తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకున్నది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు తెలంగాణాలో కూడా విజయం సాధిస్తే ‘ఇండియా’ కూటమిలో తన నాయకత్వానికి గౌరవం పెరుగుతుందనీ, ఆత్మవిశ్వాసంతో పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవచ్చనీ ఆ పార్టీ వ్యూహం. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలుపుపై ఎవరికీ పెద్దగా అనుమానాల్లేవు.
మధ్యప్రదేశ్‌లో కూడా సులభంగానే గెలుస్తామనే ధీమా ఆ పార్టీలో కనబడింది. నిన్నటి పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేయ వచ్చని పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్ పరిస్థితి ఇట్లా ఉంటే ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చేసే సంప్రదాయమున్న రాజ స్థాన్‌లో కాంగ్రెస్ గెలవడం మాత్రం అనుమానమే!
రాజస్థాన్‌ను కోల్పోతే ఆ లోటును తెలంగాణతో భర్తీ చేసుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతున్నది. కర్ణాటక ఎన్నికలు, బండి సంజయ్‌ను నాయకత్వం నుంచి తప్పించడం జరిగిన తర్వాత బీజేపీ బలహీనపడినట్టు కనిపించడం కూడా కాంగ్రెస్ ఆశలకు ఊపిరిపోసింది. ఇప్పటికే పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌పై సహజంగానే వ్యతిరేకత ఉంటుందనీ, అది తమకు కలిసివస్తుందనీ కూడా కాంగ్రెస్ అంచనా వేసుకున్నది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత మీదనే ఆధారపడకుండా ఒక భారీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నందువల్ల చేతి గుర్తు మీద వైకుంఠాన్ని చూపడానికి కూడా అది వెనకాడలేదు.
కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆరు గ్యారెంటీలను, ఐదు డిక్లరేషన్‌లను, రెండు లక్షల ఉద్యోగాలను, ఇంకా అనేక హామీలను ప్రకటించింది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలు, ఏపీలో చంద్రబాబు ఇచ్చిన భవిష్యత్తు గ్యారెంటీ... ఈ గ్యారెంటీ మాటలు మేనిఫెస్టోల్లో కొత్తగా చేరినట్టు కనిపి స్తున్నవి. కాంగ్రెస్ – తెలుగుదేశం మధ్యన ఈ ‘గ్యారెంటీ’ లింకేదో ఉన్నట్టుగా కూడా కనిపిస్తున్నది. కాంగ్రెస్ లెక్కల ప్రకారం గడిచిన రెండు సంవత్సరాల్లో రాష్ట్ర ఆదాయ – వ్యయాలు దాదాపు సమానంగా ఉన్నాయి.
రైతుబంధు, రైతు బంధు పెంపు కూలీలకు వర్తింపజేయడం, ఆసరా పెన్షన్ల రెట్టింపు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ బీమా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్... ఇంత వరకు లెక్కేసినా అదనంగా ఏటా 60 నుంచి 70 వేల కోట్లు అవసర మవుతాయి. రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తే అదే 38 వేల కోట్లు. ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున పది లక్షల ఇళ్లు కేటాయిస్తే 50 వేల కోట్లవుతుంది.
ఇలా ఒకసారి పెట్టే ఖర్చు ఈ రెండు పద్దులకే 88 వేల కోట్లు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్నకు కాంగ్రెస్ వాళ్లు కూడా చంద్రబాబు భాషలోనే సంపద సృష్టిస్తా మని చెబుతున్నారు. ఇంతకు ముందు ఐదేళ్లలో చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు మాయం చేసిన ప్రజాధనం 5 లక్షల కోట్లుగా లెక్క తేలింది. కానీ సృష్టించిన సంపద మాత్రం కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ విష యాన్ని గమనంలో ఉంచుకోవలసింది.
కర్ణాటకకు ఒక తటస్థ బృందాన్ని పంపించి ఐదు గ్యారెంటీల అమలుపై అధ్యయనం చేసి ఇక్కడ ఆ నివేదికను విడుదల చేసి ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి విశ్వస నీయత పెరిగేది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కర్ణాటక ఐదు గ్యారెంటీల్లో పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన పథకం ‘శక్తి’ మాత్రమే! ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం పేరే ‘శక్తి’. ‘అన్న భాగ్య’ ఇంకో పథకం.
రేషన్ కార్డులున్న కుటుంబాల్లోని వారికి నెలకు 10 కిలోల బియ్యం ఇస్తామన్నది ఎన్నికల గ్యారెంటీ హామీ. ఐతే ఐదు కేజీలను మాత్రం ఇవ్వగలుగుతున్నారు. మరో ఐదు కేజీలకు డీబీటీ ద్వారా నగదు బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ నగదు బదిలీలో జాప్యం జరుగు తున్నదనీ, కొందరికి అందడం లేదనీ ఆరోప ణలు వస్తున్నాయి.
ప్రతి మహిళకు నెలకు రెండు వేలు అందజేసే పథకం పేరు ‘గృహ లక్ష్మి’. రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభించారు. కోటీ ఆరు లక్షల మంది లబ్ధిదారుల్లో 85 నుంచి 90 శాతం మందికి వరసగా మూడు నెలలపాటు నగదు బదిలీ జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేసే ‘గృహజ్యోతి’ పథకం మాత్రం కర్ణాటకలో కల్లోలం సృష్టించింది.
ఈ పథకం ప్రారంభానికి ముందు రైతుల పంపుసెట్లకు ఏడు గంటల విద్యుత్‌ను ఇచ్చేవారు. ఇప్పు డది నాలుగు నుంచి ఐదు గంటలకు పడిపోయింది. బెంగళూరు నగరంతో సహా పగటిపూట కరెంట్ కట్‌లు పెరిగిపోయాయి. ‘గృహజ్యోతి’ రాష్ట్రంలో చీకట్లు నింపిందనే విమ ర్శలు వినిపిస్తున్నాయి. ‘యువ నిధి’ పేరుతో నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు ఇస్తామని మేనిఫెస్టోలో గ్యారంటీ ఇచ్చారు. ఇంకా అది ప్రారంభానికి నోచుకోలేదు.
విద్యుత్ సరఫరా అంశంపై అధికార బీఆర్‌ఎస్ పార్టీ సవాళ్లను కాంగ్రెస్ పార్టీ సమర్థంగా ఎదుర్కో లేకపోతున్నది. అధికార పార్టీ విసిరిన ‘పవర్’ ట్రాప్‌లో కాంగ్రెస్ పార్టీ అనవసరంగా చిక్కుకొని నష్టపోయిందనే అభిప్రాయం బలపడుతున్నది. రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బలహీనపడిన పార్టీ పెద్దగా పుంజుకున్నట్టు ఇప్పటికీ కనిపించడం లేదు. బీజేపీ ప్రభ తగ్గిన తర్వాత దాని విస్తృతి కొంచెం పెరిగినట్టు కనిపిస్తున్నా... 90 నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీ ప్రధాన పోటీదారుగా ఉన్నది.
సాధారణ మెజారిటీకి అవసరమైన యాభై శాతం స్ట్రయిక్ రేటును సాధించినప్పటికీ ఆ పార్టీ అవసరమైన సీట్లకు చాలా దూరంలోనే ఉండిపోతుంది. తాను గట్టిగా పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో మూడింట రెండు వంతుల స్ట్రయిక్ రేటు సాధించగలగాలి. ఆ స్థాయి స్ట్రయిక్ రేటును ‘వేవ్’గా పరిగణిస్తారు. అటువంటి ప్రభంజనం ఏదీ ఉన్నట్టుగా ఇప్పటి వరకూ ఏ ప్రతిష్ఠాత్మక సర్వే సంస్థ కూడా గుర్తించలేకపోయింది.
అధికార పార్టీకి ఉన్న మరో సౌలభ్యం దానికి మజ్లిస్ మిత్రపక్షంగా ఉండటం! ఊరు మీద ఊరు పడ్డా మజ్లిస్ పార్టీ ఏడు సీట్లకు మాత్రం ఎటువంటి ఢోకా ఉండదు. బీఆర్‌ఎస్‌కు ఓ ఏడు సీట్లు తగ్గినా కూడా మజ్లిస్ తోడ్పాటుతో భర్తీ చేసుకోగలదు. యాభై శాతం స్ట్రయిక్ రేటుతో కూడా ఆ మాత్రం సీట్లను బీఆర్‌ఎస్ గెలుచుకోగలుగుతుంది.
ఇంకో ఆశ్చర్యకరమైన సారూప్యతను కూడా మనం గమనించవచ్చు. రాష్ట్రంలో నలభయ్యేళ్ల లోపు ఓటర్లు ఎంతమంది ఉన్నారో దాదాపుగా అంతే సంఖ్యలో 40 ఏళ్లు దాటిన ఓటర్లు కూడా ఉన్నారు. వివిధ సర్వేల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాల ప్రకారం 40 ఏళ్ల లోపు సమూహంలో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తున్నది. మార్పు కావాలన్న అభిప్రాయం ఈ సమూహంలో వినబడుతున్నది. నలభ య్యేళ్లు దాటిన వారిలో ప్రభుత్వ అనుకూలత బలంగా కనిపిస్తున్నది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌తో పాటు ఈసారి బీజేపీ కూడా పంచుకోవలసి ఉంటుంది. బీజేపీ ఓటర్లలో యువతరం ఓటర్లే గణనీయంగా ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్‌కు ప్రతికూలమైన అంశం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 శాతం ఓట్లనే పొందిన కాషాయ పార్టీ ఇప్పుడు డబుల్ డిజిట్ ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకోబోతున్నదని శాస్త్రీయమైన సర్వేల్లో వెల్లడవుతున్నది.
వ్యూహాత్మకంగా 25 స్థానాలపై కేంద్రీకరించి పరివార్ శక్తులు చాపకింద నీరులాగా పనిచేసుకుంటు న్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పది సీట్లకు తగ్గకుండా గెలవాలనీ, మిగిలిన పదిహేను చోట్ల రెండో స్థానంలోనైనా నిలవాలనీ బీజేపీ గట్టి పట్టుదలతో పనిచేస్తున్నది. ఈ ప్రయత్నాలు ఫలించినంత మేరకు కాంగ్రెస్ బలంలో కోత పడుతుంది. బీసీ వర్గాలకు ఇచ్చిన 34 సీట్ల హామీని కాంగ్రెస్ నిల బెట్టుకోలేక పోవడం కూడా ఒక మైనస్ పాయింట్. బీసీల్లో ఈ పరిణామం ఎటువంటి మార్పును తీసుకొస్తుందో చూడాలి.
కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశాభావంతో ఉన్న వాళ్లు కూడా అది గెలిచే నియో జకవర్గాల పేర్లను 45కు మించి చెప్పలేక పోతున్నారు. విద్యావంతులైన నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమేర ప్రభుత్వ వ్యతిరేకత కన్పిస్తున్నది. సోషల్ మీడియాలో వీరు క్రియాశీలకంగా ఉన్నందు వల్ల కాంగ్రెస్ టాక్ కొంత గట్టిగా వినిపి స్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా పరిస్థితులను బేరీజు వేసుకు న్నప్పుడు అధికార పార్టీ విజయానికి ఢోకా ఉన్నట్టు కనిపించడం లేదు. కాకపోతే బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఆవిర్భవించ వచ్చు. ఈరోజు వరకున్న పరిస్థితి – అడ్వాంటేజ్ బీఆర్‌ఎస్!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
ఆశల పల్లకిలో కాంగ్రెస్, అడ్వాంటేజ్ బీఆర్‌ఎస్!
Published Sun, Nov 19 2023 12:43 AM | Last Updated on Sun, Nov 19 2023 9:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment