అందరూ ఎప్పటినుంచో అనుకుంటున్నదే నిజమైంది. ఎవరు అవునన్నా, కాదన్నా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నిలపాలన్న ఆరెస్సెస్ పట్టుదలే ఫలించింది. ‘కొత్త నీరు’ ధాటికి పార్టీలోని ‘పాత నీరు’ ఎటో కొట్టుకుపోయింది. నరేంద్ర మోడీ కిరీటధారణకు ఆదినుంచీ ఆటంకంగా ఉన్న అద్వానీని పక్కకు నెట్టి పార్టీ అంతా మోడీ వెనక దృఢంగా నిలబడింది. అత్యంత ప్రజాస్వామికంగా, ఏకగ్రీవంగా సాగిపోయినట్టు కనబడిన దృశ్యాల వెనక చాలా తతంగమే నడిచింది. తాను ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకోవడమేకాదు...దాన్ని సాధించడానికి ఏం చేయాలో, ఎప్పుడు ఎటువైపు అడుగేయాలో నరేంద్రమోడీకి బాగా తెలుసు. అందువల్లే నిరుడు డిసెంబర్‌లో వరసగా మూడోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించాక మాత్రమే ఆయన తన ‘జాతీయ ఆకాంక్ష’ను వెల్లడించారు. ఆ ప్రకటనకు అవసరమైన నేపథ్యాన్ని ఆయన అంతకు చాలాకాలం ముందే జాగ్రత్తగా సమకూర్చుకున్నారు. ఒకప్పటి తన గురువు అద్వానీ రెండేళ్లక్రితం అహ్మదాబాద్‌నుంచి అవినీతి వ్యతిరేక యాత్ర ప్రారంభించబోతే మోడీ దాన్ని వమ్ముచేశారు. అలాగని ఆయనకు దూరం జరగలేదు. గడ్కారీ అధ్యక్షుడిగా ఉండగా అద్వానీవైపే నిలబడ్డారు.
పార్టీ అధ్యక్ష పదవినుంచి గడ్కారీ తప్పుకుని ఒకప్పటి తన ప్రత్యర్థి రాజ్‌నాథ్‌సింగ్ ఆ స్థానంలోకి రాగానే ఎత్తుగడలను మార్చారు. తనపై కోపంగా ఉన్న ఆరెస్సెస్‌ను ప్రసన్నం చేసుకున్నారు. పర్యవసానంగా నాలుగు నెలలక్రితం గోవాలో జరిగిన పార్టీ కార్యనిర్వాహకవర్గ సమావేశంలో నరేంద్రమోడీని రాజ్‌నాథ్‌సింగ్ జాతీయ ఎన్నికల ప్రచార సంఘం చైర్మన్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఎత్తుగడలన్నీ బొత్తిగా బోధపడని అద్వానీ... చివరి నిమిషంలో ఆ పరిణామాన్ని ఆపడానికి ప్రయత్నించి విఫలుడయ్యారు. మోడీని ఆ పదవికి ఎంపిక చేయడం...భవిష్యత్తులో ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికేనని అర్ధమై పార్టీ పదవులన్నిటికీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయినా లాభం లేకపోయింది. పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించబోతున్నట్టు నాలుగురోజులనాడు పార్టీ అగ్ర నేతలు ఆయనకు చెప్పినప్పుడు అద్వానీ అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సాకుతో వాయిదా వేయిద్దామని చూశారు. అది కూడా నెరవేరలేదు. తనకు అండగా నిలబడ్డారనుకున్న సుష్మా స్వరాజ్, మురళీమనోహర్ జోషి సైతం ‘అటువైపు’ వెళ్లారని తెలుసుకున్నాక ఆయన మోడీని ఒక్క మాట కూడా అనకుండా రాజ్‌నాథ్ వ్యవహార శైలికి అభ్యంతరం చెబుతూ లేఖ రాసి పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి గైర్హాజరయ్యారు.
‘మానిందే మందు’ అనే నానుడి ఎప్పటినుంచో ఉన్నదే. లోక్‌సభలో రెండు స్థానాలకు మించని బీజేపీని తన రథయాత్రతో తిరుగులేని శక్తిగా రూపొందించి అధికార పీఠానికి చేర్చిన అద్వానీ రెండు దశాబ్దాలు గడిచేసరికి పార్టీలో చెల్లని కాసు అయ్యారు. నెహ్రూ దేశ రాజకీయాల్లో ప్రవేశపెట్టిన ‘సెక్యులర్’ పదానికి పోటీగా ‘సూడో సెక్యులర్’ పదాన్ని తీసుకొచ్చి ప్రత్యర్థుల్ని గుక్కతిప్పుకోనీయ కుండా చేసినప్పుడు... పార్టీలో ప్రమోద్‌మహాజన్, అరుణ్‌జైట్లీ, నరేంద్రమోడీ, ఉమాభారతి వంటి యువ నాయకులను ప్రోత్సహించినప్పుడు శభాష్ అని ప్రశంసించినవారే 2009 ఎన్నికల్లో గట్టెక్కించలేకపోయేసరికి దూరం జరిగారు. పాకిస్థాన్ పర్యటనలో జిన్నాను పొగిడాక సంఘ్ పరివార్ నాయకత్వం పార్టీకి కొత్త సారథిని వెతికే పనిలో పడింది. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న పార్లమెంటరీ బోర్డు నాయకులందరినీ గమనిస్తే వారిలో ప్రజాకర్షణలో మోడీకి దీటు రాగలవారు ఒక్కరు కూడా లేరని సులభంగానే గ్రహించవచ్చు. వీరిలో కొందరు రాజ్యసభ సభ్యులైతే, మరికొందరు తమ తమ లోక్‌సభ స్థానాలకు మాత్రమే పరిమితంకాగల నాయకులు. అందువల్లే ఉత్తరాది వ్యక్తి కాకపోయినా, కేంద్రంలో ఏనాడూ మంత్రి పదవిని చేపట్టిన అనుభవం లేకపోయినా, కనీసం ఢిల్లీలో ఎక్కువకాలం గడపకపోయినా మోడీ ఆ పార్టీలో తిరుగులేని నేతగా మారారు.
ఇవన్నీ సరేగానీ... నరేంద్ర మోడీ పేరు చెప్పేసరికి ‘గుజరాత్ నమూనా’ అందరి మదిలో మెదులుతుంది. జైల్లో ఉన్న ఐపీఎస్ అధికారి డీజీ వంజారా కూడా మొన్నీమధ్యే ఈ ‘నమూనా’ గురించి తన లేఖలో విపులంగా ప్రస్తావించారు. ఈ నమూనా నిజానికి ఒకటి కాదు... రెండు. ఒకటి కార్పొరేట్ ప్రపంచం కోరుకునే మార్కెట్ ఎకానమీ అనుకూల ‘ఆర్ధిక నమూనా’ కాగా, రెండోది‘రాజకీయ నమూనా’. ఆర్ధిక నమూనా గుజరాత్‌కే పరిమితమైనదేమీ కాదు. కాకపోతే, దాన్ని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆయన మరింత సమర్ధవంతంగా అమలుచేస్తున్నారు. రాజకీయ నమూనాపై మాత్రం పార్టీలోనూ, వెలుపలా మోడీపై ఎన్నో విమర్శలున్నాయి. రాష్ట్ర బీజేపీలో ఆయన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనీయలేదన్న ఫిర్యాదు చాలా పాతది. తనకు పోటీ వస్తారనుకున్న ఏ నేతనైనా మోడీ దూరంపెట్టారు. ఇందుకు కేశూభాయ్ పటేల్ నుంచి కాశీరాం రాణా, సురేష్ మెహతా వరకూ ఎన్నో ఉదాహరణలున్నాయి. పార్టీ ప్రభుత్వాలపై ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పెత్తనం సాగే స్థితి ఉండగా గుజరాత్ అందుకు భిన్నం. అక్కడ రెండింటిపైనా మోడీదే ఆధిపత్యం. ఇక భిన్న రాజకీయ విశ్వాసాలకు, ఆలోచనలకు ఆయన చోటివ్వరన్న విమర్శలున్నాయి. బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్‌సింగ్ జిన్నాపై రాసిన గ్రంథంతోసహా పలు పుస్తకాలు గుజరాత్‌లో ఇప్పటికీ నిషిద్ధం. ఇన్ని లోటుపాట్లున్నా ఇప్పటికైతే మధ్యతరగతి ప్రపంచానికి మోడీయే మారాజు. అందుకే బీజేపీ ఆయనను జాతీయ యవనికపైకి తెచ్చింది. ఈ నిర్ణయం దేశంలో ఆ పార్టీకి ఇప్పటికే ఉన్న ప్రజాదరణను మరింత పెంచుతుందా లేదా అన్నది భవిష్యత్తే తేల్చాలి.
మోడీ పట్టాభిషేకం!
Published Sun, Sep 15 2013 1:26 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement