైదిరెడ్డి తమ బృందాలతో రంగంలోకి దిగారు. తెల్లవారుజామున సైఫాబాద్ ప్రాంతంలో వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా రూ.2,00,65,500 నగదు లభించింది. కారులో ఉన్న ఆషిశ్, డ్రైవర్ అస్లంను అదుపులోకి తీసుకుని విచారించగా.. డబ్బును భబుత్‌సింగ్ నుంచి తీసుకున్నట్లు చెప్పారు. తర్వాత విచారణలో సునీల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సునీల్ ఇంటిపై దాడి చేసి రూ.5,47,75,150ను, షాహియాత్గంజ్ పరిధిలోని భబుత్‌సింగ్ ఇంటిపై దాడి చేసి రూ.3.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సునీల్, భబుత్సింగ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. -
నగదు, మద్యం సరఫరాపై నజర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖ రెండు ప్రధానాంశాలపై దృష్టి సారించింది. నగదు, మద్యం సరఫరా, పంపిణీలను నియంత్రించేందుకు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించింది. దీంతో గడిచిన 15రోజుల్లోనే రూ.25కోట్లకు పైగా నగదు సీజ్ చేసినట్టు పోలీస్ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఓటర్లను ప్రలోభపెట్టే ఈ రెండింటిని నియంత్రించడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్ర సరిహద్దుల్లో 29 చెక్‌పోస్టులు నగదు, మద్యం సరఫరాకు చెక్‌పెట్టేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో 29 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణకు ఉత్తర ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, దక్షిణ ప్రాంతంలో ఉన్న ఏపీ, కర్నాటక సరిహద్దుల్లో ఈ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ చెక్‌పోస్టుల వద్ద రెవెన్యూ అధికారులతో కలిసి పోలీస్ శాఖ పనిచేస్తోందని, ఎలాంటి లెక్కలు, పత్రాలులేని డబ్బును పట్టుకొని ఐటీ శాఖకు అప్పగిస్తున్నామని, ఇప్పటివరకు రూ.25 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. అదేవిధంగా 31జిల్లాల మధ్య ప్రధాన రహదారుల్లోనూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, ఇలా 79 చెక్‌పోస్టులు పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ చెక్‌పోస్టుల ద్వారా ఇప్పటివరకు 65వేల లీటర్ల మద్యం అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు. రంగంలోకి కేంద్ర బలగాలు... ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర బలగాలను భారీ స్థాయిలో మోహరించాలని పోలీస్ శాఖ ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఈ మేరకు రాష్ట్రంలోని 60వేల మంది పోలీస్ సిబ్బందితోపాటు మరో 300 కంపెనీల పారామిలిటరీ బలగాలు కావాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది. దీంతో నాలుగు రోజులక్రితం మొదటి దఫాలో భాగంగా 25 కంపెనీల బలగాలు రాష్ట్రానికి వచ్చాయని, మిగిలిన బలగాలు మరో వారంతర్వాత రెండు దఫాలుగా వస్తాయని, నోటిఫికేషన్ నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో ఈ కంపెనీలు పహారా కాస్తాయని ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖకు ప్రభుత్వం నుంచి రూ.100 కోట్ల మేర బడ్జెట్ రిలీజ్ అయ్యిందని, బలగాల సదుపాయాలతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లకోసం వీటిని వినియోగించనున్నట్టు సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారు. నామినేషన్ల తర్వాత పరిశీలకులు అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగియగానే పరిశీలకులు వస్తారని సీనియర్ ఐపీఎస్ ఒకరు తెలిపారు. జనరల్ అబ్జర్వర్లు, ఎక్స్పెండీచర్ అబ్జర్వర్లు, పోలీస్ అబ్జర్వర్లు ఇలా మూడు రకాల పరిశీలకులు రాష్ట్రానికి చేరుకుంటారని, అదేవిధంగా ప్రతీ నియోజకవర్గానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రెవెన్యూ అధికారులు అబ్జర్వర్లుగా వ్యవహరించనున్నట్టు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలోని ఎన్నికల తీరుతెన్నులు, విభాగాలు వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు అబ్జర్వర్లు నివేదికలు పంపిస్తారని, ప్రశాంత వాతావరణం, ఒత్తిడి లేకుండా అధికారులు, విభాగాలు పనిచేసేలా పోలీస్ శాఖ కృషిచేస్తోందని ఉన్నతాధికారులు వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో... రాష్ట్రంలోని ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలున్నాయని, ఈ ప్రాంతాల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మూడు పద్ధతుల్లో భద్రతా చర్యలు చేపట్టనున్నట్టు తెలిసింది. పోటీ చేస్తున్న అభ్యర్థులకు భద్రత కల్పించడం, ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది, పోలీసులకు రక్షణ కల్పించడం, మావోయిస్టుల నియంత్రణకు ముందస్తుగా ఛత్తీస్‌గఢ్, ఏపీ, మహారాష్ట్ర పోలీసులతో కోఆర్డినేషన్ చేసుకుంటున్నట్టు తెలిసింది. మావోయిస్టులు ఎన్నికల సమయంలో రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా ఉండేందుకు కూంబింగ్‌ను విస్తృ తం చేసినట్టు తెలిసింది. ఆయా రాష్ట్రాల అధికారులతో నిత్యం సంప్రదింపులు, సమాచార మార్పిడి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఉన్నతాధికారులు తెలిపారు. -
చిత్తూరు జిల్లాలో భారీగా పట్టుబడుతున్న నగదు, మద్యం!
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో భారీగా మొత్తంలో నగదు, మద్యం పట్టుబడుతున్నాయి. ఓటర్లను మభ్యపెట్టేందుకు పత్తివేడు మండలం టీవీపురంలో టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. టీవీ పురంలో ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తుండగా పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 9 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకుని, ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. ఇంకా పలమనేరు మండలం సముద్రపల్లిలో టీడీపీ నేతలకు చెందిన 90 కేసుల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే నగరి నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు గురిచేస్తూ వడమాలపేట వద్ద 1.80 లక్షల రూపాయలతో టీడీపీ నేత అజారుద్దీన్ పట్టుబడ్డారు. పాకాలలో ఓటర్లను మభ్య పెడుతున్న టీడీపీ నేత మునీశ్వర్‌రెడ్డి నుంచి 3 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని, వాహనం సీజ్ చేశారు.