ఓటమికి బలిపశువు సిద్ధం
విశ్లేషణ
2009 వరకు యూపీఏ ప్రభుత్వం పనితీరు బావుందని అంతా అంగీకరిస్తారు. మన్మోహన్ సంక్షేమ వ్యయాలను నియంత్రించారు. డీఎంకేలాంటి ప్రాంతీయ పార్టీల ఆదేశాలకు విదేశాంగ విధానం లోబడకుండా ఉండేట్టు చూశారు. అ తర్వాతే కాంగ్రెస్‌కు కళ్లు నెత్తికెక్కాయి. ఆర్థిక వ్యవస్థ నెత్తురోడడం మొదలైంది.
పది మంది సభ్యులు అనుభవం లేకున్నా మన్మోహన్ మంత్రివర్గ నిర్ణయా లను తోసి రాజన్నారు. అసాధ్యమైన డిమాండ్లను ముందుంచి, చట్టాలను చేయించారు, నిధులను మంజూరు చేయించారు. చాలా మంది మంత్రులు ఎన్‌ఏసీ సభ్యులను చాటుమాటుగా దుమ్మెత్తిపోశారు. కానీ సోనియా ముందు నోరు విప్పే ధైర్యం చేయలేదు. ఎన్‌ఏసీ సూచనలపై ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇది ద్రవ్యోల్బణాన్ని సృష్టించింది.
సోనియా తప్పులకు మన్మోహన్ బాధ్యులు!
ఎన్‌ఏసీ ఒక వర్గానికి అనుకూలంగా ఉన్న మతకల్లోలాల వ్యతిరేక చట్టాన్ని తెచ్చింది. దానికి వివిధ సెక్షన్ల నుంచి విశాలమైన వ్యతిరేకత వచ్చింది. అలాంటి చట్టం అవసరమైతే ఆ పనిని న్యాయ నిపుణుల, సీనియర్ నేతల సలహాలతో చేయాల్సింది. అందుకు బదులుగా ఎన్‌ఏసీలోని ఔత్సాహిక ఎన్జీవోలు దాన్ని రూపొందించాయి. ఈఒక్క చర్యే మెజారిటీలో ఆందోళనను రేకెత్తించాయి. ఓటు బ్యాంకు రాజకీయాలుగా దాన్ని వారు పరిగణించారు. ఈ మతపరమైన కేంద్రీకరణకు మన్మోహన్‌ను ఏవిధంగానూ తప్పు పట్టడానికి వీల్లేదు.
మన ఆర్థిక సమస్యలన్నింటికీ బహిర్గత అంశాలే కారణమని కాంగ్రెస్ పార్టీ అదే పనిగా చెప్పింది. కానీ మన బడ్జెట్ వైకల్యపూరితంగా తయారైంది. 30 శాతం వార్షిక కోశ (ఆర్థిక) లోటుకు, ద్రవ్యోల్బణానికి దారి తీసింది. విపరీత ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అనే రెండు అంశాలపైనే ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సోనియా బలవంతం మీదనే మన్మోహన్ సంక్షేమ వ్యయాలకు భారీ నిధులను కుమ్మరించి భారీ బడ్జెట్ లోట్లను అనుమతిం చారు. ఆ సంక్షేమ పథకాలే నిరర్ధకంగానూ, విషతుల్యంగానూ పరిణమించి అధిక ధరలకు, నిరుద్యోగానికి కారణమయ్యాయి.
గత మూడేళ్లుగా అన్నాహజారే, కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక పోరాటా లను పెద్ద ఎత్తున నిర్వహించారు. వాటితో ఎలా వ్యవహరించాలో తెలియని సోనియా వారిని తిట్టిపోసి, వేధించమని మంత్రులను ఉసిగొల్పారు. వాళ్లింకా బలవంతులయ్యారు. చివరికి అవినీతిగ్రస్త ముద్రాంకితగా యూపీఏ ప్రభుత్వం నిలిచింది. విషాదమేమంటే చివరికి ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా అవినీతి ఒక సమస్యగా ముందుకు వచ్చింది. అందుకు కూడా మన్మోహన్‌ను ఎలా తప్పు పడతారు? 2008లో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడినప్పటి నుంచి ములాయంసింగ్‌తో మన్మోహన్‌కు మంచి సంబంధాలుండేవి. సోనియా.. ములాయం, అమర్‌సింగ్‌లను ఎప్పుడూ అవమానిస్తూ వచ్చారు. అత్యంత శక్తివంతురాలు, పెళుసు స్వభావి మమతా బెనర్జీతో సర్దుబాటు చేసుకుపోవడానికి మన్మోహన్ సిద్ధంగా ఉండేవారు. సోనియా చేజేతులారా ఇద్దరు రాజకీయమిత్రులను దూరంగా తరిమిపా రేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన రాష్ట్రంలో కాంగ్రెస్ పునాదులను తుడిచి పెట్టేసింది. దాదాపు రెండేళ్లపాటూ అది కేంద్ర ప్రభుత్వాన్ని చికాకుపెట్టింది. వివాదాస్పదమైన ఏపీ రాష్ట్ర విభజన నిర్ణయం పూర్తిగా సోనియాదే. విభజనతో తెలంగాణలో కాంగ్రెస్‌కు కనీసం 16 మంది ఎంపీలు లభిస్తారని ఆమె అంచనా వేశారు. రాష్ట్ర విభజన ఎత్తుగడ పారి వుంటే ఆ ఘనత ఆమెకు దక్కేదే. కానీ అది విఫలం కావడంతో ఆమె మౌనంగా ఉన్నారు. మంచి పాలనను అందించడానికి బదులుగా ఆమె అడ్డదారిని ఆశ్రయించారు. అందుకు తప్పు పట్టాల్సింది ఆమెను మాత్రమే.
అవాస్తవిక అంచనాలతోనే తిప్పలు
భారత ప్రజల సంగతి తనకు బాగా తెలుసని సోనియా నమ్మారు. నిత్యమూ నరేంద్రమోడీని తిట్టిపోస్తే చాలు ఆయన అంతు చూసేయొచ్చని ఆమె అనుకున్నారు. విరుద్ధ ఫలితం కలిగింది. ఆమె ఎంతగా తిట్టిపోస్తే మోడీ అంత బలవంతునిగా ముందుకొచ్చారు. దేశంలో చాలా మంది మోడీలా ఆలోచిస్తున్నారని, సోనియా మాటలు వినడానికి వారు సిద్ధంగా లేరని ఆమె గ్రహించలేదు. సోనియా ఆయనపై సీబీఐని ప్రయోగించాలని చూశారు. అది ఆమెకే బెడిసికొట్టింది. సోనియాయే స్వయంగా తనను ఓడించనున్న శత్రువును సృష్టించారు. భజనపరులు సోనియా అత్త ఇందిరాగాంధీ, భర్త రాజీవ్‌గాంధీలకు చెరుపు చేశారని ఆమెకు తెలుసు. కానీ కుమారుడ్ని ప్రధానిని చేయాలన్న కలలకు ఆమె బానిసయ్యారు. సోనియా, రాహుల్ తమ తప్పిదాలకు ఇతరులను తప్పు పడుతున్నారు. రేపటి ఓటమికి బలిపశువుగా మన్మోహన్‌ను సిద్ధం చేశారు.
పెంటపాటి పుల్లారావు
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు