ఏంచేద్దాం..  ఎలా వెళ్దాం! | Telangana Elections Camping All Parties Karimnagar | Sakshi
Sakshi News home page

ఏంచేద్దాం..  ఎలా వెళ్దాం!

Published Sat, Nov 24 2018 8:23 AM | Last Updated on Tue, Aug 27 2019 4:45 PM

Telangana Elections Camping All Parties Karimnagar - Sakshi

పల్లె పట్నం.. ఊరూవాడా.. ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతున్నాయి. ప్రచారానికి మరో 12 రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యరులను రెండున్నర నెలల కిందటే ప్రకటించినా.. మహాకూటమి అభ్యర్థుల జాబితాలో ఆలస్యమైంది. బీజేపీ సైతం ఐదు స్థానాలు మినహా అన్నింటా అభ్యర్థులను ముందుగానే ప్రకటించింది. కాంగ్రెస్, టీటీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ల కూటమి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికలో జాప్యం కారణంగా ఆపార్టీల అభ్యర్థులు ఆలస్యంగా ప్రచారం ప్రారంభించారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 166 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, మహాకూటమి, బీజేపీ అభ్యర్థుల మధ్యే నెలకొంది. అక్కడక్కడా జైభారత్‌ జనసేన, ఆర్‌పీఐ, బహుజన రాష్ట్ర సమితి, దళిత బహుజన పార్టీ, ఇండియన్‌ ప్రజాబంధు, తెలంగాణ కార్మిక రైతురాజ్యం, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, శివసేన, ఏఐఎఫ్‌బీ, బీఎల్‌ఎఫ్‌ తదితర 14 పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు ఉన్నా.. పోటీ నామమాత్రంగానే ఉంది. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 25,05,312 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 12,39,497 మంది పురుషులు 12,65,662 మంది మహిళా ఓటర్లు, 153 మంది ఇతరులున్నారు. నామినేషన్ల ఉపసంహరణ సైతం ముగిసి ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో ఓట్లు రాబట్టడం ఎలా? అన్న అంశంపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. సామాజిక వర్గాలు, యువత, మహిళలు, వృద్ధులు.. కేటగిరీల వారీగా ఏ వర్గాల ఓటు బ్యాంకు ఎంత? అగ్రవర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్లు ఏయే నియోజకవర్గాల్లో ఏ మేరకు ఉన్నాయి? ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతను ఆకర్షించడం ఎలా? వచ్చే ఎన్నికల్లో ఏవర్గం ఓట్లు ఏ నియోజకవర్గంలో ఏమేరకు ప్రభావం చూపుతాయి? అంటూ రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఓటు బ్యాంకు లెక్కల్లో పడ్డాయి.

నోటిఫికేషన్‌ విడుదల వరకు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ముందస్తు ఎన్నికల సందర్భంగా తాజాగా విడుదలైన ఓటర్ల జాబితా అన్ని పార్టీల్లో కలకలం రేపుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఓట్లు రాబట్టడం ఎలా? అన్న వ్యూహాల్లో  ఉన్న అభ్యర్థులు.. ప్రధాన పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలు.. ఆయా పార్టీల అగ్రనేతల ప్రచారాలపై ఆశలు పెట్టుకున్నారు.

ఎనిమిది స్థానాల్లో మహిళలే అధికం..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 25,05,312 మంది ఓటర్లు ఉన్నారు. 12 నియోజకవర్గాల్లో పురుషులు 12,39,497 మంది కాగా, మహిళా ఓటర్లు 12,65,662 మంది ఉన్నారు. అయితే నియోజకవర్గాల వారీగా చూస్తే మాత్రం ఆరు స్థానాల్లో మహిళలు, మూడు నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మరో చోట దాదాపుగా పురుష ఓటర్లతో మహిళలు సమానంగా ఉన్నారు. వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు ఎక్కువగా ఉండగా, కరీంనగర్, రామగుండం, మంథని, పెద్దపల్లిల్లో పురుషులు ఎక్కువగా ఉన్నారు.

హుజూరాబాద్‌లో పురుషులు 1,02,903 కాగా, మహిళా ఓటర్లు 1,02,919లు కాగా, మానకొండూరులో పురుషులు 99,133లు, మహిళల ఓటర్లు 99,965లుగా ఉన్నారు. మంథనిలో కూడా మహిళ ఓటర్లు 1,00,860 కాగా, పురుష ఓటర్లు 1,00,989తో స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారి ఓట్లు తమకే పడతాయనే ధీమాతో టీఆర్‌ఎస్‌ ఉండగా.. దీనిని గమనించిన కాంగ్రెస్‌ నేతలు జిల్లాస్థాయిలో ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ మద్దతు ఓట్లలో చీలిక తెచ్చే వ్యూహంతో ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో సైతం ప్రధాన పార్టీలు ఓటుబ్యాంక్‌ లక్ష్యంగా ఎత్తులు, పైఎత్తులు వేస్తుండటం, సామాజికవర్గాల వారీగా ప్రసంగాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement