సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని భావి ప్రధానిగా ప్రకటించి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విపక్షాల్లో చిచ్చు రాజేశారు. స్టాలిన్ ప్రకటనపై పలు విపక్ష పార్టీలు మండిపడుతుండగా, కాంగ్రెస్ నేతలు సైతం వివరణలతో ముందుకొస్తున్నారు. రాహుల్ ఎన్నడూ తాను ప్రధాని కావాలని కోరుకుంటున్నట్టు చెప్పలేదని మధ్యప్రదేశ్ సీఎం పగ్గాలు చేపట్టిన కమల్ నాథ్ పేర్కొన్నారు.
రాహుల్ సహా కాంగ్రెస్ నేతలెవరూ ప్రధాని పదవిపై తొందరపాటుతో లేరని చెప్పారు. ప్రధాని పదవిని కోరుకుంటున్నట్టు రాహుల్ ఎన్నడూ పెదవివిప్పలేదని..భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపుల అనంతరం తీసుకునే నిర్ణయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన నిర్ణయంపై ఇప్పుడే పేర్ల గురించి కసరత్తు చేయడం తొందరపాటు అవుతుందని అన్నారు.
రాహుల్ ప్రధాని అభ్యర్ధిగా డీఎంకే ప్రతిపాదించడంపై బీఎస్పీ, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్‌ల గైర్హాజరుకు స్టాలిన్ ప్రతిపాదనే కారణమనే వార్తలను కమల్ నాథ్ తోసిపుచ్చారు. వారు వ్యక్తిగత కారణాలతోనే ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment