
సాక్షి, విశాఖపట్నం: నగరంలో హవాలా రాకెట్ గుట్టురట్టయింది. ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.50.38 లక్షల బ్లాక్ మనీని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన గ్రంథి నరసింహారావు నరసాపురంలో జయదేవి జ్యువెలర్స్ లో గుమస్తాగా పనిచేస్తాడు. అతను అనుమానాస్పదంగా విశాఖ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో తిరుగుతుండటంపై టాస్క్ ఫోర్స్ పోలీసులకి సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ త్రినాధ్ ఆధ్వర్యంలో బృందం అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా 50.38 లక్షలను విశాఖ నుంచి నరసాపురం తరలించడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు.
నరసాపురంలోని జయదేవి జ్యువెలర్స్ యాజమాని ప్రవీణ్ కుమార్ జైన్ తనని ఇక్కడికి పంపించారని...అంతకుమించి తనకు తెలియదని గుమస్తా నరసింహరావు టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అతని దగ్గర ఉన్న ఫోన్ లో సీక్రెట్ కోడ్ ఉండటంతో హవాలా మార్గంలో తరలిస్తున్న బ్లాక్ మనీగా టాస్క్ ఫోర్స్ పోలీసులు భావించి నగదుతో సహా టూ టౌన్ పోలీసులకి అతనిని అప్పగించారు. పన్నులు ఎగవేతలో భాగంగా అక్రమంగా ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న బ్లాక్ మనీగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై విశాఖ టూ టౌన్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 41, 102 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..