బడుగులను అణచివేస్తున్నారు
గుజరాత్ పర్యటనలో ఆరెస్సెస్, మోదీపై రాహుల్ ధ్వజం
* దేశంలో ఆరెస్సెస్ భావజాలాన్ని ఓడిస్తాం
* ఉనా బాధితులకు పరామర్శ
రాజ్‌కోట్: గుజరాత్‌లో దళితులపై జరిగిన దాడుల విషయంలో బీజేపీ, ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. మోడల్ రాష్ట్రంగా ప్రధాని మోదీ చెప్పుకునే గుజరాత్‌లో బలహీన వర్గాలను భయభ్రాంతులకు గురిచేస్తుండటమేగాక వారిని అణగదొక్కేస్తున్నారని మండిపడ్డారు. ఆవు చర్మాలను ఒలుస్తున్నారనే నెపంతో దళితులపై జరిగిన దాడుల్లో బాధితులను, వారి కుటుంబ సభ్యులను రాహుల్ గురువారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీగారి గుజరాత్‌లో రోజూ దెబ్బలు తింటున్నామని, తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అణగదొక్కేస్తున్నారని బాధితులు తనతో చెప్పినట్లు రాహుల్ వెల్లడించారు. ‘‘ఈ యుద్ధం రెండు భావజాలాల మధ్య. ఒక పక్క మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, అంబేడ్కర్ ఉంటే.. మరో పక్క ఆరెస్సెస్, ఆరెస్సెస్ మాజీ అధినేత గోల్వాల్కర్, మోదీ ఉన్నారు. ఆరెస్సెస్ భావజాలాన్ని దేశమంతా ఓడిస్తామని బాధితులకు చెప్పాను’’ అని రాహుల్ పేర్కొన్నారు. హెచ్‌సీయూలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్యను ప్రస్తావించిన రాహుల్.. గుజరాత్‌లో 11 మంది ఆత్మహత్యాయత్నం కూడా హెచ్‌సీయూ ఘటనలాంటిదేనన్నారు.
ఉనా పట్టణానికి సమీపంలోని మోటా సమథైలయా గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి తన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున రాహుల్ ఇస్తారని ఎమ్మెల్యే శైలేష్ పర్మార్ చెప్పారు.
ఉధృతంగా ఆందోళనలు: గోవుల చర్మాలు ఒలుస్తున్నారని ఉనా పట్టణంలో ఈనెల 11న కొంతమంది దళితులపై దాడి చేసిన తర్వాత రాష్ట్రంలోని పలుచోట్ల ఆందోళనలు మిన్నం టాయి. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అమ్రేలీలో జరిగిన రాళ్లదాడిలో ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు.
కాంగ్రెస్ బస్సు యాత్ర: యూపీలో ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు చాటిచెప్పే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు సిద్ధమైంది. ఢిల్లీ నుంచి కాన్పూర్‌కు 600 కి.మీ. పొడవునా మూడు రోజులపాటు సాగే బస్సు యాత్ర 23న ఢిల్లీలో ప్రారంభంకానుంది.