సోనియా డిశ్చార్జి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం తెల్లవారుజామున అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నుంచి డిశ్చార్జి అయ్యారు. అస్వస్థతతో సోమవారం రాత్రి ఎయిమ్స్‌లో చేరిన సోనియా సుమారు ఐదు గంటల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. అన్నిరకాల వైద్య పరీక్షల అనంతరం ఇంటికి వెళ్లారు. మంగళవారం ఆమె పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేదు. వైద్య పరీక్షలన్నీ పూర్తి చేసుకుని సోనియాజీ ఇంటికి తిరిగి వచ్చారని, ఆమె ఇప్పుడు బాగానే ఉన్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది తెలిపారు. ‘ఆమె దగ్గు, తలనొప్పితో బాధపడ్డారు. మందులు తీసుకున్న తర్వాత పార్లమెంటులో ఉన్నప్పుడు కొంత నలతగా ఉన్నట్టు భావించారు.
అందుకే ఆస్పత్రికి వచ్చారు..’ అని ఎయిమ్స్ డెరైక్టర్ ఆర్.సి.డేకా చెప్పారు. అలాంటి వ్యాధులకు చేయాల్సిన పరీక్షలన్నీ చేసిన తర్వాత ఎలాంటి సమస్యా లేదని గుర్తించామన్నారు. మేడమ్ త్వరలోనే తిరిగి పార్లమెంటు సమావేశాలకు హాజరవుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి భక్త చరణ్ దాస్ చెప్పారు. ఇలావుండగా కాంగ్రెస్ అధ్యక్షురాలు త్వరగా కోలుకోవాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ సందేశంలో ఆకాంక్షించారు. సోనియాను అన్ని సౌకర్యాలు ఉన్న అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి ఉండాల్సిందని పేర్కొన్నారు. సోనియాజీ ఆరోగ్యం మెరుగుపడిందనే వార్త ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. భవిష్యత్తులోనూ ఆమె మంచి ఆరోగ్యంతో కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విపక్ష నేత సుష్మాస్వరాజ్ సహా పలువురు నేతలూ ఆమె ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.