రాజ్‌నాథ్‌ను నిలదీసిన మురళీ మనోహర్ జోషీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బీజేపీలో లుకలుకలు పొడచూపాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్‌లు శనివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలోనే అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను నిలదీశారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారంటూ సాగుతున్న ప్రచారంపై అక్కడి సిట్టింగ్ ఎంపీ జోషీ మండిపడ్డారు. మోడీ కోసం తన స్థానానికి ఎసరుపెట్టడం ఏమిటని నిలదీశారు. ఒకవేళ ఈ ప్రచారమంతా ఒట్టిదైతే దానిపై వివరణ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. మరోవైపు పార్టీలోకి కేజేపీ (యడ్యూరప్ప), బీఎస్‌ఆర్ కాంగ్రెస్ (బి. శ్రీరాములు) విలీనాన్ని బాహాటంగానే వ్యతిరేకించిన సుష్మాస్వరాజ్...అవినీతిపరులను పార్టీలో తిరిగి చేర్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం భేటీ మధ్యలోనే వారు బయటకు వెళ్లిపోయారు.
52 మందితో బీజేపీ రెండో జాబితా
లోక్‌సభ ఎన్నికలకు 52 మందితో పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. కర్ణాటక నుంచి 20 మందికి, పశ్చిమ బెంగాల్ నుంచి 17 మంది, ఒడిశా నుంచి ఐదుగురు, అస్సాం నుంచి ఐదుగురు, కేరళ నుంచి ముగ్గురు, త్రిపుర నుంచి ఇద్దరు అభ్యర్థులకు టికెట్లను కేటాయించింది. వీరిలో 16 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. అవినీతి ఆరోపణల కారణంగా బీజేపీ నుంచి వైదొలగి సొంత పార్టీ (కేజేపీ) పెట్టుకొని తిరిగి ఇటీవల బీజేపీలో చేరిన కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు ఈ జాబితాలో చోటు దక్కింది. షిమోగా స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.
నరేంద్ర మోడీ కోసం నా సీటుకు ఎసరా?
Published Sun, Mar 9 2014 2:21 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement