బెట్టింగ్‌ బంగార్రాజులు! | Huge betting on the results of the Telangana assembly elections | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ బంగార్రాజులు!

Published Sun, Dec 9 2018 1:38 AM | Last Updated on Sun, Dec 9 2018 1:38 AM

Huge betting on the results of the Telangana assembly elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీగా బెట్టింగ్‌ జరుగుతోంది. పోలింగ్‌ సరళిపై వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఓటరు నాడిని సరిగ్గా అంచనా వేయలేదనే ప్రచారం ఊపందుకోవడంతో అన్ని చోట్లా బెట్టింగ్‌కు తెరలేచింది. అధికార టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో కూడిన విపక్ష ప్రజాకూటమి నుంచి గట్టి పోటీ ఎదురైందనే వాదన బలంగా ఉండటం, చాలా చోట్ల అభ్యర్థులు పొటాపొటీగా తలపడటంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉందన్న అంచనా సర్వత్రా నెలకొంది. దీనికితోడు ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేయగలరనే పేరున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చేయించిన సర్వే ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉండటం ఎన్నికల ఫలితాలపై మరింత ఉత్కంఠ రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుందనే అంశంపై పందేలు జోరందుకున్నాయి. అభ్యర్థుల గెలుపోటములతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏమిటనే అంశాలపై బెట్టింగ్‌ బంగార్రాజులు రంగంలోకి దిగారు. రూ. 5 వేలు మొదలు రూ. 10 లక్షల వరకు పందేలు కాస్తున్నారు. పందెంలో గెలుపొందితే పెట్టిన మొత్తానికి రెట్టింపు, ఆపైన ఇచ్చేలా కొందరు ఆఫర్లు ప్రకటిస్తుండటంతో వ్యాపారం జోరుగా సాగుతోంది.

సీమాంధ్రలోనూ భారీగా పందేలు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీమాంధ్ర ప్రాంతం లోనూ తీవ్ర ఆసక్తి కనిపిస్తోంది. తెలంగాణలో కంటే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బెట్టింగ్‌ మరింతగా సాగుతోంది. రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు నగదుతో ఔత్సాహికులు బెట్టింగ్‌లో పాల్గొం టుండగా... కొన్నిచోట్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఏకంగా ప్లాట్లను కూడా పందెంలో పెడుతున్నారు. మరికొందరైతే ఏకంగా ఒప్పంద పత్రాలు సైతం రాసుకుంటున్నారు. సాధారణంగా ఆంధ్రా ప్రాంతంలో కోడి పందేలు భారీ స్థాయిలో జరగడం సాధారణమే అయినా ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు కూడా అదే స్థాయిలో జరుగుతుండడం గమనార్హం.

సీట్లెవరికి..? మెజారీటీ ఎక్కడ?
బెట్టింగ్‌ ప్రక్రియలో వివిధ అంశాలను పేర్కొంటే కేటగిరీలవారీగా పందెం కాస్తున్నారు. ఎక్కువ సీట్లు వచ్చే పార్టీ ఏమిటనే దానిపైనే ఎక్కువగా బెట్టింగ్‌ నడుస్తోంది. ఆ తర్వాత ప్రముఖుల గెలుపోటములు, మెజారిటీపై పందెం జోరుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఎవరిది పైచేయి అనే అంశంపైనా ఎక్కువ మంది బెట్టింగ్‌ చేస్తున్నారు. ఈసారి ఎక్కువగా పోలింగ్‌ నమోదు కావడంతో పట్టణ ప్రాంతాల్లో సీట్లు, గ్రామీణ ప్రాంతాల్లో సీట్లు ఏయే పార్టీలకు వస్తాయి... జీహెచ్‌ఎంసీ పరిధిలో సీట్లు, మెజారిటీ, హైదరాబాద్‌ జిల్లా, సికింద్రాబాద్‌ పార్లమెంటు స్థానాల గెలుపోటములపైనా పందేలు జరుగుతున్నాయి.

చూపంతా తెలంగాణపైనే...
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికలకు ఈ ఎలక్షన్లను సెమీఫైనల్‌గా భావించిన రాజకీయ పార్టీలు ఆ మేరకు ప్రచారపర్వాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీకి సిద్ధమయ్యాయి. మొత్తంగా అన్ని పార్టీలకు చెందిన అతిరథ మహారథులంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని టీఆర్‌ఎస్‌ ముందుకెళ్లగా... అధికార పార్టీని పడగొట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి పోరాడింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్‌ శాతాన్ని మెరుగుపర్చుకోవడంతోపాటు ఎక్కువ సీట్లు గెలవాలని నిర్ణయించిన బీజేపీ కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఈ క్రమంలో ఎవరికి వారు తీవ్రంగా శ్రమించినప్పటికీ... ఓటరు నాడి మాత్రం అంతుచిక్కలేదు. ఉత్తరాదిలో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో ఎన్నికల ఫలితాలపై కొంత స్పష్టత వచ్చినప్పటికీ తెలంగాణలో మాత్రం తేలకపోవడంతో దేశమంతా రాష్ట్ర ఫలితాలపైనే ఆసక్తి చూపుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement