Janardan Dwivedi
-
కాంగ్రెస్‌లో ‘కల్లోల కశ్మీరం’
జమ్మూ– కశ్మీర్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆ రాష్ట్రం ఎలా స్పందిస్తున్నదో తెలియడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ముందుజాగ్రత్త చర్యగా ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలవంటివన్నీ నిలిపేయడంతో ఈ సమస్య ఏర్పడింది. కానీ సుదీర్ఘకాలం ఈ దేశాన్నేలిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ నిర్ణయం వెలువడిన నాటినుంచి కకావికలవుతోంది. కింది స్థాయి నేతలు కశ్మీర్‌పై సరైన సమాచారం లేకపోవడంవల్లా, అవగాహన లోపించడంవల్లా మాట్లాడితే అర్థం చేసు కోవచ్చు. కానీ సీనియర్ నేతలే పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో పార్టీలో ఏర్పడిన సంక్షోభం ప్రభావమో, కశ్మీర్‌పై ఆ నేతలకు మొదటినుంచీ ఇలాంటి అయోమయావస్థ ఉందో ఎవరికీ తెలియదు. 370, 35ఏ అధికరణలను రద్దు చేస్తూ, జమ్మూ–కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నాక పార్లమెంటులో కాంగ్రెస్ ఆ చర్యను తప్పుబట్టింది. కొంత ఆలస్యంగానైనా రాహుల్‌గాంధీ ఒక ట్వీట్ ద్వారా ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ప్రకటన విడుదల చేశారు. కనుక పార్టీ అధికారిక వైఖరేమిటో ఆ నేతలందరికీ అర్ధమై ఉండాలి. కానీ సీనియర్ నాయకుడు జనార్దన్ ద్వివేది ఇందుకు పూర్తి భిన్నమైన వైఖరి తీసుకున్నారు. ఈ అధికరణల రద్దు ద్వారా ఒక చారిత్రక తప్పిదాన్ని సరిచేశారని చెప్పారు. ఇది దేశ సమగ్రత కోసం తీసుకున్న నిర్ణయమని మరో సీనియర్ నాయకుడు దీపేందర్ హుడా అన్నారు. ఇంకా జ్యోతిరాదిత్య సింధియా, మిలింద్ దేవరా, జితిన్ ప్రసాద, అభిషేక్ మను సింఘ్వి వంటివారు కూడా ఆ మాదిరి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. రాజ్య సభలో పార్టీ చీఫ్ విప్‌గా ఉన్న భువనేశ్వర్ కలితా పార్టీ వైఖరితో విభేదిస్తూ ఎంపీ పదవికే రాజీనామా చేశారు. మరో సీనియర్ నేత కరణ్‌సింగ్ సైతం ఈ జాబితాలో చేరారు. ఇక కింది స్థాయి నేతల గురించి చెప్పేదేముంది? కానీ ఇలాంటివారిని సహచర సీనియర్ నేతలు అవకాశవాదులం టున్నారు. శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కాబోతోంది. అందులో రాహుల్ వారసుడి ఎంపికే ప్రధానాంశంగా ఉంటుందని సమాచారం. రెండునెలల జాప్యం తర్వాత ఆ పార్టీలో కదలిక రావడం దాని దుస్థితికి అద్దం పడుతుంది. కశ్మీర్ విషయంలో సీనియర్ నేతలు ఇష్టానుసారం చేస్తున్న ప్రకటనల గురించి కూడా వర్కింగ్ కమిటీ సమావేశం చర్చిస్తుందని అంటున్నారు. నిజానికి 370 అధికరణ రాజ్యాంగంలో పొందుపరిచిన కొద్దికాలంలోనే దాన్ని నీరుగార్చిన చరిత్ర కాంగ్రెస్‌ది. నెహ్రూ కాలంలోనే అందుకు బీజం పడింది. తదనంతరకాలంలో దాన్ని మరిం తగా బలహీనపరిచింది కూడా కాంగ్రెస్ పాలకులే. చివరకు తమకు అనుకూలంగా లేని పార్టీలు అధికారంలోకొస్తే ఆ ప్రభుత్వాలను చిక్కుల్లో పడేసి, తమను లెక్కచేయడం లేదనుకుంటే బర్తరఫ్ చేసి కశ్మీర్‌తో ఆడుకున్నది కాంగ్రెస్ హయాంలోనే. 1975లో షేక్ అబ్దుల్లాతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఒప్పందం కుదుర్చుకుని ఆయన్ను జైలునుంచి విడుదల చేసింది. 1981లో తన కుమారుడు ఫరూక్ అబ్దుల్లాను వారసుడిగా ప్రకటించినప్పుడు ఆయన శిరస్సుపై తానుంచుతున్నది ముళ్ల కిరీ టమేనని షేక్ అబ్దుల్లా హెచ్చరించారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలతో ఆయనకున్న అను భవం అలాంటిది. 1983లో జమ్మూ–కశ్మీర్లో జరిగిన ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఘన విజయం సాధించింది. ఎంతో ప్రజాదరణతో అధికారం చేజిక్కిం చుకున్న ఫరూక్‌ను ఆ మరుసటి ఏడాదే కూలదోశారు. ఆ తర్వాత ఏమాత్రం జనాదరణలేని గులాం మహమ్మద్ షా నేతృత్వంలో ఫిరాయింపు ప్రభుత్వాన్ని నెలకొల్పారు. 1986లో మతకల్లోలాలు రేగాక ఆయన్ను బర్తరఫ్ చేశారు. ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎన్సీ– కాంగ్రెస్ లమధ్య పొత్తు కుదిరింది. ఆ ఎన్నికల్లో భారీయెత్తున రిగ్గింగ్ జరిగిందన్న అపఖ్యాతి మూటగట్టు కుని ఎట్టకేలకు ఆ కూటమి గట్టెక్కింది. సరిగ్గా ఆ తర్వాత నుంచే కశ్మీర్‌లోయలో మిలిటెన్సీ ముదిరింది. సాయుధ శిక్షణ పొందిన ఉగ్రవాదులు చొరబడి హత్యలు, అపహరణలతో అట్టుడికిం చారు. అప్పటి కేంద్రమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబియా సయీద్‌ను మిలిటెంట్లు కిడ్నాప్ చేయడం, తమవారిని విడిపించుకోవడం ఆ కాలంలోనే జరిగింది. ఆ రాష్ట్రం విషయంలో కేంద్రం తప్పులు మీద తప్పులు చేస్తూ పోయింది. అక్కడ పరిస్థితులు నానాటికీ క్షీణిస్తూనే ఉన్నాయి. అది సరిహద్దు రాష్ట్రమని, అక్కడ ఏం జరిగినా పొరుగునున్న పాకిస్తాన్ దాన్ని తన స్వప్రయోజనాలకు వినియోగించుకునే ప్రమాదం ఉన్నదని, దేశానికి అది చేటు తెస్తుందని కాంగ్రెస్ ఏనాడూ అనుకోలేదు. ఇప్పుడు కేంద్రం తీసుకున్న చర్యల్ని సమర్థించేవారిలో చాలామంది రాహుల్ అనుయాయు లుగా ముద్రపడినవారే. 370 అధికరణ విషయంలో అనేక అభిప్రాయాలున్నాయి. కశ్మీర్ ఎదుర్కొంటున్న సకల సమస్యలకూ అదే మూలమని, ఆ అధికరణ రద్దయితే ఆ రాష్ట్రం అభివృద్ధి ఖాయ మని బీజేపీని సమర్ధించేవారు చెబుతున్నారు. దాంతో ఏకీభవిస్తూనే అందుకనుసరించిన విధానాన్ని వ్యతిరేకించేవారున్నారు. ఆ చర్య ప్రమాదకరమని, కశ్మీరీలను అది మరింత దూరం చేస్తుందని వాదించేవారున్నారు. కానీ ఆ అధికరణ ఉండాలని చెప్పే ముందు కాంగ్రెస్ తనవైపుగా గతంలో తప్పిదాలు జరిగాయని అంగీకరించి ఉంటే ఆ పార్టీతో ఏకీభవించినా, ఏకీభవించక పోయినా కనీసం దాని చిత్తశుద్ధిని జనం ప్రశంసించేవారు. అది లేకపోబట్టే జనం సంగతలా ఉంచి, పార్టీలోని సీనియర్ నేతలే కాంగ్రెస్ వైఖరితో విభేదిస్తున్నారు. వారిని అవకాశవాదులంటూ నిందించే బదులు ఇతర సీనియర్ నేతలు ఇన్ని దశాబ్దాలుగా కశ్మీర్లో తమ విధానాలెలా ఉన్నాయో ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాటలకూ, చేతలకూ... సిద్ధాంతాలకూ, ఆచరణకూ పొంతన లేకుండా ఎల్లకాలమూ గడిపేద్దామనుకుంటే చెల్లదని గ్రహించాలి. -
సీడబ్ల్యూసీ భేటీ 8న
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈనెల 8న ఢిల్లీలో సమావేశం కానుంది. భూ సేకరణ ఆర్డినెన్స్‌పై మోదీ సర్కారు వెనక్కి తగ్గడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, సీఎంలు రాజీనామా చేయాలనే తమ డిమాండ్‌ను ఎలా తీవ్రతరం చేయాలనే అంశాలు చర్చకు రావొచ్చని తెలుస్తోంది. వర్తమాన రాజకీయ పరిస్థితిపై చర్చించడానికి ఈనెల 8న సీడబ్ల్యూసీ భేటీ అవుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది వెల్లడించారు. 2010లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. దీన్ని మళ్లీ మూడేళ్లకు తగ్గిస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. -
జనార్ధనుడి నోట నరేంద్ర రాగం
-
దిగ్విజయ్ సింగ్ పై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జనార్ధన్ ద్వివేదిపై కాంగ్రెస్ అధిష్టానం అగ్రహం వ్యక్తం చేసింది. అనుభవజ్క్షులకు ప్రాధాన్యత ఇవ్వకుండా యువతకు పెద్దపీట వేశారని కాంగ్రెస్ అధిష్టానంపై దిగ్విజయ్, జనార్ధన్ ద్వివేది వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని పార్టీ జాతీయ కార్యదర్శి మధుసూధన్ మిస్త్నీ మీడియాతో అన్నారు. మీడియాలో బహిరంగంగా.. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడానికి మిస్త్రీ తప్పు పట్టారు. ఎదైనా తమ అభిప్రాయాలను పంచుకోవాలంటే యువనేత రాహుల్ గాంధీ వారికి అందుబాటులోనే ఉన్నారని ఆయన అన్నారు. కొన్ని కీలక అంశాలపై రాహుల్ మౌనంగా ఉండటం పార్టీకి నష్టం కలిగించిందని మీడియాతో గతంలో దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. -
జనార్దన్ ద్వివేది సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జనార్దన్ ద్వివేది చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. వృద్ధ నాయకులు క్రియాశీలక పదవుల నుంచి వైదొలగాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్లు నిండిన నేతలు క్రియాశీలక పదవులకు దూరంగా ఉండి, తర్వాతి తరం వారికి అవకాశం కల్పించాలని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో 69 ఏట అడుగుపెట్టనున్న ద్వివేది తన వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పడేశారు. అయితే పార్టీ అధ్యక్షులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవులు చేపట్టవారికి ఈ విషయంలో మినహాయింపు ఉండొచ్చన్నారు. గతంలోనూ ద్వివేది వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్థికస్థితి ఆధారంగానే రిజర్వేషన్లు ఉండాలని, ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారని వ్యాఖ్యానించి కలకలం రేపారు. -
కాంగ్రెస్ ప్రచార సారథి సోనియానే
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారానికి అందరూ అనుకుంటున్నట్టు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సారథ్యం వహించబోవడం లేదు. ఆ బాధ్యతను అధ్యక్షురాలు సోనియా గాంధీనే చేపట్టనున్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ 50 మంది నేతలతో ప్రచార కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సోనియా చైర్‌పర్సన్‌గా, రాహుల్ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తారని ఏఐసీసీ మంగళవారం విడుదల చేసిన ఆ కమిటీ సభ్యుల జాబితాలో తెలిపింది. అయితే ఇందులో సోనియా పేరు ప్రస్తావించకుండా.. ‘గౌరవ కాంగ్రెస్ ప్రెసిడెంట్.. చైర్‌పర్సన్‌గా, రాహుల్ గాంధీ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తారు’ అని మాత్రమే పేర్కొన్నారు. జాబితాలో మొత్తం 50 మంది పేర్లు ఉండగా.. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి జేడీ శీలంకు మాత్రమే చోటు కల్పించారు. జాబితాకు సోనియా ఆమోదముద్ర వేశారని పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ సంబంధిత ప్రకటనలో తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార బాధ్యతలు పూర్తిగా రాహుల్‌కే కట్టబెట్టాలని గత నెల 17న ఏఐసీసీ సమావేశానికి ముందు రోజు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో నిర్ణయించడం తెలిసిందే. జాబితాలో ముఖ్యులు.. ప్రధాని మన్మోహన్సింగ్, మోతీలాల్ వోరా, ఏకే ఆంటోనీ, సుశీల్‌కుమార్ షిండే, అహ్మద్ పటేల్, జనార్దన్ ద్వివేది, పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్, ఆస్కార్ ఫెర్నాండెజ్, షీ లాదీక్షిత్, మొహిసినా కిద్వాయ్, అశోక్ గెహ్లాట్, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, సీపీ జోషి, మధుసూదన్ మిస్త్రీ, అజయ్ మాకెన్, ఆనంద్‌శర్మ, కమల్‌నాథ్, సల్మాన్ ఖుర్షీద్, జైరాం రమేశ్, అజిత్ జోగి, అమరీందర్ సింగ్, వి.నారాయణసామి, జ్యోతిరాదిత్య సింధియా, మనీశ్ తివారీ తదితరులు ఉన్నారు. -
‘కోటా’ మాటలపై దుమారం
న్యూఢిల్లీ: కుల ప్రాతిపదికన కాకుండా, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలంటూ కాంగ్రెస్ నేత జనార్దన్ ద్వివేది చేసిన వ్యాఖ్యలు బుధవారం రాజకీయ దుమారాన్ని రేపాయి. ద్వివేది వ్యాఖ్యలు సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉన్నాయంటూ యూపీఏ సర్కారుకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ మండిపడ్డాయి. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యమేమిటని బీజేపీ, శిరోమణి అకాలీదళ్ ప్రశ్నించాయి. ఈ అంశం వివాదాస్పదంగా మారడంతో ద్వివేది వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనంటూ కాంగ్రెస్, యూపీఏ సర్కారు పేర్కొన్నాయి. మరోవైపు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ వివాదాన్ని చల్లార్చేందుకు రంగంలోకి దిగారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. కాగా, సామాజిక న్యాయ వ్యవస్థకు స్వస్తి పలకాలని కాంగ్రెస్ యత్నిస్తోందని ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ ఆరోపించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి ని స్పష్టం చేయాలని బీఎస్పీ చీఫ్ మాయావతి డిమాం డ్ చేశారు. ద్వివేది వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఎస్పీ సభ్యులు పార్లమెంటులో నినాదాలతో హోరెత్తించారు. ఎస్పీ, జేడీయూ సభ్యులు వారితో గొంతు కలిపారు. వైఖరిలో మార్పులేదు... సోనియా: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సాధికారత కల్పించే ఉద్దేశంతో వారికి రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది, వాటిని బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గుర్తు చేశారు. ద్వివేదీ వ్యాఖ్యలపై కలకలం రేగిన నేపథ్యంలో ఆమె రెండు పేజీల ప్రకటన విడుదల చేశారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి పట్ల ఎలాంటి సందేహాలకూ తావు లేదని, రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. శతాబ్దాల తరబడి వివక్షకు గురైన వర్గాలకు న్యాయం కల్పించేం దుకు రిజర్వేషన్లు అవసరమని ఆమె పేర్కొన్నారు. కాగా, రిజర్వేషన్లపై ద్వివేదీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా స్పష్టం చేశారు. -
ఆ సంప్రదాయం కాంగ్రెస్‌లో లేదన్న సోనియా
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తే తామేందుకు ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుడు జనార్థన్ ద్వివేది ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీని పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికల ప్రచార సారథిగా ప్రకటిస్తూ సమావేశంలో తీర్మానం ఆమోదించామని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం రాహుల్ పనిచేస్తానని రాహుల్ చెప్పారన్నారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని పలువురు సీడబ్ల్యూసీ సభ్యులు కోరానని తెలిపారు. అయితే ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ సంప్రదాయం కాదని సోనియా గాంధీ అన్నట్టు వెల్లడించారు. -
ఆప్‌కు మద్దతివ్వడంపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి కాంగ్రెస్ మద్దతివ్వడంపై అప్పుడే పార్టీలో లుకలుకలు ప్రారంభమైయ్యాయి. ఆప్ కు మద్దతివ్వడం సరికాదంటూ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం భావిస్తున్నట్లు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జనార్ధన్ ద్వివేది తెలిపారు. కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించలేదన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ద్వివేది.. ఏఏపీకి మద్దతుపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలున్నట్లు తెలిపారు. పార్టీని ప్రజలు గెలిపించలేదని, ప్రతిపక్షంలో కూర్చుని ప్రజా సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందరి ఊహలకూ, అంచనాలకూ భిన్నంగా ఢిల్లీ ఎన్నికల్లో 28 స్థానాలు తెచ్చుకుని ద్వితీయ స్థానంలో నిలబడిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. అయితే, ఫలితాలు వెలువడి 28 స్థానాలు వచ్చాయని నిర్ధారణ కాగానే ఓటర్లు తమకు అధికారం అప్పగించలేదు కాబట్టి... తాము అందుకు సుముఖంగా లేమని ఆ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక రాష్ట్రపతి పాలన తప్ప మార్గంలేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కేంద్రానికి నివేదిక కూడా పంపారు. ఈ తరుణంలో ఆప్ కాంగ్రెస్ మద్దతుతో ఆప్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది.ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ముసలం మొదలైంది. ఆప్ కు మద్దతివ్వాలని ఒక వర్గం భావిస్తుండగా, మరో వర్గం దూరంగా ఉంటేనే మంచిదని అభిప్రాయ పడుతుంది. -
కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ?
న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది తెలిపారు. జనవరి 17న ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ ఏడాది జనవరిలో జైపూర్‌లో ఏఐసీసీ చివరిసారిగా సమావేశమైంది. ఈ సమావేశంలోనే రాహుల్ గాంధీని పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవం అనంతరం త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సమావేశం కానుంది. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం జరుగుతున్న సమావేశంలో పార్టీ పరిస్థితిపై లోతైన చర్చ జరపనున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో సంస్థాగత మార్పులు జరగవచ్చనే ఊహాగానాలు అప్పుడే ఊపందుకున్నాయి. దీనితో పాటు కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థిని సైతం ఈ సమావేశాల్లో ప్రకటించే అవకాశముంది. -
సోనియా డిశ్చార్జి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం తెల్లవారుజామున అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నుంచి డిశ్చార్జి అయ్యారు. అస్వస్థతతో సోమవారం రాత్రి ఎయిమ్స్‌లో చేరిన సోనియా సుమారు ఐదు గంటల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. అన్నిరకాల వైద్య పరీక్షల అనంతరం ఇంటికి వెళ్లారు. మంగళవారం ఆమె పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేదు. వైద్య పరీక్షలన్నీ పూర్తి చేసుకుని సోనియాజీ ఇంటికి తిరిగి వచ్చారని, ఆమె ఇప్పుడు బాగానే ఉన్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది తెలిపారు. ‘ఆమె దగ్గు, తలనొప్పితో బాధపడ్డారు. మందులు తీసుకున్న తర్వాత పార్లమెంటులో ఉన్నప్పుడు కొంత నలతగా ఉన్నట్టు భావించారు. అందుకే ఆస్పత్రికి వచ్చారు..’ అని ఎయిమ్స్ డెరైక్టర్ ఆర్.సి.డేకా చెప్పారు. అలాంటి వ్యాధులకు చేయాల్సిన పరీక్షలన్నీ చేసిన తర్వాత ఎలాంటి సమస్యా లేదని గుర్తించామన్నారు. మేడమ్ త్వరలోనే తిరిగి పార్లమెంటు సమావేశాలకు హాజరవుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి భక్త చరణ్ దాస్ చెప్పారు. ఇలావుండగా కాంగ్రెస్ అధ్యక్షురాలు త్వరగా కోలుకోవాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ సందేశంలో ఆకాంక్షించారు. సోనియాను అన్ని సౌకర్యాలు ఉన్న అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి ఉండాల్సిందని పేర్కొన్నారు. సోనియాజీ ఆరోగ్యం మెరుగుపడిందనే వార్త ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. భవిష్యత్తులోనూ ఆమె మంచి ఆరోగ్యంతో కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విపక్ష నేత సుష్మాస్వరాజ్ సహా పలువురు నేతలూ ఆమె ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.