2024లో ప్రధాని పదవి చేపట్టేది ‘ఆమెనే’! | Sakshi
Sakshi News home page

2024లో ప్రధాని పదవి చేపట్టేది ‘ఆమెనే’!

Published Fri, Feb 12 2021 6:40 PM

Derek OBrien Hints at Support for Mamata as PM - Sakshi

న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలన్ని నరేంద్ర మోదీని ఢీకొట్టే బలమైన ప్రధాని అభ్యర్థి కోసం గాలించాయి. చాలా మంది నాయకులు తాము ఆ రేసులో ఉన్నట్లు ప్రకటించారు. అయితే మోదీతో తలపడటం అంటే ప్రకటనలు చేసినంత సులభం కాదు. ఆ విషయం విపక్షాలకు, జనాలకు బాగానే అర్థం అయ్యింది. ఈ క్రమంలో ప్రస్తుతం బెంగాల్‌లో ఎన్నికల దంగల్‌ నడుస్తోది. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

గతంలో బెంగాల్‌లో 18 సీట్లు సాధించిన బీజేపి ఈ సారి మరింత బలపడాలని భావిస్తోంది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మతకంగా తీసుకుంది బీజేపీ. ఇక టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఎక్కడా తగ్గటం లేదు. ఢీ అంటే ఢీ అంటూ బీజేపీతో తలపడుతున్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీ-టీఎంసీ మధ్య నడుస్తోన్న వార్‌ చూస్తే.. మోదీని సమర్థవంతంగా ఎదుర్కొగల నాయకురాలు దీదీనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇక​ తాజాగా టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓ బ్రెయిన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తూర్పు భారతదేశ మహిళ 2024లో ప్రధాని పీఠం అధిరోహించవచ్చన్నారు. ఇండియా టూడే కాన్‌క్లేవ్‌ ఈస్ట్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై స్పందిచారు. ఈ సందర్భంగా డెరెక్‌ మాట్లాడుతూ.. ‘‘దేశ ప్రజలు తమ కోసం పని చేసే ఓ పురుషుడు, మహిళ ప్రధానిగా రావాలని ఎదరుచూస్తున్నారు. తూర్పు భారతదేశానికి చెందిన మహిళ 2024లో ప్రధాని పదవి చేపడతారని అని నా నమ్మకం’’ అంటూ పరోక్షంగా దీదీనే 2024 ప్రధాని అభ్యర్థి అని వెల్లడించారు. 

మోదీ, మమతల మధ్య అదే తేడా
ఇక మోదీ, మమతల మధ్య అసలు ఎలాంటి పోలిక లేదన్నారు డెరెక్‌. ‘‘అసలు వారిద్దరిని ఎలా పోలుస్తాం. రాజకీయ వాతావరణంలో గౌరవనీయులైన ప్రధానిని ఇలా పోల్చడం కరెక్ట్‌ కాదు. అయితే వారిద్దరి మధ్య ఉన్న ప్రధాన తేడా ఏంటంటే ఒకరు హామీలను నేరవేర్చే వారు.. మరొకరేమో కేవలం ప్రచారానికే పరిమితం అవుతారు’’ అంటూ పరోక్షంగా దీదీపై ప్రశంసలు, మోదీపై విమర్శలు చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను కూడా విమర్శించారు. పార్లమెంట్‌లో టీఎంసీ లేవనెత్తిన పలు అంశాలపై బీజేపీ ఇంత వరకు సమాధానం చెప్పలేదని డెరెక్‌ ఓ బ్రెయిన్ మండిపడ్డారు. 

‘‘బీజేపీ.. బెంగాల్‌లో కూడా మత రాజకీయాలు చేయాలని చేయాలని ప్రయత్నిస్తోంది. అందుకే అభివృద్ధి గురించి ప్రచారం చేయకుండా.. కేవలం మతపరమైన అంశాలనే ప్రచారం చేస్తోంది. అరుణ్‌ జైట్లీ ఉంటే ఇలా జరగనిచ్చేవారు కారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది గుజరాత్‌ జింఖానా బ్యాచ్‌. మతం తప్ప వారికి మరో అంశం తెలీదు’’ అంటూ డెరెక్‌ ఓ బ్రెయిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చదవండి: ఎంపీ రాజీనామా.. బీజేపీలో చేరికకు సిద్ధం
              బెంగాల్‌ అసెంబ్లీలో ‘జై శ్రీరాం’..!

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement