కూటమి నేతలు రాజకీయ బ్రోకర్లు | Prajakutami leaders are political brokers says Rachana Reddy | Sakshi
Sakshi News home page

కూటమి నేతలు రాజకీయ బ్రోకర్లు

Published Mon, Dec 3 2018 3:47 AM | Last Updated on Mon, Dec 3 2018 10:51 AM

Prajakutami leaders are political brokers says Rachana Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ జన సమితి(టీజేఎస్‌)కి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, అడ్వొకేట్‌ రచనారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆమెతోపాటు మర్రి శశిధర్‌రెడ్డి తనయుడు ఆదిత్యారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ప్రకటించారు. ఈ సందర్భంగా టీజేఎస్‌ అధినేత కోదండరాంపై రచనారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కూటమి కూర్పే లేదన్నారు. ఈ విషకూటమితో ప్రత్యామ్నాయం వచ్చే అవకాశం లేదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. మరో రాష్ట్రానికి చెందిన సీఎం ఇక్కడ ప్రచారానికి రావడమే తప్పని, తెలంగాణ ప్రజలు ఎంతో అవగాహన కలిగిన వారని అన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు కచ్చితంగా తిరస్కరిస్తారని, ఆయన చేసే కుట్రలు వారికి బాగా తెలుసని చెప్పారు. కూటమిలో ఏ క్యాడర్‌ పనిచేస్తలేదని, కూటమి పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కూటమిలోని నేతలు రాజకీయ బ్రోకర్లుగా తయారయ్యారని, కూరగాయల మాదిరిగా అసెంబ్లీ సీట్లు అమ్ముకున్నారని తీవ్రంగా విమర్శించారు. టీజేఎస్‌ పెట్టడానికి కారణాలు ఏంటి? మీరు చేస్తున్నదేంటి? అని ప్రశ్నిస్తూ టీజేఎస్‌ను నమ్ముకున్న వారిని నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే ప్రజాకూటమి ఫిక్స్‌ అయిందని, కూటమితో కోదండరాం అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.  

కూటమిలో సామాజిక న్యాయంలేదు... 
ప్రజాకూటమి కూర్పులో సామాజిక న్యాయం జరగలేదని, కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని రచనారెడ్డి ఎద్దేవా చేశారు. ఉద్యమకారులకు ప్రాధాన్యం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలకు టీజేఎస్‌ ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదని, దీంతో మైనార్టీలకు ఏవిధంగా న్యాయం జరిగినట్లో చెప్పాలన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారన్నారు. కూటమిలో చాలామంది నేతలను బలిపశువులను చేశారని మండిపడ్డారు. కోదండరాం కాంగ్రెస్‌తో కలసి తనకు తానే ఓటమి చెందుతున్నారని, అసలు కూటమి ఏర్పడింది.. గెలువడానికా లేక ఓడిపోవడానికా అని ప్రశ్నించారు. కోదండరాం కూటమి కన్వీనర్‌ అంటే.. ఏ దేశానికి రాజు? అని ఎద్దేవా చేశారు. పార్టీకి కామన్‌ మినిమం ప్రోగ్రాం లాంటి పెద్ద, పెద్ద పదాలు పనికిరావన్నారు. టీజేఎస్‌ ఒక్క సీటు కూడా గెలవకపోతే రాజ్యసభ, ఎమ్మెల్సీ, బోర్డుమెంబర్‌ పదవి కూడా ఇవ్వరని, కనీసం వారి ఫోన్లను కూడా కాంగ్రెస్‌ వారు ఎత్తరని ఎద్దేవా చేశారు. తమ వెంట పడి టీజేఎస్‌లో చేరేవరకు వదిలిపెట్టలేదని, చేరాక పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశా రు.

టీజేఎస్‌కు అడిగినన్ని టికెట్లు ఇవ్వనప్పుడు కోదండరాం కూటమి నుంచి ఎందుకు బయటకు రాలేదని, చర్చల పేరుతో హోటళ్లలో సమావేశాలు పెట్టి ఎందుకు టైంపాస్‌ చేశారని దుయ్యబట్టారు. రాహుల్‌ పారాచూట్లకు టికెట్లు ఇవ్వవద్దని, కుటుంబంలో ఒక్కటే టికెట్‌ ఇవ్వాలని, వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వారికి టికెట్లు కేటాయించవద్దని చెప్పినా దాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ తుంగలో తొక్కారని ఆరోపించారు. ఎందుకూ పనికిరాని పొలిటికల్‌ బ్రోకర్లు కాంగ్రెస్‌లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోదండరాం.. మమ్మల్ని ఎందుకు పా ర్టీలోకి తెచ్చావు? నిన్ను నమ్ముకుని వచ్చిన వారిని మోసం చేశావు, వారి భవిష్యత్‌ ఇక్కడికే అంతమైంది. కాంగ్రెస్‌తో మీ డీలింగ్‌ ఏమిటి’ అని ప్రశ్నించారు. ‘16 నుంచి 18 పేర్ల తో జాబి తా తయారు చేసి, గంటకు ఒకరి పేరు జాబితాలో మార్చారు. నీవు అది తీసుకో, నేను ఇది తీసుకుంటానంటూ బఠానీలూ, పల్లీల్లా బేరసారాలు చేశారు’ అని ఆమె విమర్శించారు.

రచనారెడ్డి సస్పెన్షన్‌..
టీజేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రచనా రెడ్డి, మర్రి ఆదిత్యరెడ్డిలను ప్రాథమిక సభ్య త్వం నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, అధికార ప్రతినిధి జి.వెంకట్‌రెడ్డి విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ పార్టీ వ్యతిరేక కార్యక లాపాలకు పాల్పడినందున వారిని సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించారు.

ప్రశ్నిస్తే నాపై దాడికి యత్నం...
అన్నింటికీ డబ్బులేనని, అలాంటప్పుడు కూటమి ఎందుకని రచనారెడ్డి ప్రశ్నించారు. మర్రి కుటుంబాన్ని కూడా కూటమిలో బాధితులుగా చేశారన్నారు. తాను ఒక్కసారే సీటు అడిగానని, ఎవరో డబ్బులు ఇచ్చి తనతో స మావేశం పెట్టించారనే దాంట్లో వాస్తవంలేదని ఆమె అన్నారు. జనసమితి సమావేశాల్లో ప్రశ్నిస్తే తనపై దాడి చేసేందుకు యత్నించా రని ఆరోపించారు. కోదండరాం 2014 వరకు ఉద్యమం చేశారని, తరువాత ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. గడిచిన నాలుగేళ్లలో కూటమిలోని సభ్యులు ఎవరూ ఏం చేయలేదని, వారు ఏం చేయలేకపోవడంవల్లే తాను న్యాయస్థానంలో కేసులు వేశానని తెలిపారు.

మర్రి ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ కూటమిలో టికెట్లు అమ్ముకున్నది వాస్తవమని, తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, దీనిపై విచారణ చేపట్టాలన్నారు. ‘కోదండరాం ఢిల్లీ వెళ్లి అమిత్‌ షాను కలిసిన మాట వాస్తవం కాదా.. అమిత్‌ షా 40 సీట్లు ఇస్తామని ఒప్పుకోలేదా..’ అని ప్రశ్నించారు. కూటమి ఏర్పాటుకు ముందే ఉప్పల్‌ సీటును టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌ కుమారుడికి ఎలా కేటాయించారని ప్రశ్నించారు. కోదండరాం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, వర్ధన్నపేట సీటును అడగకున్నా టీజేఎస్‌కు ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement