ఈ శతాబ్దం భారత్‌దే! | Modi fires on UPA government once again | Sakshi
Sakshi News home page

ఈ శతాబ్దం భారత్‌దే!

Published Tue, Sep 29 2015 3:07 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

ఈ శతాబ్దం భారత్‌దే! - Sakshi

ఈ శతాబ్దం భారత్‌దే!

ప్రపంచం ఆ విషయాన్ని గుర్తించింది 
ఐరాస నేటికీ ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదు

 
 ఇప్పటికైనా ఆ దిశగా యూఎన్ చర్యలు తీసుకోవాలి
♦ నా జీవితంలోని ప్రతీక్షణం దేశసేవకే అంకితం
♦ శాన్‌జోస్‌లోని సాప్ సెంటర్‌లో ప్రధాని మోదీ ఉద్వేగపూరిత ప్రసంగం
 
 శాన్‌జోస్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికాలో మరోసారి రాక్‌స్టార్ ప్రదర్శన ఇచ్చారు. శాన్ జోస్ సాప్ సెంటర్‌లో సోమవారం ఉదయం(భారతీయ కాలమానం ప్రకారం) దాదాపు 18,500 మంది భారతీయ అమెరికన్లను తన ట్రేడ్‌మార్క్ ప్రసంగంతో ఉర్రూతలూగించారు. 21వ శతాబ్ది భారత్‌దేనని తేల్చి చెప్పారు. తన జీవితంలోని ప్రతీక్షణం దేశ సేవకే అంకితమని, ‘ఈ దేహం దేశానిదే’నని ఉద్వేగపూరిత వ్యాఖ్య చేశారు. నేటికీ ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేకపోయిందంటూ ఐక్యరాజ్యసమితిపై నిప్పులు చెరిగారు. నిర్వచించడానికే ఇంత సమయం తీసుకుంటే ఉగ్రవాద భూతాన్ని అంతం చేసేందుకు ఇంకెంత సమయం పడ్తుందని సూటిగా ప్రశ్నించారు.

మోదీ ప్రసంగానికి సభికులు పలుమార్లు హర్షధ్వానాలతో స్పందించారు. యూఎస్‌లోని భారతీయ ఐటీ నిపుణులపై ప్రశంసలు.. భారత్ భవిష్యత్‌పై భరోసా.. కాంగ్రెస్‌పై నర్మగర్భంగా అవినీతి ఆరోపణలు.. డిజిటల్ ఇండియా, జన్‌ధన్ యోజన తదితర ప్రభుత్వ పథకాలు.. పలు అంశాలను ప్రస్తావిస్తూ ఆహూతులను ఆకట్టుకున్నారు. గత పర్యటనలో తూర్పుతీర నగరం న్యూయార్క్‌లో భారతీయులనుద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేసిన మోదీ.. ఈ పర్యటనలో పశ్చిమతీరంలోని ప్రపంచ ఐటీ రాజధాని సిలికాన్ వ్యాలీ(కాలిఫోర్నియా) కేంద్రంగా అమెరికాలోని భారతీయుల మనసు గెల్చుకున్నారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

 125 కోట్ల భారతీయుల పట్టుదల
 21వ శతాబ్ది భారత్‌ది. భారతీయులది. గత 16 నెలలుగా భారత్‌పై ప్రపంచ దేశాల వైఖరిలో గొప్ప మార్పు వచ్చింది. ప్రపంచం ఇప్పుడు భారత్‌ను కొత్త దృష్టితో, కొత్త ఆకాంక్షలతో చూస్తోంది. ఈ సానుకూల మార్పునకు ప్రధాన కారణం 125 కోట్లమంది భారతీయుల కృషి, పట్టుదల, నిబద్ధత. భారత్ భవిష్యత్తుపై ఇక నాకేం ఆందోళన లేదు. భారత్ జనాభాలో 80 కోట్లమందిది 35 ఏళ్లలోపున్న ఉత్సాహపూరిత యువరక్తమే. అందుకే కచ్చితంగా చెప్పగలను భారత్‌కు ఇక వెనకడుగు లేదు. 15 నెలల్లోనే భారత్ నూతన శిఖరాలకు చేరుకుంది. ఆర్థిక సుస్థిరత సాధించింది. గత ఆర్నెల్లుగా దాదాపు అన్ని రేటింగ్ సంస్థలు ఒకే మాట చెబ్తున్నాయి. పెద్ద దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతేనని తేల్చిచెబ్తున్నాయి.

 ప్రమాదకర సవాలు.. ఉగ్రవాదం!
 ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రమాదకర సవాళ్లు రెండు. ఒకటి ఉగ్రవాదం. రెండోది వాతావరణ మార్పు.  పటిష్ట కార్యాచరణ, సమైక్య నిబద్ధతతోనే వాటిని ఎదుర్కోగలం. భారత్ గత 40 ఏళ్లుగా ఉగ్రవాదంతో బాధపడ్తోంది. ఐరాస ఇప్పటివరకు ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేకపోయింది. ఈ అంశాన్ని రేపు ఐరాస భేటీలో లేవనెత్తనున్నాను. 70వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఉగ్రవాదంపై స్పష్టమైన నిర్వచనం ఇవ్వాల్సిన బాధ్యత ఐరాసపై ఉంది. అప్పుడే ఉగ్రవాదం వైపు ఎవరు?.. మానవత్వం వైపు ఎవరు? అన్నది తేలుతుంది. వారికి తమ మార్గాన్ని ఎన్నుకునేందుకు స్పష్టత లభిస్తుంది.

అప్పుడే శాంతి సాధ్యమవుతుంది. స్పష్టమైన నిర్వచనం లేకపోవడంతో మంచి టైజం, చెడ్డ టైజం అనే మాటలు వినిపిస్తున్నాయి. అలాంటి మాటలతో మానవత్వాన్ని కాపాడలేం. ఉగ్రవాదం ఉగ్రవాదమే. పాశ్చాత్య దేశాలు తమ దేశంపై ఉగ్రవాద దాడులు జరిగాకే మేలుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలి. ఐరాసపై ఒత్తిడి తేవాలి. భారతదేశం గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ లాంటి మహనీయుల గడ్డ. భారత్ శాంతిని, అహింసను కోరుకునే దేశం.

 ఐటీలో భారతీయుల అసమాన సేవ
 ఐటీలో మీ సామర్థ్యం ద్వారా ప్రపంచం దృష్టిలో భారత్‌ను సమున్నతంగా నిలిపారు. కీబోర్డ్‌పై మీరు చేసిన మ్యాజిక్‌తో భారత్‌కు కొత్త గుర్తింపునిచ్చారు. మీ సామర్థ్యం, నిబద్ధత, సృజనాత్మకతతో ప్రపంచాన్ని మార్పునకు సిద్ధం చేస్తున్నారు. అమెరికన్లు కూడా భారతీయ అమెరికన్ల పట్ల గర్వంగా ఫీల్ అవుతుంటారు. అది గొప్ప విషయం. ఇందుకు మీకు సెల్యూట్ చేస్తున్నా. ఇది మేధో వలస కాదు.. మేధో సంపద. ఇది బ్రెయిన్ డిపాజిట్. ఇది అవసరమైనప్పుడు మాతృభూమికి సేవ చేస్తుంది. ఇప్పుడా సమయం వచ్చింది. భారతీయుల ఐక్యశక్తిని చూపాలి.

 ఈ రోజు భగత్‌సింగ్ జయంతి.. ఇక్కడ ఈ రోజు సెప్టెంబర్ 27 కానీ భారత్‌లో సెప్టెంబర్ 28. అది షహీద్ భగత్‌సింగ్ జయంతి. ఆ అమరవీరుడికి సెల్యూట్ చేస్తున్నా. (సభికులతో వీర్ భగత్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేయించారు)

 కాలిఫోర్నియాతో అనుబంధం
 భారత్‌తో కాలిఫోర్నియాకు చరిత్రాత్మక అనుబంధం ఉంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా గదర్ పార్టీ పనిచేసింది. ఇక్కడి ప్రజలకు భారతీయులంటే ఎంతో అభిమానం. భారతీయ చేతన ఇక్కడ నాకు కనిపిస్తోంది.

 ప్రముఖుల హాజరు.. ఈ కార్యక్రమానికి అమెరికాలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో నాన్సీ పెలోసి(అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్), ఎడ్ రాయిస్(అమెరికా విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్) తదితరులున్నారు.

 నిరసనలు..
 కార్యక్రమం సందర్భంగా సాప్ సెంటర్ వెలుపల ప్రత్యేక ఖలిస్తాన్ మద్దతుదారులైన సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థ సభ్యులు శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా బ్యానర్‌ను ప్రదర్శించారు. కాగా, గురువారం మినాలో హజ్‌యాత్రలో జరిగిన తొక్కిసలాటలో వెయ్యిమందికిపైగా మృతిచెందడంపై మోదీ సంతాపం తెలుపుతూ మినా అధికారులు సందేశం పంపారు.
 
 
 నా మిషన్ ‘జామ్’

 నా మిషన్ ‘జామ్’. అంటే జనధన్ యోజన.. ఆధార్.. మొబైల్ గవర్నెన్స్. వీటివల్ల అవినీతి తగ్గుతుంది. జనధన యోజన కింద కేవలం 100 రోజుల్లో 18 కోట్ల కొత్త బ్యాంకు అకౌంట్లను ప్రారంభింపజేశాం. వాటిలో రూ. 32వేల కోట్ల డిపాజిట్లు వచ్చాయి.
 
 కాంగ్రెస్‌పై  పరోక్ష ఆరోపణలు
 విదేశీ గడ్డపై కాంగ్రెస్‌పై, గత యూపీఏ ప్రభుత్వంపై మోదీ మళ్లీ విమర్శలు గుప్పించారు. గతంలో భారత్‌లో రాజకీయ నేతలు, వారి కుటుంబాలపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అక్కడ రాజకీయ నేతలకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు రావడం సాధారణమే. ప్రభుత్వంలో ఉండగా ఒకరు రూ. 50 కోట్లు, మరొకరి కుమారుడు రూ. 100 కోట్లు, ఒకరి కూతురు రూ. 500 కోట్లు, ఇంకొకరి అల్లుడు రూ. 1,000 కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపణలు వచ్చాయి’ అంటూ ఎవరి పేరూ ప్రస్తావించకుండా.. సోనియాగాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి.. పరోక్ష విమర్శలు చేశారు.

అలాగే, తన ప్రభుత్వంపై, తనపై ఇంతవరకు ఎలాంటి అవినీతి ఆరోపణలూ రాలేదని గుర్తు చేశారు. ‘నాపై అలాంటి ఆరోపణలేమైనా వచ్చాయా?’ అంటూ మోదీ వేసిన ప్రశ్నకు సభికులు పెద్ద పెట్టున ‘లేదు’ అంటూ నినదించారు. తన జీవితంలోని ప్రతీ క్షణాన్ని దేశసేవకే వినియోగిస్తున్నానన్నారు. ‘నా 16 నెలల పాలనపై మీ నుంచి సర్టిఫికెట్ కోరుకుంటున్నా. నా హామీలను నెరవేర్చానా? లేదా? రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నానా? లేదా?’ అని సభికులను ప్రశ్నించారు. భారత్‌లోని వాస్తవ పరిస్థితులపై అక్కడివారి కన్నా అమెరికాలోని వారికే ఎక్కువ అవగాహన ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement