ఉద్దండుల నల్లగొండ..ఎగిరేది ఏ జెండా? | Political analysis of Nalgonda Politics | Sakshi
Sakshi News home page

ఉద్దండుల నల్లగొండ..ఎగిరేది ఏ జెండా?

Published Sun, Dec 2 2018 5:35 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Political analysis of Nalgonda Politics - Sakshi

సాయుధ పోరు నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు.. అడుగడుగునా నల్లగొండ జిల్లా రాజకీయ చైతన్య ఖిల్లా. 12 నియోజకవర్గాలతో కూడిన ఈ జిల్లా.. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ను సమానంగా ఆదరించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 5, సీపీఐ 1 స్థానం గెలవగా, టీఆర్‌ఎస్‌ ఆరు స్థానాలను కైవసం చేసుకుంది. మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇక్కడి వారే కావడం, ముందు నుంచీ కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలుస్తున్న ఈ జిల్లాపై టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. కుల, వర్గ సమీకరణలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పార్టీ అభ్యర్థులను ఎంపిక చేశారు. కేసీఆర్‌ వ్యూహాలకు చెక్‌పెట్టి జిల్లాపై పట్టును నిలుపుకునేందుకు కాంగ్రెస్‌ సీనియర్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాము నెగ్గడంతో పాటు తమ వర్గం అభ్యర్థులను గెలిపించుకోవడం జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటి అగ్ర నాయకులకు ప్రతిష్టాత్మకంగా మారింది. 

తుంగతుర్తి: పోటీ జబర్దస్తీ
తుంగతుర్తిలో తాజా మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌ (టీఆర్‌ఎస్‌), అద్దంకి దయాకర్‌ (కాంగ్రెస్‌) మరోసారి పోటీపడుతున్నా రు. తెలంగాణ సెంటిమెంట్‌తో గత ఎన్నికల్లో కిశోర్‌ స్వల్ప మెజా ర్టీతో గెలుపొందారు. గురజాల–మానాయికుంట బ్రిడ్జి నిర్మాణం, సంక్షేమ పథకాలు, తిరుమలగిరి, మోత్కూరును మున్సిపాల్టీలుగా చేయడం తన విజయానికి కలిసి వస్తాయన్న నమ్మకంతో కిశోర్‌ ఉన్నారు. అయితే, నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామేల్‌ ప్రచారానికి రావడం లేదు. కాగా, ప్రజల్లో ఉన్న అసంతృప్తి.. తన విజయానికి దోహదపడుతుందనే ధీమాతో అద్దంకి దయాకర్‌ ఉన్నారు. తుంగతుర్తికి సాగు నీళ్లు తీసుకురాకపోవడాన్ని ప్రచార అస్త్రంగా చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో బంధుగణం భారీగా ఉండటం, గతంలో ఓడిపోయాననే సానుభూతితో గెలుపొందుతాననే ఆశతో ఉన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన డాక్టర్‌ వడ్డేపల్లి రవి ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు.

సూర్యాపేట: ముగ్గురి పోటీతో ఉత్కంఠ 
రాజకీయ చైతన్యానికి మారుపేరైన సూర్యాపేటలో మూడు ప్రధాన పార్టీలు తలపడుతున్నాయి. ఆపద్ధర్మ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్‌), సంకినేని వెంకటేశ్వరరావు (బీజేపీ) మధ్య పోటీ ఆసక్తి కలిగిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులు, సూర్యాపేట జిల్లా ఏర్పాటు, మెడికల్‌ కాలేజీ వంటి అంశాలు తనకు మేలు చేస్తాయనే ధీమాతో జగదీశ్‌రెడ్డి ఉన్నారు. గతంలో తెలంగాణ సెంటిమెంట్‌ కారణంగా స్వల్ప మెజారిటీతో గెలిచిన ఆయన.. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కావడంతో భరోసాతో ఉన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన పటేల్‌ రమేశ్‌రెడ్డి తొలుత బెట్టుచేసినా ఆ తర్వాత కలిసిరావడంతో దామోదర్‌రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు. ఇక, గత ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చి రెండోస్థానంలో నిలిచిన సంకినేని.. తన అంగ, ఆర్థిక బలాలతో ప్రత్యర్థులకు దీటుగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ముగ్గురిలో పేట ప్రజానీకం ఎవరిని ఎన్నుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

జనం గుండెచప్పుడు
- ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా పథకాలపై జిల్లాలోని రైతుల్లో సానుకూలత ఉంది
భూములున్న వారికి ప్రభుత్వం రైతుబంధు కింద డబ్బులు పంపిణీ చేస్తోందని, భూమి లేని పేదలైన తమకు ఏమీ ప్రయోజనం లేదని వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు అంటున్నారు
వృద్ధాప్య పింఛన్‌ను రూ.1,000, వికలాంగ పింఛన్‌ను రూ.1,500కు పెంచడంపై వృద్ధులు, వికలాంగులు ఆనందంగా ఉన్నారు
నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ స్థానాల్లో నిర్ణయాత్మక సంఖ్యలో ఉన్న ముస్లింలలో 12 శాతం రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు అక్కడి నుంచి డిండి ప్రాజెక్టుకు నీళ్లను తరలించేందుకు చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగ నిర్మాణం పనులు త్వరగా పూర్తి కావాలని రైతులు కోరుకుంటున్నారు
ప్రజా కూటమి తరఫున చంద్రబాబు ప్రచారం నిర్వహించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది
పాతికేళ్ల తర్వాత తొలిసారిగా మూసి నది నీళ్లు రెండు పంటలకు ఇవ్వడంపై సూర్యాపేట, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో కొంత వరకు సానుకూలత ఉంది.

నల్లగొండ: ఎవరికో దండ?
నల్లగొండలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్‌), కంచర్ల భూపాల్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌) మధ్య రసవత్తరమైన పోరు జరుగుతోంది. తీవ్ర పోటీ ఉన్నా.. ఇక్కడి నుంచి వరుసగా ఐదోసారి గెలిచేందుకు వెంకట్‌రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నా రు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన ఓటుబ్యాంకు ఉంది. గతంలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన కోమటిరెడ్డి ముఖ్య అనుచరులు మళ్లీ తిరిగి పాత గూటికి చేరడంతో వెంకట్‌రెడ్డి పుంజుకున్నారు. నిర్ణయాత్మకమైన ముస్లింల ఓట్లు ఈసారి చీలనుండడం ఆయనను కలవరపెడుతోంది. గత నాలుగు దఫాలుగా నియోజకవర్గంలో చేసిన పనులు, సా ధించుకున్న మాస్‌ లీడర్‌ ఇమేజ్‌ ప్లస్‌ కా నుంది. గత ఎన్నికల్లో స్వతంత్రుడిగా బరిలో దిగి గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయిన కంచర్ల భూపాల్‌రెడ్డిపై కొంత సానుభూతి ఉంది. నాలుగుసార్లు కోమటిరెడ్డిని గెలిపించారని, తనకు ఒక చాన్స్‌ ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

‘ఎర్ర’కోటలో ఎవరికి చోటు?
సీపీఐ కంచుకోట దేవరకొండలో తాజా మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌ (టీఆర్‌ఎస్‌), బాలునాయక్‌ (కాంగ్రెస్‌) తలపడుతున్నారు. 2014లో సీపీఐ నుంచి గెలిచి ఆపై టీఆర్‌ఎస్‌లో చేరిన రవీంద్రకుమార్‌.. ఈసారి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి గెలిపిస్తాయని నమ్మకంతో ఉన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు సైతం చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉండడం, సీపీఐ కేడర్‌ కలిసిరావడంతో గెలుపుపై బాలునాయక్‌ ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి 4,216 ఓట్ల తేడాతో ఓడిపోయిన బిల్యానాయక్‌ ఇటీవల రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కానీ, కూటమి నుంచి టికెట్‌ దక్కకపోవడంతో బీఎస్పీ తరఫున బరిలోకి దిగారు. ఇది బాలునాయక్‌కు కొంత ప్రతికూలం కానుంది. 

భువనగిరి: కోటలో గెలుపు వేటగాళ్లు
కాకతీయ రాజుల కోట భువనగిరిలో తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌) మధ్య పోటీ నెలకొంది. టీడీపీ సీనియర్‌ నేత ఉమామాధవరెడ్డి కొంత కాలం కింద టీఆర్‌ఎస్‌లోకి చేరడంతో శేఖర్‌రెడ్డి బలం కొంత పెరిగింది. మూసీ ప్రాజెక్టు కింద బునాదిగాని కాలువను వెడల్పు చేయడంతో పంటలకు నీటిసరఫరా పెరగడం ఆయనకు కలిసొచ్చే అంశం. బోర్లు, వాటర్‌ ఫిల్టర్ల ఏర్పాటు, పేద విద్యార్థులకు చదువులు చెప్పించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ అనిల్‌కుమార్‌రెడ్డి పేరుతో కొత్త ముఖాన్ని బరిలోకి దించింది. ఈయన టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీనిస్తున్నారు. ఇక, యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా రెండోసారి పొటీ చేస్తున్న జిట్టా బాలకృష్ణారెడ్డికి ఈసారి బీజేపీ మద్దతునిస్తోంది. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఈయనపై కొంత సానుభూతి ఉంది.  

హుజూర్‌నగర్‌: బిగ్‌ ఫైట్‌
హుజూర్‌నగర్‌లో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి.. శానంపుడి సైదిరెడ్డి (టీఆర్‌ఎస్‌) నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం పదవికి పోటీలో ఉంటారనే ప్రచారంతో పాటు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు ఆయనకు కలిసొచ్చే అంశాలు. పీసీసీ చీఫ్‌ బాధ్యతల కారణంగా ఆయన ప్రచారంలో కొంత వెనకబడ్డారు. అయినా, పోలింగ్‌కు రెండు రోజుల ముందు రంగంలో దిగి పరిస్థితులను అనుకూలం గా మార్చుకుంటారనే పేరుంది. ఎన్‌ఆ ర్‌ఐ అయిన సైదిరెడ్డి కొత్త ముఖమైనా.. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం, రైతు ల నుంచి ఆదరణ లభిస్తుండడం ఆయనకు ఊపునిస్తోంది. ఈయనిక్కడ తం డ్రి పేరుపై సేవలందిస్తున్నారు. రాజకీ య అనుభవం లేకున్నా.. నియోజకవర్గ వ్యాప్తంగా బంధుగణం ఉంది. 

మునుగోడు: ఎవరి తోడు?
మునుగోడులో తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌) హోరాహోరీ తలపడుతున్నారు. గత ఎన్నికల్లో బలహీన ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో సునాయాసంగా గెలిచిన ప్రభాకర్‌రెడ్డి..ఈసారి రాజగోపాల్‌రెడ్డి రూపంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పథకాలనే నమ్ముకుని ప్రచారం సాగిస్తున్నారు. ఇక, అసెంబ్లీలో అడుగుపెట్టాలనే చిరకాల కోరికను నెరవేర్చుకోవడానికి రాజగోపాల్‌రెడ్డి తొలిసారి ఇక్కడ పోటీకి దిగారు. ఎంపీ, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయనకు నియోజకవర్గంపై పట్టుండటం సానుకూల అంశం.  

నకిరేకల్‌: పాతకాపుల బరి 
ఒకనాటి కమ్యూనిస్టుల కంచుకోట, మినీ పశ్చిమబెంగాల్‌గా పేరొందిన నకిరేకల్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య పో టీ నువ్వానేనా అన్నట్టుంది. గెలిస్తే మంత్రిని చేస్తానని ఇటీవల సీఎం కేసీ ఆర్‌ హామీ ఇచ్చారనే ప్రచారంతో తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (టీఆర్‌ఎస్‌) ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య (కాంగ్రెస్‌) గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఈయన గెలుపును కోమటిరెడ్డి బదర్స్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

ఆలేరు: యాదగిరీశుడిపైనే భారం
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ్మస్వామి నిలయమైన ఆలేరులో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ హోరాహోరీ తలపడుతున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి (టీఆర్‌ఎస్‌) ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను నమ్ముకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ చూపిన చొరవ టీఆర్‌ఎస్‌కు కలిసి రానుంది. ఇక్కడి గుండాల మండలం జనగాం జిల్లాకు వెళ్లిపోవడం కొంత ఇబ్బందికరం. తపాస్‌పల్లి నీళ్లు రాజపేట మండలానికి కాకుండా సిద్దిపేటకు తరలించారనే చర్చ ఉంది. అయితే, ప్రభుత్వ వ్యతిరేకత, గతంలో చేసిన పనులు, పరిచయాలతో గెలుపే లక్ష్యంగా భిక్షమ య్య (కాంగ్రెస్‌) ప్రచారం చేస్తున్నారు. ఆయనకు కొంత వరకు బీసీ ఓట్లు ప్లస్‌ కానున్నాయి. ఇక్కడ నాలుగుసార్లు గెలి చిన సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సిం హులు (బీఎల్‌ఎఫ్‌) మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన కొంత వరకు పోటీ ఇవ్వనున్నారు. 

రెండు పార్టీల ‘సాగర్‌’ మథనం 
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.జానారెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలతో మమేకమైపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలంగానే ఉంది. సీఎల్పీ నేతగా పనిచేయడం వల్ల జానారెడ్డి ప్రజలకు కొంత దూరమయ్యారనే ప్రచారం ఉంది. టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్న నోముల నర్సింహయ్యకు బీసీల మద్దతు కొంతవరకు ఉండటం అనుకూలాంశం. జానారెడ్డికి దశాబ్దాలుగా వెన్నుదన్నుగా నిలిచిన ద్వితీయ శ్రేణి ముఖ్యనేతలు టీఆర్‌ఎస్‌లో చేరడం కలిసొచ్చే అంశం. బీజేపీ అభ్యర్థి నివేదితరెడ్డి చీల్చనున్న ఓట్లు వీరి గెలుపోటములను నిర్దేశిస్తాయని అంచనా.

కోదాడ: ధాటిగా పోటీ
రాష్ట్ర సరిహద్దులో ఉన్న కోదాడలో పీసీసీ అధినేత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సతీమణి, తాజా మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి (కాంగ్రెస్‌), బొల్లం మల్లయ్య యాదవ్‌ (టీఆర్‌ఎస్‌) నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నారు. ఈ స్థానాన్ని నిలుపుకోవడం ఉత్తమ్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఉత్తమ్‌తో పాటు ఆయన భార్య నియోజకవర్గానికి దూరమయ్యారనే వాదన ఉంది. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కారణంగా టీడీపీ టికెట్‌ లభించక బొల్లం మల్లయ్య యాదవ్‌ చివరిక్షణంలో టీఆర్‌ఎస్‌లో చేరి టికెట్‌ పొందారు. గతంలో రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి ఆయనపై ఉంది. బీసీల మద్దతు కలిసిరావచ్చు. టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శశిధర్‌రెడ్డి రెబల్‌గా తప్పుకున్నా.. మల్లయ్యకు ప్రచారంలో సహకరించడం లేదు. ఇక్కడి ఫలితంపైనా అంతటా ఆసక్తి నెలకొంది. 

మిర్యాలగూడ: పోటాపోటీగా..
వ్యాపార కేంద్రమైన మిర్యాలగూడలో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లమోతుల భాస్కర్‌రావు (టీఆర్‌ఎస్‌), ఆర్‌.కృష్ణయ్య (కాంగ్రెస్‌) బరిలో నిలిచారు. జానారెడ్డి అనుచరుడైన భాస్కర్‌రావు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతో పాటే టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి తదితరులు సహకరిస్తున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆర్‌.కృష్ణయ్యకు చివరి నిమిషంలో టికెట్‌ రావడంతో ప్రచారంలో కొంత వెనకబడ్డారు. రాష్ట్రంలోని వివిధ బీసీ కుల సంఘాల నేతలు మిర్యాలగూడలో తిష్టవేసి ఆయన గెలుపునకు పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన అమరేం దర్‌రెడ్డి కూడా కృష్ణయ్యకు మద్దతు తె లుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్‌ కుమారుడు ధిరావత్‌ స్కైలాబ్‌ స్వతంత్రంగా పోటీ చేస్తుండడంతో గిరి జనుల ఓట్లు చీలి..కాంగ్రెస్‌ ఓట్లకు గం డిపడొచ్చు. గతంలో 3సార్లు ఇక్కడ గెలి చిన సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి బీఎల్‌ఎఫ్‌ తరఫున పోటీ చేస్తున్నారు. 

ఇంకో ఐదారేళ్లుండాలె..
ఎడారిలో గిన్నిగిన్ని నీళ్లు పడేటోళ్లకు ఇబ్బందిగా ఉంటది గానీ నీళ్లు ఉన్నోళ్లకి మాత్రం పంటలు ఫుల్లు. 24 గంటలు కరెంట్‌ ఇచ్చుడు మేలు. ఇంతకు ముందు ఘోరమైన పరిస్థితి ఉండేది. మూడు గంటల కరెంట్‌ వల్ల ఏమైతది. ఆ వట్టి మడి పట్టాలంటే కాసేటి నీళ్లు తాగతదా? రైతుబంధు వచ్చింది. చచ్చిపోయినోళ్లకు రైతుబీమా వచ్చింది. ఆసామికి ఎలాంటి ఢోకా లేదు. ఇంకో ఐదారు సంవత్సరాలు ఈ సర్కారుంటే రైతులు కొలుకుంటరు ఇగ.
– బీ మాధవరెడ్డి, దీపకుంట, నల్లగొండ

మా గురించి ఆలోచించాలి
పిల్లలకు కొలవులున్నయని పింఛన్‌ ఆపేశారు. కొడుకు ఉద్యోగం చేసుకుంటూ ఏడో ఉంటడు. వాడి ఇంటి కిరాయికి, పిల్లల చదువులకే వాడి సంపాదన సరిపోదు. ఇగ మాకేం ఇస్తడు. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మా ఇద్దరి (భార్యభర్తలు)కి పింఛన్‌ వచ్చేది. ఇప్పుడు ఇవ్వకపోతే కష్ట మైతోంది. సర్కారు మాసొంటోళ్ల గురించి ఆలోచించాలె. మాకు కూడా పింఛన్‌ ఇస్తే సర్కారుకు రుణపడి ఉంటాం.
– ఎరుకుల పెద్దులు, పర్వతగిరి, కనగల్‌

జర మమ్మల్నీ చూడుండ్రి
భూమి ఉన్నోళ్లకు ఎకరానికి రూ.4 వేలు చొప్పున ఇస్తున్రు. మోటార్లకు కరెంట్‌ బిల్లులు లేవు. ఇవన్నీ వాళ్లకే దక్కుతుంటే కూలీ చేసే మాలాంటోళ్లు ఎప్పుడూ వెనకబడాల్నా సారూ! మా అసోంటోళ్లకు కూడా ఎకరమైనా ఇస్తే ఆ కేసీఆర్‌ సారు మీద అభిమానాన్ని జీవితాంతం యాద్‌ జేస్కుంటం. తమామ్‌ లేనోడ్ని ఇంకా వెనకపడేస్తురు కాదు.. పైకి తీసుకురావాల్నె. మా బతుకులూ బాగుండాలె..
– నిర్మల, చండూరు, కార్మికురాలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement