చాయ్‌వాలా టు పీఎం | chaiwala to prime minister | Sakshi
Sakshi News home page

చాయ్‌వాలా టు పీఎం

Published Sat, May 17 2014 4:42 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

చాయ్‌వాలా టు పీఎం - Sakshi

చాయ్‌వాలా టు పీఎం

అహ్మదాబాద్:  నమో నమ.. దేశాన్ని ఒక ఊపు ఊపిన మంత్రమిది. పదేళ్లుగా అధికారంలో ఉన్న యూపీఏను మట్టికరిపించిన నరేంద్ర మోడీ తంత్రమిది. దేశ ప్రధాని కాబోతున్న ఒక చాయ్‌వాలా సాధించిన అద్భుత గెలుపు ఇది. దేవుడే తనను ఎన్నుకున్నాడంటూ సగర్వంగా చెప్పుకొన్న మోడీ నేపథ్యం..
- ప్రత్యర్థుల విమర్శలనే తన విజయానికి మెట్లుగా మలుచుకున్న 63 ఏళ్ల మోడీ... గుజరాత్‌లోని మెహ్సానా జిల్లా వాద్‌నగర్‌లో వెనుకబడిన వర్గమైన మోద్ ఘాంచీ (గానుగల నుంచి నూనె తీసే పనిచేసే) కుటుంబంలో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.
 మోడీ పూర్తిపేరు.. నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ. ఆయన తండ్రి టీ స్టాల్ నడిపేవారు. తల్లి హీరాబెన్ ఇళ్లలో పని చేసేవారు. వీరి ఆరుగురు సంతానంలో మోడీ మూడోవాడు. చిన్నప్పుడు మోడీని కుమార్ అని పిలిచేవారు.

మోడీ తన చిన్న వయస్సులోనే తండ్రికి తోడుగా వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో టీ అమ్మేవారు. అప్పట్లో సైన్యంలో చేరాలనేది ఆయన కోరిక. కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో పాటు.. బుద్ధుడు, వివేకానందుడి బోధనలకు ఆకర్షితుడై చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయి ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు.

1985లో బీజేపీలో చేరారు. పార్టీ ఆఫీస్ బేరర్‌గా ఉంటూనే.. కీలక నాయకుడిగా ఎదిగారు.
 ఇదే సమయంలో చదువుపైనా దృష్టి సారించి.. గుజరాత్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పీజీ పూర్తి చేశారు.
 రామమందిర నిర్మాణం కోసం అద్వానీ చేపట్టిన రథయాత్రను విజయవంతం చేయడం కోసం కృషి చేసి అద్వానీ దృష్టిలో పడ్డారు.
 1995లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా, మూడేళ్ల తర్వాత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
 2001లో అప్పటి పార్టీ సీఎంగా ఉన్న కేశూభాయ్ పటేల్ స్థానంలో.. గుజరాత్ పగ్గాలు చేపట్టారు. 2002 ఫిబ్రవరిలో జరిగిన గోధ్రా ఘటన, అనంతరం అల్లర్లతో దేశవ్యాప్తంగా ఆయన చర్చకు వచ్చారు.ఆ సమయంలో మోడీని తొలగించాలని అప్పటి ప్రధాని వాజ్‌పేయి నిర్ణయించినా.. అద్వానీ అండతో మోడీ బయటపడ్డారు.

అప్పటి నుంచి ఆయనపై విమర్శల వర్షం కురుస్తున్నా.. వాటినే తన విజయానికి మెట్లుగా మార్చుకుంటూ 2007, 2012ల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిచేత్తో బీజేపీని గెలిపించి, హ్యాట్రిక్ సాధించారు.తన పాలనలో ఉద్యోగుల్లో అవినీతిని కొంత వరకూ అరికట్టి, పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించి.. అభివృద్ధికి నమూనాగా నిలిచారు. తాను చేసిన ప్రతీ పనినీ విస్తృతంగా ప్రచారం చేసుకోవడంలో దిట్ట అయిన మోడీ... ‘వైబ్రెంట్ గుజరాత్.. (గుజరాత్ వెలిగిపోతోంది)’ అంటూ దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించారు. శక్తివంతుడైన, సమర్థుడైన నేతగా ప్రచారం పొందారు.

బీజేపీలో అద్వానీలాంటి మహామహులను ఎదుర్కొని.. ప్రధాని అభ్యర్థిగా తాను తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనే స్థాయికి ఎదిగారు.
 ఏడాది కింద పార్టీ ఎన్నికల కమిటీ చీఫ్‌గా నియామకం కావడంతోనే తన ప్రచారయుద్ధాన్ని ప్రారంభించిన మోడీ... ప్రధాని అభ్యర్థిగా ప్రకటించగానే దానిని మరింత ఉధృతం చేశారు. 2002 అల్లర్ల తర్వాత ఎన్డీయేను వదిలిపెట్టిన పార్టీలను తిరిగి ఆకర్షించి.. ఎన్నికలకు ముందే కూటమిని బలోపేతం చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 450 సభల్లో పాల్గొన్నారు. వీటన్నింటికి తోడు యూపీఏ పదేళ్ల లోపభూయిష్టమైన పాలనపై వ్యతిరేకత కూడా మోడీకి కలిసివచ్చింది. దీంతో బీజేపీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నడూ సాధించని స్థాయిలో.. ఆ పార్టీకి గెలుపును అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement