
పట్నా : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఎ తరపున ప్రధాని అభ్యర్థిగా తమ పార్టీ అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ సైతం రేసులో ఉంటారని జేడీ(యూ) స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ఎన్డీఏలో సవాల్ ఎదురవుతున్నట్టు ఆ పార్టీ సంకేతాలు పంపింది. రాజకీయాల్లో నితీష్ కెరీర్ స్ఫూర్తివంతంగా సాగిందని, బిహార్‌ను ఒంటిచేత్తో అభివృద్ధిపథంలో నిలిపి దేశానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని జేడీ(యూ) ప్రతినిధి రాజీవ్ రంజన్ ఆదివారం పేర్కొన్నారు.
ఎన్డీఏ నేతగా ప్రధాని మోదీ నిలిచినప్పటికీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధి చర్చకు వస్తే నితీష్ కుమార్ సైతం ప్రదాని రేసులో ఉంటారని రంజన్ వెల్లడించారు. కాగా, ప్రధాని అభ్యర్ధిపై చర్చ అవసరం లేదని జేడీ(యూ) ప్రకటనను తోసిపుచ్చుతూ బీజేపీ స్పష్టం చేసింది. ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోదీని స్వయంగా నితీష్ కుమార్ ప్రతిపాదించారని, బిహార్ ప్రజలే ప్రదాని అభ్యర్ధిగా మోదీని బలపరిచారని బీజేపీ ఎంపీ సీపీ ఠాకూర్ అన్నారు.
మరోవైపు నితీష్ కుమార్ బిహార్‌లో మహాకూటమి నుంచి బయటికొచ్చి తప్పుడు నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని అభ్యర్థిగా బిహార్ ప్రజలు రాహుల్ వైపు చూస్తున్నారని కాంగ్రెస్ నేత ప్రేమ్‌చంద్ర మిశ్రా పేర్కొన్నారు. జేడీ(యూ) ప్రకటనలు చూస్తుంటే ప్రధానిగా మరోసారి మోదీ గెలుపొందే అవకాశాలు లేవని వెల్లడవుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment