సోమవారం ప్రగతిభవన్‌లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అనంతరం బైక్‌పై బయటకి వస్తున్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు రావొచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో లంచ్ మీటింగ్‌కు హాజరయ్యారు. మధ్యాహ్నం 1:30 గంటలకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ వాహనంపై ఆయన ఒక్కరే ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. తొలుత ఇరువురు నేతలు హైదరాబాదీ బిర్యానీ, ఇతర సంప్రదాయ వంటకాలతో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత మూడు గంటలపాటు సమావేశమయ్యారు. పోలింగ్ సరళి, ఎన్నికల ఫలితాల అంచనాలపై వారు చర్చించుకున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు రోజే వారు సమావేశం కావడం... ప్రజాకూటమి నేతలు గవర్నర్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటులో తొలుత తమకే అవకాశం ఇవ్వాలని కోరిన సమయంలోనే ఈ భేటీ జరగడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో కేసీఆర్‌తో ఉండే టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు సైతం ఈ భేటీలో పాల్గొనలేదు. ప్రజాకూటమి రాజకీయ వ్యూహాలు, ఎన్నికల ఫలితాల సర్వేల వివరాలపైనా వారు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఒవైసీ కేసీఆర్‌తో మాట్లాడుతూ ‘మాకు అందిన సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్ భారీగా ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంటుంది. మరోసారి మీరు సీఎం అవుతున్నారు. మీకు ముందస్తు శుభాకాంక్షలు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో మీ పంథాను ఇదే తీరుగా కొనసాగించాలి’అని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై కేసీఆర్ పూర్తి ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు ఉత్సాహంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చారని అన్నారు. ‘మాకు అందిన సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్ మంచి ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది’అని చెప్పారు.
టీఆర్‌ఎస్‌కు మా మద్దతు కొనసాగుతుంది: ఒవైసీ
ఏ పార్టీ మద్దతు అవసరం లేకుండా, స్పష్టమైన ఆధిక్యంతో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కానున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం మద్దతు కొనసాగిస్తుందని చెప్పారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అనంతరం ఒవైసీ ప్రగతి భవన్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మరోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు. దీంట్లో ఎలాంటి సందేహాలు అవసరంలేదు. ఈ విషయంలో మేము, కేసీఆర్ పూర్తి ధీమాతో ఉన్నాం. టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏ పార్టీ అవసరం ఉండదు. ఎంఐఎం మద్దతు అవసరం లేకుండానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. టీఆర్‌ఎస్ సొంత బలంతో కేసీఆర్ సీఎం అవుతున్నారు. అసెంబ్లీ రద్దుకు ముందు నుంచి ఇదే చెబుతున్నాం. ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్‌ఎస్‌కు మా మద్దతు అవసరం ఉండదు. అసెంబ్లీ రద్దుకు ముందే కేసీఆర్‌తో ఉన్నామని చెప్పాం. గతంలోలాగే టీఆర్‌ఎస్‌కు మా మద్దతు కొనసాగుతుంది. ఎంఐఎంకు అధికార వ్యామోహం లేదు. మేము ప్రజలపక్షాన, పేదల పక్షాన ఉంటాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, జాతి నిర్మాణానికి కలసి పని చేస్తాం. ఇది నా నగరం. హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో నేనే చెప్పగలను. ఇలాంటి వాతావరణం ఇక ముందు కూడా కొనసాగుతుంది. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు బాగున్నాయి. అందుకే నేను మోటార్ సైకిల్‌పై వచ్చా’అని ఒవైసీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ సినిమా ముగిసింది...
‘అసదుద్దీన్ మాతో ఉన్నాడంటూ కొందరు కాంగ్రెస్ నేతలు అన్నారు. అవన్నీ అవాస్తవాలే. నాతో ఎవరు మాట్లాడారో వారే ఈ విషయాలు చెప్పాలి. దీనిపై వాళ్లనే అడగాలి. మా పార్టీ చీఫ్ నేనే. ఎంఐఎం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తుందని నేను ఎçప్పుడూ చెప్పలేదు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రెండు రోజుల ముందు థియేటర్‌లో సినిమా చూశాడు. తెలంగాణలో వారి సినిమా ముగిసింది. వారలా సినిమా చూస్తూనే ఉండాలి. బీజేపీకి ఇప్పుడున్న ఐదు సీట్లే రావు. అవీ తగ్గిపోతాయి. బీజేపీ వాళ్లవి ఒట్టి మాటలే. తెలంగాణలో బీజేపీకి సత్తా లేదు. గాలి పటం (ఎంఐఎం ఎన్నికల చిహ్నం) ఎగురుతుంది. ఎనిమిది సీట్లలో విజయం సాధించబోతున్నాం’అని ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment