
జనార్దన్ ద్వివేది సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జనార్దన్ ద్వివేది చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. వృద్ధ నాయకులు క్రియాశీలక పదవుల నుంచి వైదొలగాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్లు నిండిన నేతలు క్రియాశీలక పదవులకు దూరంగా ఉండి, తర్వాతి తరం వారికి అవకాశం కల్పించాలని ఆయన వ్యాఖ్యానించారు.
వచ్చే నెలలో 69 ఏట అడుగుపెట్టనున్న ద్వివేది తన వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పడేశారు. అయితే పార్టీ అధ్యక్షులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవులు చేపట్టవారికి ఈ విషయంలో మినహాయింపు ఉండొచ్చన్నారు. గతంలోనూ ద్వివేది వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్థికస్థితి ఆధారంగానే రిజర్వేషన్లు ఉండాలని, ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారని వ్యాఖ్యానించి కలకలం రేపారు.