నేపాల్‌తో కరచాలనం!
సంపాదకీయం: రెండు దేశాలమధ్య సంబంధాల్లో పదిహేడేళ్లకాలమంటే చాలా సుదీర్ఘ మైనది. మీదుమిక్కిలి ఆ రెండూ ఇరుగుపొరుగు దేశాలైనప్పుడు ఆ సమయం మరింత విలువైనది. కానీ, హిమాలయ సానువుల్లో ఉన్న కీలకమైన దేశం నేపాల్ వెళ్లడానికి, వారితో సత్సంబంధాలు కొనసాగిం చడానికి మన ప్రధానులుగా పనిచేసినవారికి ఇంత కాలం పట్టిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1997లో అప్పటి ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ తర్వాత ఎవరూ ఆ గడప తొక్కలేదంటే వింతగా ఉంటుంది. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో 2002లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అక్కడికి వెళ్లినమాట నిజమే అయినా... ఆయన వెళ్లింది ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా కాదు. అక్కడ జరిగిన సార్క్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికే. ఇన్నాళ్లకు ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం నేపాల్ వెళ్తున్నారు.
ఈ పర్యటనకు అవసరమైన భూమికను ఏర్పాటు చేసేందుకు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఇంతకుముందే నేపాల్ వెళ్లి అక్కడి అధికార, విపక్ష నాయకులతో సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా ఇండో-నేపాల్ జాయింట్ కమిషన్ సమావేశం కూడా జరిగింది. మన ప్రధాని అక్కడకు వెళ్లడం చాన్నాళ్ల తర్వాత ఇదే తొలిసారి అయినా ఇరు దేశాలమధ్య సంబంధాలు ఇన్నేళ్లనుంచి అసలే లేవని కాదు. నేపాల్‌లో జరుగుతున్న భిన్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆ దేశానికి చెందిన పలు బృందాలను న్యూఢిల్లీ రప్పించి మన దేశం రహస్య మంతనాలు సాగిస్తూనే ఉన్నది. అయితే, రెండు దేశాల మధ్య సత్సంబంధాల్లో పరిపూర్ణత్వం ఏర్పడాలంటే ఇవి సరిపోవు. ఇరుదేశా ధినేతలూ పరస్పరం మాట్లాడుకుంటూ ఉండాలి. ఒకరి దేశం ఒకరు సందర్శించాలి. అధికారిక స్థాయి సంప్రదింపులుండాలి. అప్పుడే ఇరు దేశాలమధ్యా ఉత్పన్నమవుతున్న సమస్యలేమిటో, వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహమేమిటో... ఏ ఏ రంగాల్లో ఎలాంటి సహకారం ఉండాలో, ఇచ్చిపుచ్చుకోవాల్సి నవేమిటో తెలుస్తాయి.
ఎందుకనో మన అధినేతలు ఈ విష యంలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. 1987లో ఇరు దేశాల మధ్యా సత్సంబంధాల కోసం ఇండో-నేపాల్ జాయింట్ కమిషన్ ఏర్పాటైనప్పుడు అది రెండేళ్లకోసారి సమావేశం కావాలని నిర్ణయిం చారు. కానీ, మొన్నీమధ్య సుష్మాస్వరాజ్ వెళ్లే వరకూ ఈ 23 ఏళ్లపాటూ అది మొద్దు నిద్రపోయింది. కనీసం డజనుసార్లు సమావేశం కావాల్సిన ఆ కమిషన్ రెండంటే రెండుసార్లే సమావేశమైంది. పోనీ, ఇరుదేశాల మధ్యా సమస్యలు లేవా అంటే... బోలెడున్నాయి. నేపాల్‌తో మనకున్న 1580 కిలోమీటర్ల సరిహద్దు పొడవునా అక్కడక్కడా వివాదాలున్నాయి. దాదాపు అరడజనుచోట్ల భూభాగం విషయంలో పేచీ ఉంది.
కాలా పానీ నదీజలాల వివాదం ఉన్నది. ఇక భద్రతాపరంగా అటువైపు నుంచి మన దేశానికి ఏర్పడుతున్న ఇబ్బందులున్నాయి. నేపాల్, భూటాన్‌లతో ఉన్న ఉమ్మడి సరిహద్దులనుంచి గంజాయి, ఇతర మాద కద్రవ్యాలు మన దేశానికి అక్రమ రవాణా అవుతుంటాయి. మన హైద రాబాద్‌లో పట్టుబడే మాదకద్రవ్యాల్లో చాలాభాగం అటునుంచి దేశం లోకి వస్తున్నవే. అలాగే భారత్‌నుంచి నేపాల్‌కు ఔషధాల అక్రమ రవాణా సాగుతుంటుంది. భారత్‌లో విధ్వంసక చర్యలకు పాల్పడే ఉగ్రవాదులు పాక్ నుంచి నేపాల్ మీదుగా మన దేశం వస్తున్నారు. హైదరాబాద్‌తోసహా దేశంలో పలుచోట్ల జరిగిన బాంబుపేలుళ్ల ఘటన లకు సూత్రధారులు యాసీన్ భత్కల్, అబ్దుల్ కరీం టుండాలు నిరుడు నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడటం యాదృచ్ఛికం కాదు. ఉగ్రవాదులకు అది అడ్డాగా మారింది.
ఈ పదిహేడేళ్లకాలంలోనూ భారత్ నిద్రావస్థను ఆసరాచేసుకుని చైనా చాలా ముందుకెళ్లింది. రెండు దేశాల అధినేతలూ 11 సార్లు పర స్పర పర్యటనలు జరుపుకున్నారు. మంత్రుల స్థాయి పర్యటనలు వీటికి అదనం. రెండుదేశాలమధ్యా ఈ సుహృద్భావ పర్యటనలతోపాటే వాణి జ్యమూ విస్తరించింది. పర్యాటకుల సంఖ్య పెరిగింది. నేపాల్‌లో రోడ్డు, రైలు మార్గాల నిర్మాణానికి చైనా తోడ్పాటు సాగుతున్నది. మన దేశా నికి నేపాల్‌తో 1950లో శాంతి, స్నేహ ఒడంబడిక కుదిరింది. అది సమానస్థాయి ప్రాతిపదికన లేదని, తమ దేశంపై భారత్ పెత్తనం చలా యించడానికే ఆ ఒప్పందం వినియోగపడిందన్న అభిప్రాయం అక్కడి వారిలో ఉన్నది.
ఒప్పందం పర్యవసానంగా సరిహద్దుల్లో ఇరుదేశాల పౌరుల రాకపోకలపైనా ఆంక్షలు లేకపోవడంతో మనకు ఎన్నో సమ స్యలు కూడా వస్తున్నాయి. పటిష్టమైన భద్రత కొరవడి ఉగ్రవాదం, స్మగ్లింగ్, నకిలీ కరెన్సీవంటివి జోరందుకున్నాయి. సమస్యలిలా ఉంటే ఇరుదేశాల వాణిజ్యబంధం క్రమేపీ పలచబడుతున్నది. గత ఏడాది కాలంలో మనతో నేపాల్ వాణిజ్య లోటు రూ. 21,000 కోట్లుంది. పర స్పరం ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభిస్తే వాణిజ్యపరంగా మాత్రమే కాదు... ఇతరత్రా కూడా ఎంతో ఉపయోగం. పుష్కలంగా ఉన్న జల వనరుల వల్ల నేపాల్‌లో దాదాపు 43,000 మెగావాట్ల విద్యుదు త్పాదనకు అవకాశం ఉన్నదని అంచనా. మన పారిశ్రామిక అభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అదే సమయంలో మన దేశం మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య రంగాల్లో నేపాల్‌కు బాసటగా నిలవచ్చు. నరేంద్రమోడీ తన ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాధి నేతలను ఆహ్వానించడమే కాక తొలి విదేశీ పర్యటనకు పొరుగునున్న భూటాన్‌ను ఎంచుకున్నారు. ఆ వరసలో ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఆయన నేపాల్ వెళ్తున్నారు. ఈ పర్యటన ఇరు దేశాలమధ్యా ఏర్పడివున్న అపోహలనూ, అపార్థాలనూ దూరం చేసి స్నేహసంబంధాల్లో పూర్వవైభవాన్ని తీసుకొస్తుందని ఆశించవచ్చు.