
మోడీయే మా ప్రధాని అభ్యర్థి: స్పష్టం చేసిన ఆర్ఎస్ఎస్
రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీయే ఉండాలని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. మార్పు కావాలనుకుంటున్న ప్రజలంతా నరేంద్ర మోడీకే మద్దతిస్తారని తెలిపింది. అయితే, ఆయనను ప్రధాని అభ్యర్థిగా ఎప్పుడు ప్రకటించాలన్నది మాత్రం పార్టీ ఇష్టమేనని తెలిపింది.
దేశవ్యాప్తంగా తాము పలు కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్న విషయం స్పష్టమవుతోందని ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్ మాధవ్ తెలిపారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో కూడా ఈ విషయం వచ్చిందని, తాము పార్టీ నాయకత్వానికి తమ ఉద్దేశం తెలియజేశామని ఆయన అన్నారు.
మోడీ అభ్యర్థిత్వం పట్ల పార్టీలో కూడా ఎలాంటి గందరగోళం లేదని, కానీ.. ప్రకటన సమయాన్ని మాత్రం పార్టీయే చూసుకోవాలని అన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు వచ్చేవారం సమావేశం కావచ్చని పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ సూచనప్రాయంగా తెలిపారు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టినరోజు ఉండటంతో, అంతకంటే ముందే ఆయన అభ్యర్థిత్వ ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు.