సమరానికి సమాయత్తం!
272 సీట్లపై బీజేపీ గురి
16 నుంచి ఢిల్లీలో భారీ మేధో మథనం
నాలుగు రోజుల పాటు సమావేశాలు
బీజేపీ పార్లమెంట్ పార్టీ బోర్డు భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 272 సీట్లకు మించి సాధించటం ద్వారా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ దృష్టి సారించింది. ఎన్నికలకు ముందుగా పార్టీ తరఫున భారీ ఎత్తున సమావేశాలు నిర్వహించి సమరశంఖం పూరిస్తోంది. దేశానికి ప్రత్యామ్నాయ నాయకత్వం నరేంద్ర మోడీ, ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అనే సందేశాన్ని ప్రజల్లోకి విసృ్తతంగా చేరవేసేందుకు హస్తిన వేదికగా నాలుగు రోజుల పాటు భారీ మేధోమథనానికి సిద్ధమైంది.
‘ప్రధానిగా మోడీ’... ఎన్నికల రణనీతి ఖరారు!
బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన శుక్రవారం పార్లమెంటరీ పార్టీ భేటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్‌జోషీ, అరుణ్‌జైట్లీ సహా మిగతా సభ్యులు ఇందులో పాల్గొన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ, ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, మాజీ అధ్యక్షులు ఎం.వెంకయ్యనాయుడు, గడ్కారీలు వివిధ కారణాలతో దీనికి హాజరు కాలేదు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్ణయించారు. 16వ తేదీన బీజేపీ జాతీయ పదాధికారుల భేటీ, 17న జాతీయ కార్యవర్గసమావేశం, 18, 19న జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరపాలని నిర్ణయించారు. కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ ఎంపీలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు, పదాధికారులు సుమారు 10వేల మంది కార్యకర్తలు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
యూపీఏ అవినీతి, కుంభకోణాలు, ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, రైతులు, పేదల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన రణనీతిని ఖరారు చేస్తారు. పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో సదస్సులు, బూత్‌స్థాయి ప్రచారం, 12న ప్రారంభం కానున్న ‘ప్రధానిగా మోడీ’ ప్రచారాన్ని మారుమూల గ్రామాలకు సైతం చేరవేసేలా మార్గదర్శకాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
ఎన్నికల మైదానంలో కాంగ్రెస్ లేదు
ఎన్నికల మైదానంలో కాంగ్రెస్ లేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్ వ్యాఖ్యానించారు. ఆ ఖాళీని బీజేపీ పూరిస్తుందన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో కేంద్రంలోని యూపీఏ పతనం మొదలైందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మా ముందు ఒకటే సవాలు ఉంది. మోడీ నేతృత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకు 272కి మించి ఎంపీ సీట్లు కావాలి. దీనిపై చర్చించేం దుకు నాలుగు రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తున్నాం. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ తరఫున ఇది అతిపెద్ద సదస్సు’ అని చెప్పారు.