అఖండ భారత్‌గా అవతరిస్తాయి
భారత్, పాక్, బంగ్లాలపై బీజేపీ నేత రాంమాధవ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఎప్పటికైనా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు కలసిపోతాయని, అఖండ భారత్‌గా అవతరిస్తాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ఎలాంటి యుద్ధం జరగకుండా.. పరస్పర అంగీకారంతోనే ఇది సంభవమవుతుందన్నారు. 60 ఏళ్లక్రితం చారిత్రక కారణాలతో విడిపోయిన ఈ మూడు దేశాలు మళ్లీ కలసి తిరిగి అఖండ భారత్‌గా అవతరిస్తాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) విశ్వసిస్తోందని ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ సభ్యునిగా తనకు కూడా ఆ విశ్వాసం ఉందన్నారు. అలాగని తామేదో యుద్ధానికి వెళతామనో.. బలవంతంగా కలిపేసుకుంటామనో భావించరాదని.. విస్తృత ప్రజాభిప్రాయంతోనే ఇది జరుగుతుందని ఆయన అన్నారు. దోహాకు చెందిన అల్ జజీరా టీవీ చానల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారతదేశానికంతటికీ ఒకే సంస్కృతి ఉందని, దీనిని తాము హిందూ సంస్కృతిగా పిలుస్తామని ఆయన చెప్పారు. రచయితలు, మేధావులు అవార్డులను తిరిగివ్వడంపై ఆయన స్పందిస్తూ.. కొద్ది మంది ప్రజలు చేసిన పనిని మొత్తం దేశం అభిప్రాయంగా పరిగణించడం తగదన్నారు. అవార్డులు తిరిగివ్వడాన్ని అధికశాతం మంది మేధావులు సమర్థించడం లేదన్నారు. రాంమాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి మోదీ శుక్రవారం అకస్మాత్తుగా పాకిస్తాన్‌కు వెళ్లొచ్చిన తర్వాత ప్రసారమయ్యాయి.