‘కోటా’ మాటలపై దుమారం
న్యూఢిల్లీ: కుల ప్రాతిపదికన కాకుండా, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలంటూ కాంగ్రెస్ నేత జనార్దన్ ద్వివేది చేసిన వ్యాఖ్యలు బుధవారం రాజకీయ దుమారాన్ని రేపాయి. ద్వివేది వ్యాఖ్యలు సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉన్నాయంటూ యూపీఏ సర్కారుకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ మండిపడ్డాయి. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యమేమిటని బీజేపీ, శిరోమణి అకాలీదళ్ ప్రశ్నించాయి. ఈ అంశం వివాదాస్పదంగా మారడంతో ద్వివేది వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనంటూ కాంగ్రెస్, యూపీఏ సర్కారు పేర్కొన్నాయి.
మరోవైపు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ వివాదాన్ని చల్లార్చేందుకు రంగంలోకి దిగారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. కాగా, సామాజిక న్యాయ వ్యవస్థకు స్వస్తి పలకాలని కాంగ్రెస్ యత్నిస్తోందని ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ ఆరోపించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి ని స్పష్టం చేయాలని బీఎస్పీ చీఫ్ మాయావతి డిమాం డ్ చేశారు. ద్వివేది వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఎస్పీ సభ్యులు పార్లమెంటులో నినాదాలతో హోరెత్తించారు. ఎస్పీ, జేడీయూ సభ్యులు వారితో గొంతు కలిపారు.
వైఖరిలో మార్పులేదు... సోనియా: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సాధికారత కల్పించే ఉద్దేశంతో వారికి రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది, వాటిని బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గుర్తు చేశారు. ద్వివేదీ వ్యాఖ్యలపై కలకలం రేగిన నేపథ్యంలో ఆమె రెండు పేజీల ప్రకటన విడుదల చేశారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి పట్ల ఎలాంటి సందేహాలకూ తావు లేదని, రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. శతాబ్దాల తరబడి వివక్షకు గురైన వర్గాలకు న్యాయం కల్పించేం దుకు రిజర్వేషన్లు అవసరమని ఆమె పేర్కొన్నారు. కాగా, రిజర్వేషన్లపై ద్వివేదీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా స్పష్టం చేశారు.