అరుదైన ఆపరేషన్:వీణావాణి భవిష్యత్‌పై ఆశ
న్యూఢిల్లీ: భారతదేశంలో మొట్టమొదటిసారి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అరుదైన శస్త్రచికిత్సను ప్రారంభించారు. తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన అవిభక్త కవలలు వీణావాణి మాదిరే తలలు అతుక్కుని పుట్టిన కవలలకు ఈ శస్త్రచికిత్సకు వైద్యులు శ్రీకారం చుట్టారు. ఒడిశా కంధమాల్ జిల్లాలో ఓ పేద రైతుకుటుంబంలో పుట్టిన జగన్నాథ్, బలియాలను వేరుచేసే హిస్టారికల్ ఆపరేషన్‌ను సోమవారం ప్రారంభించారు. ప్రస్తుతం వీరి వయసు రెండు సంవత్సరాల మూడు నెలలు.
చాలా అరుదైన ఈ కవలలిద్దరీ కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామనీ, కనీసం ఒక్కరు బతికినా అది చారిత్రక ఘటనగా నిలిచిపోతుందని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. మెదడు నుండి గుండెకు రక్తాన్ని పంప్ చేసే సిరలను కవలలిద్దరూ పంచుకుని పుట్టడంతో ఈ ఆపరేషన్ చాలా క్లిష్టమైందని వైద్యులు చెప్పారు.
దాదాపు 40మంది స్పెషలిస్టులు ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటున్నారు. మొత్తం 50 గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగనుంది. మొదటి దశలో 6నుంచి 8 గంటలపాటు ఉంటుందని సమాచారం. పీడియాట్రిక్ న్యూరో సర్జన్లు, న్యూరో-అనస్థీషియా, ప్లాస్టిక్ సర్జరీ, కార్డియోవాస్క్యులర్ సైన్సెస్‌కు చెందిన నిపుణులు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. వీరికితోడు ఈ ప్రక్రియలో జపాన్ ఎక్స్‌పర్ట్ కూడా సహాయపడనున్నారు. పలుమార్లు ఎంఆర్‌ఐలు, యాంజియోగ్రాములు, ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఇటువంటి శస్త్రచికిత్సలపై స్టడీ, అనేకమంది నిపుణులతో సంప్రదింపులు తరువాత కవలలో కనీసం ఒకరినైనా రక్షించాలని ఆశతో ఈ నిర్ణయానికి వచ్చామని ఎయిమ్స్ సర్జన్ ఒకరు చెప్పారు.
మరోవైపు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడారు. ఆపరేషన్ విజయంతం కావాలని ఆకాక్షించారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి రూపాయల ఆర్థిక సహాయం సమకూర్చగా, కాంధమాల్ ఎడ్మినిస్ట్రేషన్ రూ.లక్ష అందించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇవ్వాలని కాంధమాల్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
వివిధ దశల్లో ఈ ఆపరేషన్ నిర్వహించనున్నారు. మొదటి దశలో మెదడునుండి సిర వేరు చేసి, ఒక ప్రత్యామ్నాయ సిర ఛానెల్ ఏర్పాటు చేస్తారు. అనంతరం పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ.. పూర్తిగా మెదడును వేరుచేసి, చర్మాన్ని మూసివేయడంతో ఈ ప్రక్రియ ముగియనుంది. ఇది విజయవంతమైతే భవిష్యత్తు వైద్యశాస్త్రవిజ్ఞానానికి ఒక ఆశను ఇచ్చినట్టు అవుతుందని, తద్వారా మరిన్ని పరిశోధనలకు అవకాశం కలుగుతుందనే ఆశాభావాన్ని వైద్యులు వ్యక్తం చేశారు.
కాగా ఒడిశా కంధమాల్ జిల్లా కు చెందిన భుయాన్, పుష్పాలకు వీరు జన్మించారు. గత నెలలో వీరిని ఎయిమ్స్‌కు తరలించారు. మరోవైపు పాట్నాకు చెందిన సిస్టర్స్ సబా ,ఫరా 20 ఏళ్ల వయస్సు. ప్రమాదాల కారణంగా వారు ఆపరేట్ చేయలేదు. అయితే ఇటీవలి కాలంలో న్యూయార్క్‌లోని ని మాంటెఫియోర్ ఆసుపత్రి సర్జన్లు 13 నెలల వయస్సున్న కవలలను విజయవంతమైన వేరు చేయడం విశేషం.
తలలు కలిసి పుట్టే కవలలు చాలా అరుదు. 2.5 కోట్లమందిలో ఒక జననం సంభవిస్తుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఇలాంటి మొత్తం జననాల సుమారు సంఖ్య 10. అటువంటి కవలలలో నాలుగురు పుట్టినప్పుడే చనిపోగా, 24 గంటల్లో ముగ్గురు మరణించారు. 1952 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కవలలను వేరు చేయటానికి కేవలం 50 ప్రయత్నాలు మాత్రమే జరిగాయి. సక్సెస్ రేటు 25శాతం కన్నా తక్కువ. ఈ ఆపరేషన్ పూర్తి విజయంవంతం కావాలని కోరుకుందాం. ఈ నేపథ్యంలో మన వీణావాణి కష్టాలు కడతేరి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మనం కూడా ప్రార్థిద్దాం!