
ఇక రాహుల్‌కు ప్రచార సారథ్యమే
రాహుల్‌ను ప్రచార రథసారథి పాత్రకే పరిమితం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆయనను ప్రధాని అభ్యర్థిగా, నరేంద్ర మోడీకి ప్రత్యర్థిగా ప్రకటించకుండానే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాలని పార్టీ వర్కింగ్ కమిటీ తీర్మానించింది...
2 గంటలపాటు మథనం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార రథసారథిగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి బాధ్యతలు అప్పగించాలని సీడబ్ల్యూసీ భేటీలో నిర్ణయించారు. దీనిపై శుక్రవారం ఏఐసీసీ సమావేశంలో అధికారిక ప్రకటన చేస్తారు. ఆయనను కాంగ్రెస్ తరఫున ప్రధాని అభ్యర్థిగా కూడా నిర్ణయిస్తారని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూసినా అలాంటిదేమీ జరగలేదు. ఎన్నికలకు ముందుగానే ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్‌లో మునుపెన్నడూ లేదని, అదే సంప్రదాయాన్ని ఇప్పుడూ కొనసాగిస్తామని అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో, లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేసేందుకు శుక్రవారం అతి కీలకమైన ఏఐసీసీ సమావేశం జరుగుతుండటం తెలిసిందే. అందులో దిశానిర్దేశం చేయాల్సిన అంశాలపై చర్చించేందుకు సీడబ్ల్యూసీ గురువారం సాయంత్రం పార్లమెంట్ ప్రాంగణంలోని అనెక్స్‌లో రెండు గంటలకుపైగా సమావేశమైంది. సోనియాతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి సీడబ్య్లుసీ ప్రత్యేక ఆహ్వానితుడు జి.సంజీవరెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరు కావాల్సి ఉన్నా వెళ్లలేదు.
నేతల ‘రాగా’లు
అధిష్టానం ఎలాంటి బాధ్యతలు కట్టబెట్టినా స్వీకరించేందుకు సిద్ధమని, పార్టీ సైనికుడిలా నడుచుకుంటానని బుధవారం రాహుల్ గాంధీ(రాగా) మీడియాముఖంగా ప్రకటించిన నేపథ్యంలో, ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకుంటారంటూ ప్రచారం జరిగింది. భేటీకి కొద్ది గంటల ముందు దాకా ఏఐసీసీ స్థాయిలో చర్చంతా ఈ అంశం చుట్టూనే తిరిగింది. సీడబ్ల్యూసీకి హాజరైన దాదాపు 80 మంది సభ్యుల్లో మెజారిటీ రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాల్సిందేనని కోరారు. రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన కీలక నేతలైతే ఆ మేరకు సీడబ్ల్యూసీ భేటీలోనే తీర్మానం చేయాలంటూ పట్టుబట్టారని, అప్పుడే పార్టీ శ్రేణుల్లో నూతనుత్తేజం వస్తుందని వాదించారని చెబుతున్నారు. బీజేపీని ఉదహరిస్తూ, వారి ప్రధాని అభ్యర్థి మోడీకి దీటుగా రాహుల్‌ను దింపాలంటూ అధినేత్రిపై ఒత్తిడి తెచ్చే యత్నం చేసినట్టు తెలిసింది.
‘నమో’కు జడిసే...
నరేంద్ర మోడీ(నమో) ముందు పలు విషయాల్లో రాహుల్ తేలిపోతారన్న భావనతోనే ఆయన్ను ప్రధాన అభ్యర్థిగా ప్రకటించడంపైకాంగ్రెస్ వెనకంజ వేస్తున్నట్టు భావిస్తున్నారు. గుజరాత్ సీఎంగా హాట్రిక్ కొట్టడమే గాక రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన పరుగులు తీయిస్తున్న నాయకునిగా మోడీ ప్రభ వెలిగిపోతుండటం తెలిసిందే. యువతలో కూడా ఆయనపై క్రేజు పెరిగిపోతోందని సర్వేలు చెబుతున్నాయి. పైగా ప్రధానిగా రాహుల్ కంటే ఆయన వైపే ఎక్కువమంది మొగ్గుతున్నారనీ తేలుస్తున్నా యి. దీనికి తోడు రాహుల్‌కు పాలనాపరమైన అనుభవమూ లేకపోవడం, పైగా బాధ్యతలను స్వీకరిం చేందుకు వెనకా ముందాడే ఆయన నైజం వంటివన్నీ కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆలోచనలో పడేస్తున్నట్టు సమాచారం. పదేపదే వంశ పురాణం విప్పడం, సొం త పార్టీ నేతల ప్రెస్ మీట్లలోకి చొచ్చుకెళ్లి, ప్రభుత్వ నిర్ణయాలనే తప్పుబడుతూ రసాభాసగా మార్చడం, అవగాహన లేమితో కూడిన వ్యాఖ్యల వంటివాటితో రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై ఇప్పటికే సందేహాలు నెలకొన్నాయి. ఈ స్థితిలో ఎన్నికలకు 3 నెలల ముందుగానే రాహుల్‌ను అధికారికంగా తెరపైకి తెస్తే ఆయన పూర్తిగా తేలిపోతారేమోనన్న అనుమానం కాంగ్రెస్ పెద్దలను వెన్నాడుతోంది.
పద్ధతి కాదంటూ సముదాయింపు
సీడబ్ల్యూసీ భేటీలో మాట్లాడే అవకాశం దక్కిన ప్రతి ఒక్కరు రాహుల్ జపమే చేస్తుండటంతో సోనియా కల్పించుకున్నారు. ప్రస్తుతానికి రాహుల్ కేవలం ప్రచార సారథిగానే బాధ్యతలు స్వీకరిస్తారంటూ సముదాయించే యత్నం చేశారు. ‘ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం పార్టీలో లేదు. దాన్నే కొనసాగిద్దాం. ప్రస్తుతానికైతే ప్రచార కమిటీకి నాయకత్వ బాధ్యతలనే రాహుల్‌కు అప్పగిద్దాం’ అన్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ విలేకరులకు ఈ మేరకు చెప్పారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని మెజార్టీ సభ్యులు కోరినా సోనియా తిరస్కరించారని తెలిపారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించినంత మాత్రాన వారి తరహాలోనే తామూ నడవాలనేమీ లేదన్నారు.
ప్రస్తావనకు రాని తెలంగాణ: శుక్రవారం ఏఐసీసీలో ప్రవేశపెట్టే సామాజిక, ఆర్థిక, రాజకీయ, విదేశీ వ్యవహారాల తీర్మానాలను సీడబ్ల్యూసీలో ఆమోదించారు. ఇటీవలి ఎన్నికల ఫలితాలు, సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాలని తీర్మానించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి మాత్రం సీడబ్ల్యూసీలో ఎలాంటి నిర్ణయం గానీ, తీర్మానం గానీ చేయలేదు. ఈ దృష్ట్యా ఏఐసీసీ సమావేశంలోనూ తెలంగాణ అంశంపై ఎలాంటి చర్చా ఉండకపోవచ్చని తెలుస్తోంది.