కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ?
న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది తెలిపారు. జనవరి 17న ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ ఏడాది జనవరిలో జైపూర్‌లో ఏఐసీసీ చివరిసారిగా సమావేశమైంది. ఈ సమావేశంలోనే రాహుల్ గాంధీని పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సమావేశం కానుంది. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం జరుగుతున్న సమావేశంలో పార్టీ పరిస్థితిపై లోతైన చర్చ జరపనున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో సంస్థాగత మార్పులు జరగవచ్చనే ఊహాగానాలు అప్పుడే ఊపందుకున్నాయి. దీనితో పాటు కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థిని సైతం ఈ సమావేశాల్లో ప్రకటించే అవకాశముంది.