సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అర్హతలన్నీ ఉన్నాయని సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించిన కాంగ్రెస్ పార్టీయే జాతీయ స్ధాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఇటీవల ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ లేని జాతీయ కూటమిని ఊహించలేమన్నారు. రాహుల్ గాంధీ తమ నేతని, కాంగ్రెస్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తగిన మెజారిటీ సాధిస్తే రాహుల్ గాంధీయే తదుపరి ప్రధాని అవుతారని స్పష్టం చేశారు.
సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి అయితే, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల అనంతరం ఏకాభిప్రాయం సాధించిన అభ్యర్థి వైపు కూటమి మొగ్గుచూపుతుందని పేర్కొన్నారు. సంకీర్ణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పీఎం అభ్యర్థి ఎంపిక జరుగుతుందని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే దీనిపై సంప్రదింపులు జరుగుతాయని వెల్లడించారు.
రాహుల్‌కు ఉన్న నైపుణ్యాలు, అర్హతల దృష్ట్యా ఆయన ప్రధాని పదవికి అన్ని విధాలా అర్హుడని స్పష్టం చేశారు. రాహుల్‌లో అందరినీ కలుపుకుపోయే గుణంతో పాటు భిన్న రాజకీయ విధానాలున్న నేతల వద్దకూ వెళ్లగలిగే చొరవ ఆయనకుందని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment