తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు | Mahakutami leaders released the Public Front Manifesto | Sakshi
Sakshi News home page

తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు

Published Tue, Nov 27 2018 2:36 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Mahakutami leaders released the Public Front Manifesto - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో ఏర్పాటైన ప్రజాకూటమి తమ కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)లో భాగంగా పీపుల్స్‌ ఫ్రంట్‌–పీపుల్స్‌ ఎజెండా పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, సీపీఐ ఇన్‌చార్జి కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు విలేకరులతో మాట్లాడారు. తమది మహాకూటమి కాదని ప్రజాకూటమి అని ఉత్తమ్‌ చెప్పారు. కూటమిలోని అన్ని పార్టీలు అంగీకరించిన అంశాలతో కూడిన ఎజెండాను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఎజెండా అమలు కమిటీ కన్వీనర్‌గా కోదండరాం ఉంటారని, టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్‌ నేతలు సభ్యులుగా ఉంటారన్నారు. కేబినెట్‌ హోదాలో కోదండరాం ఎజెండా అమలు కోసం పనిచేస్తారని వివరించారు. ఏకకాలంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని, కుటుంబంలో అర్హులందరికీ పింఛన్‌ ఇస్తామన్నారు.
 
పాలనా రంగంలో మార్పులు తెస్తాం: కోదండరాం 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నియంతృత్వ, అవినీతిపూరిత పాలన అంతమొందించడానికి పాలనా రంగంలో మార్పులు తెస్తామని కోదండరాం చెప్పారు. అమరవీరుల ఆకాంక్షలే తమ ఎజెండా అన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఉద్యమకారులపై కేసులు ఎత్తేస్తామని, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు ప్రాధాన్యత పెంచుతామన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌ కేంద్రంగానే అభివృద్ధి జరుగుతోందని, జిల్లా కేంద్రంగా కూడా అభివృద్ధి జరగాలని, ఉపాధి లభించాలని, అందరికీ అభివృద్ధి దక్కాలని తాము కోరుకుంటున్నామన్నారు. డిసెంబర్‌ 12 తర్వాత తమ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 51 నెలల పాలనలో కేసీఆర్‌ విస్మరించిన రంగాలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చామని, వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని ఎల్‌. రమణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బోర్డులను పటిష్టం చేస్తామన్నారు. 

ప్రజాఫ్రంట్‌ మేనిఫెస్టోలోని అంశాలు
పాలనా రంగంలో మార్పులు 
- రాష్ట్ర పునర్విభజన చట్టంలోని తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమైన అంశాలపట్ల తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే విధానాలు, నిర్ణయాలు.  
కర్ణాటక తరహాలో లోకాయుక్త వ్యవస్థ బలోపేతం. 
గత నాలుగేళ్లలో భారీ కాంట్రాక్టుల రూపకల్పన తీరుపై, కాంట్రాక్టుల అవార్డులపై పునర్విచారణ. 
కాలపరిమితిని అనుసరించి విధిగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ, రాజకీయ కారణాలతో సర్పంచ్‌లను సస్పెన్షన్‌ చేయకుండా చట్టసవరణ.  
స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ బలోపేతం. జిల్లాలు, జోనల్‌ వ్యవస్థల సమీక్ష. 

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం 
అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అన్ని ఉద్యమ కేసుల ఎత్తివేత. సంవత్సరంలోగా అమరులకు స్మృతి వనం.  
తొలి, మలిదశ ఉద్యమకారులకు గుర్తింపు. ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం, పింఛన్‌ సౌకర్యం. 

ఉపాధి/ఉద్యోగం 
ఏటా ఉద్యోగ కేలండర్‌. మొదటి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు. 
పాలిటెక్నిక్, డిగ్రీ ఆపైన చదువుకున్న నిరుద్యోగులకు నెలవారీ నిరుద్యోగ భృతి. 
ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతన ప్రాతిపదికన జీతాల సవరణ. 
ప్రభుత్వ ఉద్యోగులకు సీసీఎస్‌కు బదులుగా పాత పింఛన్‌ విధానం. త్వరలోనే పీఆర్సీ ప్రకటన అమలు. 

సాంప్రదాయిక వృత్తులు 
ఆర్థిక వ్యవస్థకు భరోసా ఇవ్వగలిగే రీతిలో వృత్తుల ఆధునీకరణ, శిక్షణ, పనిముట్ల అందజేత. 
ప్రతి వృత్తికి విడిగా ప్రత్యేక ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు, రాయితీలు. మార్కెట్‌తో అనుసంధానం.  
పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. 

గల్ఫ్‌ కార్మికులు 
ప్రైవేటు రిక్రూటింగ్‌ ఏజెన్సీలు రద్దు. ప్రభుత్వ సంస్థల ద్వారానే రిక్రూట్‌మెంట్, శిక్షణ. 
విదేశాల్లో ఇబ్బందులు పడే కార్మికుల సహాయం కోసం ప్రత్యేక ఎన్నారైశాఖ. 
హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్‌ ఏర్పాటుకు కృషి. 
వైద్య బీమా, ప్రమాద బీమా.
 
భూసేకరణ విధానం 
నాలుగేళ్లలో జరిగిన అన్ని భూసేకరణలపై సమీక్ష. పెండింగ్‌లో ఉన్న వాటిపై 8 నెలల మారటోరియం. 
నష్టపరిహారం, సహాయ పునరావాస విధానాల రూపకల్పన, అమలులో మానవీయకోణం. 
2016 భూసేకరణ చట్టంలోని అమానవీయ, రైతు వ్యతిరేక అంశాల తొలగింపు.  

విద్య 
విద్యా రంగానికి బడ్జెట్‌ పెంపు, పాఠశాల విద్యా వ్యవస్థ నిర్వహణ, నియంత్రణకు ప్రత్యేక కమిషనరేట్‌. 
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిషన్‌ ఏర్పాటు. హైస్కూల్‌ స్థాయి నుంచి విద్యార్థులందరికీ రెసిడెన్షియల్‌ విద్య. 
సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు. 
ప్రతి మండల కేంద్రంలో ఐటీఐ/జూనియర్‌ కాలేజీ. నియోజకవర్గం కేంద్రంలో పాలిటెక్నిక్‌/డిగ్రీ కళాశాల. జిల్లాకు ఒక ఇంజనీరింగ్‌ కాలేజీ, పీజీ సెంటర్‌. 
మహిళా, గిరిజన యూనివర్సిటీల ఏర్పాటు. 

మౌలిక సదుపాయాలు 
100 యూనిట్లలోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్‌. 
టెలిస్కోపిక్‌ బిల్లింగ్‌ విధానం రద్దు. పాత విధానంలోనే బిల్లులు. 
ఇంటిపన్ను హేతుబద్ధీకరణ. ప్రతి గ్రామానికీ పక్కా రోడ్డు, రక్షిత మంచినీరు, బస్సు సౌకర్యం. 
హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా పేదలందరికీ సొంత ఇళ్లు. శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల అభివృద్ధి. 

సాంస్కృతిక రంగం 
జానపద, సంప్రదాయ కళల పరిరక్షణ, గుర్తింపు, గౌరవ వేతనం. 
తెలంగాణ ఉద్యమ కళాకారులకు గుర్తింపు, గౌరవ వేతనం. 
చారిత్రక కట్టడాలు, అవశేషాలు, ప్రదేశాలు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి,  
తెలంగాణ సినీరంగానికి ప్రోత్సాహం, తెలంగాణ నేపథ్యంలో నిర్మించిన సినిమాలకు పన్ను రాయితీ.  తెలంగాణ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు. 

పారిశ్రామిక రంగం 
పరిశ్రమల స్థాపనకు సత్వర అనుమతులు. పారిశ్రామిక కాలుష్యాన్ని అరికట్టడం.  
ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు విధానం. సింగరేణికి అనుబంధంగా చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ప్రోత్సాహం. కొత్త ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌కు నో. 
గృహ, కుటీర పరిశ్రమలకు ప్రత్యేక కార్పొరేషన్‌. 
- అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా నిజాం షుగర్స్, సిర్పూర్‌ పేపర్‌ మిల్లు, సారంగపూర్‌ షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపించి లాభదాయకంగా నడిపేందుకు చర్యలు. 
జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు.

వైద్యం/ఆరోగ్యం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్ల పటిష్టం. అంగన్‌వాడీ, ఆశావర్కర్లు పీహెచ్‌సీలకు అనుసంధానం. 
పట్టణాల్లో ఉచిత బస్తీ క్లినిక్‌లు, ఉచిత వైద్య పరీక్షలు. 
ప్రతి నియోజకవర్గ కేంద్రంలో లేబర్‌ రూంలు, ఆపరేషన్‌ థియేటర్‌ స్పెషలిస్టుల నియామకం. æ ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్‌ హెల్త్‌కేర్‌ మిషన్‌. 
104, 108 సేవలు ప్రభుత్వ పరిధిలోకి వచ్చేలా కార్పొరేషన్‌ ఏర్పాటు.  

సమానత్వం–సామాజిక న్యాయం–సాధికారత 
కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల అమలు. పేదలకు భూమిపై హక్కు. భూమిలేని నిరుపేదలకు భూ పంపిణీ. 
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పటిష్టంగా అమలు. బీసీలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటు. 
మైనారిటీల సంక్షేమం కోసం సచార్, సుధీర్‌ కమిటీల నివేదికల అమలు. 
కేంద్రంపై ఒత్తిడి చేసి ఎస్సీ వర్గీకరణ అంశం త్వరితగతిన అమలు. 
అర్హులైన ఎస్సీ, ఎస్టీల గృహావసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌.  
దివ్యాంగులకు జిల్లా కేంద్రాల్లో జూనియర్‌ కాలేజీ స్థాయి వరకు రెసిడెన్షియల్‌ విద్య. 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ, ఈబీసీలకు ప్రత్యేక ఫైనాన్స్‌ కార్పొరేషన్లు. 
మహిళలకు పావలా వడ్డీ రుణాలు. బీడీ కార్మికులు, అసంఘటితరంగ మహిళలకు వేతనాల పెంపు. 
అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కనీస వేతన చట్ట సవరణ. 
ఆసరా పథకం లబ్ధిదారుల వయసు 65 నుంచి 58కి కుదింపు. వృద్ధులకు నెలకు రూ. 2 వేలు, దివ్యాంగులకు రూ. 3 వేల పింఛన్‌.  
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్,వైద్యం, గృహవసతి, సంక్షేమానికి ప్రత్యేక నిధి. 
ఐదేళ్లలోపు ప్రాక్టీస్‌ చేస్తున్న లాయర్లకు ప్రతి నెలా స్టైపెండ్‌. 
యువతకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి. 
వయోవృద్ధుల ప్రయాణాల్లో 50 శాతం రాయితీ, ఉచిత వైద్య సదుపాయం, మానసికోల్లాస కేంద్రాల ఏర్పాటు. 

వ్యవసాయం 
జల విధానం ప్రకటన. గొలుసుకట్టు చెరువుల మరమ్మతు, సమర్థ నిర్వహణ. సూక్ష్మ, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులకు ఊతం. భారీ ప్రాజెక్టులు వేగంగా పూర్తి. 
విత్తనం వేసే సమయంలోనే పంటలకు మద్దతు ధర ప్రకటన. 
రూ. 2 లక్షలలోపు ఏకకాల రుణమాఫీ, రైతులకు సకాలంలో వడ్డీలేని రుణాలు. 
ధరల స్థిరీకరణ, మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కోసం రూ. 10 వేల కోట్ల నిధి.  
రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏటా రూ. 10 వేలు. 
- ముంపు బాధితులకు తక్షణ సాయం. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులకు జీవిత బీమా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement