జమ్మూ– కశ్మీర్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆ రాష్ట్రం ఎలా స్పందిస్తున్నదో తెలియడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ముందుజాగ్రత్త చర్యగా ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలవంటివన్నీ నిలిపేయడంతో ఈ సమస్య ఏర్పడింది. కానీ సుదీర్ఘకాలం ఈ దేశాన్నేలిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ నిర్ణయం వెలువడిన నాటినుంచి కకావికలవుతోంది. కింది స్థాయి నేతలు కశ్మీర్‌పై సరైన సమాచారం లేకపోవడంవల్లా, అవగాహన లోపించడంవల్లా మాట్లాడితే అర్థం చేసు కోవచ్చు. కానీ సీనియర్ నేతలే పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో పార్టీలో ఏర్పడిన సంక్షోభం ప్రభావమో, కశ్మీర్‌పై ఆ నేతలకు మొదటినుంచీ ఇలాంటి అయోమయావస్థ ఉందో ఎవరికీ తెలియదు. 370, 35ఏ అధికరణలను రద్దు చేస్తూ, జమ్మూ–కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నాక పార్లమెంటులో కాంగ్రెస్ ఆ చర్యను తప్పుబట్టింది.
కొంత ఆలస్యంగానైనా రాహుల్‌గాంధీ ఒక ట్వీట్ ద్వారా ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ప్రకటన విడుదల చేశారు. కనుక పార్టీ అధికారిక వైఖరేమిటో ఆ నేతలందరికీ అర్ధమై ఉండాలి. కానీ సీనియర్ నాయకుడు జనార్దన్ ద్వివేది ఇందుకు పూర్తి భిన్నమైన వైఖరి తీసుకున్నారు. ఈ అధికరణల రద్దు ద్వారా ఒక చారిత్రక తప్పిదాన్ని సరిచేశారని చెప్పారు. ఇది దేశ సమగ్రత కోసం తీసుకున్న నిర్ణయమని మరో సీనియర్ నాయకుడు దీపేందర్ హుడా అన్నారు. ఇంకా జ్యోతిరాదిత్య సింధియా, మిలింద్ దేవరా, జితిన్ ప్రసాద, అభిషేక్ మను సింఘ్వి వంటివారు కూడా ఆ మాదిరి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. రాజ్య సభలో పార్టీ చీఫ్ విప్‌గా ఉన్న భువనేశ్వర్ కలితా పార్టీ వైఖరితో విభేదిస్తూ ఎంపీ పదవికే రాజీనామా చేశారు. మరో సీనియర్ నేత కరణ్‌సింగ్ సైతం ఈ జాబితాలో చేరారు. ఇక కింది స్థాయి నేతల గురించి చెప్పేదేముంది? కానీ ఇలాంటివారిని సహచర సీనియర్ నేతలు అవకాశవాదులం టున్నారు. శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కాబోతోంది. అందులో రాహుల్ వారసుడి ఎంపికే ప్రధానాంశంగా ఉంటుందని సమాచారం. రెండునెలల జాప్యం తర్వాత ఆ పార్టీలో కదలిక రావడం దాని దుస్థితికి అద్దం పడుతుంది. కశ్మీర్ విషయంలో సీనియర్ నేతలు ఇష్టానుసారం చేస్తున్న ప్రకటనల గురించి కూడా వర్కింగ్ కమిటీ సమావేశం చర్చిస్తుందని అంటున్నారు.
నిజానికి 370 అధికరణ రాజ్యాంగంలో పొందుపరిచిన కొద్దికాలంలోనే దాన్ని నీరుగార్చిన చరిత్ర కాంగ్రెస్‌ది. నెహ్రూ కాలంలోనే అందుకు బీజం పడింది. తదనంతరకాలంలో దాన్ని మరిం తగా బలహీనపరిచింది కూడా కాంగ్రెస్ పాలకులే. చివరకు తమకు అనుకూలంగా లేని పార్టీలు అధికారంలోకొస్తే ఆ ప్రభుత్వాలను చిక్కుల్లో పడేసి, తమను లెక్కచేయడం లేదనుకుంటే బర్తరఫ్ చేసి కశ్మీర్‌తో ఆడుకున్నది కాంగ్రెస్ హయాంలోనే. 1975లో షేక్ అబ్దుల్లాతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఒప్పందం కుదుర్చుకుని ఆయన్ను జైలునుంచి విడుదల చేసింది. 1981లో తన కుమారుడు ఫరూక్ అబ్దుల్లాను వారసుడిగా ప్రకటించినప్పుడు ఆయన శిరస్సుపై తానుంచుతున్నది ముళ్ల కిరీ టమేనని షేక్ అబ్దుల్లా హెచ్చరించారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలతో ఆయనకున్న అను భవం అలాంటిది. 1983లో జమ్మూ–కశ్మీర్‌లో జరిగిన ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) ఘన విజయం సాధించింది. ఎంతో ప్రజాదరణతో అధికారం చేజిక్కిం చుకున్న ఫరూక్‌ను ఆ మరుసటి ఏడాదే కూలదోశారు. ఆ తర్వాత ఏమాత్రం జనాదరణలేని గులాం మహమ్మద్ షా నేతృత్వంలో ఫిరాయింపు ప్రభుత్వాన్ని నెలకొల్పారు.
1986లో మతకల్లోలాలు రేగాక ఆయన్ను బర్తరఫ్ చేశారు. ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎన్‌సీ– కాంగ్రెస్ లమధ్య పొత్తు కుదిరింది. ఆ ఎన్నికల్లో భారీయెత్తున రిగ్గింగ్ జరిగిందన్న అపఖ్యాతి మూటగట్టు కుని ఎట్టకేలకు ఆ కూటమి గట్టెక్కింది. సరిగ్గా ఆ తర్వాత నుంచే కశ్మీర్‌లోయలో మిలిటెన్సీ ముదిరింది. సాయుధ శిక్షణ పొందిన ఉగ్రవాదులు చొరబడి హత్యలు, అపహరణలతో అట్టుడికిం చారు. అప్పటి కేంద్రమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబియా సయీద్‌ను మిలిటెంట్లు కిడ్నాప్ చేయడం, తమవారిని విడిపించుకోవడం ఆ కాలంలోనే జరిగింది. ఆ రాష్ట్రం విషయంలో కేంద్రం తప్పులు మీద తప్పులు చేస్తూ పోయింది. అక్కడ పరిస్థితులు నానాటికీ క్షీణిస్తూనే ఉన్నాయి. అది సరిహద్దు రాష్ట్రమని, అక్కడ ఏం జరిగినా పొరుగునున్న పాకిస్తాన్ దాన్ని తన స్వప్రయోజనాలకు వినియోగించుకునే ప్రమాదం ఉన్నదని, దేశానికి అది చేటు తెస్తుందని కాంగ్రెస్ ఏనాడూ అనుకోలేదు.
ఇప్పుడు కేంద్రం తీసుకున్న చర్యల్ని సమర్థించేవారిలో చాలామంది రాహుల్ అనుయాయు లుగా ముద్రపడినవారే. 370 అధికరణ విషయంలో అనేక అభిప్రాయాలున్నాయి. కశ్మీర్ ఎదుర్కొంటున్న సకల సమస్యలకూ అదే మూలమని, ఆ అధికరణ రద్దయితే ఆ రాష్ట్రం అభివృద్ధి ఖాయ మని బీజేపీని సమర్ధించేవారు చెబుతున్నారు. దాంతో ఏకీభవిస్తూనే అందుకనుసరించిన విధానాన్ని వ్యతిరేకించేవారున్నారు. ఆ చర్య ప్రమాదకరమని, కశ్మీరీలను అది మరింత దూరం చేస్తుందని వాదించేవారున్నారు. కానీ ఆ అధికరణ ఉండాలని చెప్పే ముందు కాంగ్రెస్ తనవైపుగా గతంలో తప్పిదాలు జరిగాయని అంగీకరించి ఉంటే ఆ పార్టీతో ఏకీభవించినా, ఏకీభవించక పోయినా కనీసం దాని చిత్తశుద్ధిని జనం ప్రశంసించేవారు. అది లేకపోబట్టే జనం సంగతలా ఉంచి, పార్టీలోని సీనియర్ నేతలే కాంగ్రెస్ వైఖరితో విభేదిస్తున్నారు. వారిని అవకాశవాదులంటూ నిందించే బదులు ఇతర సీనియర్ నేతలు ఇన్ని దశాబ్దాలుగా కశ్మీర్‌లో తమ విధానాలెలా ఉన్నాయో ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాటలకూ, చేతలకూ... సిద్ధాంతాలకూ, ఆచరణకూ పొంతన లేకుండా ఎల్లకాలమూ గడిపేద్దామనుకుంటే చెల్లదని గ్రహించాలి.
Comments
Please login to add a commentAdd a comment