‘కల్వకుంట్ల’ పాలనకు కాలం చెల్లింది | madhu yaskhi attacked on kalvakuntla family rule | Sakshi
Sakshi News home page

‘కల్వకుంట్ల’ పాలనకు కాలం చెల్లింది

Published Sun, Dec 9 2018 5:10 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

madhu yaskhi attacked on kalvakuntla family rule - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో ‘కల్వకుంట్ల’ కుటుంబ పాలనకు కాలం చెల్లిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సరళి చూస్తుంటే ప్రజా కూటమి విజయం ఖాయమని స్పష్టమవుతోందన్నారు. శనివారం గాంధీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్‌ దాడులకు పాల్పడిందని ఆరోపించారు. పోలింగ్‌ రోజున రోహిత్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డిపై దాడి ఇందులో భాగమేనన్నారు.

హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వెళుతుండగా తనపై మెట్‌పల్లి వద్ద జరిగింది సాధారణ దాడి కాదని, తనను హతమార్చే కుట్ర అని ఆరోపించారు.పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేశారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభంజనం వీస్తోందని, ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగింటిలో కాంగ్రెస్‌ విజయం ఖాయ మని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో సైతం ప్రజలు ‘ప్రజాకూటమి’వైపు మొగ్గు చూపారన్నారు. తాము ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలను విశ్వసించబోమని, గతంలో చాలా ఎన్నికల విషయంలో ఆ సర్వేలు తప్పని తేలిందని గుర్తు చేశారు. లగడపాటి సర్వేపై కేసీఆర్, కేటీఆర్‌లకు వణుకుపుడుతోందన్నారు. ఆయన సర్వే తమకు అనుకూలంగా వచ్చినప్పుడు టీఆర్‌ఎస్‌ నేతలు ఎగిరెగిరి గంతులేసి, వ్యతిరేకంగా వస్తే విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.  

ప్రగతి భవన్‌ను ఖాళీ చేయాల్సిందే: కుసుమ కుమార్‌  
ఇక సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ను ఖాళీ చేయాల్సిందేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్‌ అన్నారు. తెలంగాణలో ప్రజాకూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ మీడియా తెలంగాణ ప్రజల నాడిని పసిగట్టడంలో విఫలమైందన్నారు.

వంశీచంద్‌రెడ్డిని పరామర్శించిన ఉత్తమ్‌
హైదరాబాద్‌: ప్రత్యర్థుల దాడిలో గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్వకుర్తి ప్రజాకూటమి అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

నిమ్స్‌ ఆస్పత్రిలో కల్వకుర్తి ప్రజాకూటమి అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని పరామర్శిస్తున్న ఉత్తమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement