‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది.’ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తెలంగాణలో ఎవరి చావు కొచ్చినట్టు? ఎవరి మేలు కొచ్చినట్టు? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన తాజా చర్చ. అసలు ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం పక్క రాష్ట్రం మీద ఉంటుందా? ఉంటే ఏ మేరకు ఉంటుంది? ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పరిస్థితులు ఆ రాష్ట్రానికే పరిమితం కదా! అటువంటప్పుడు కర్ణాటక ఫలితాలు తెలంగాణ మీద ఎలా ప్రభావం చూపిస్తాయన్న మీమాంస కూడా ఉన్నది.
ఇప్పుడు తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ ప్రధాన రాజకీయ పక్షం. దానితో తలపడబోయే నెంబర్ టూ పార్టీ ఏదీ అన్న ప్రశ్నకు గత కొంతకాలంగా అస్పష్టమైన సమాధానాలు లభిస్తున్నాయి. అటువంటి అస్పష్టతకూ, సందిగ్ధతకూ కర్ణాటక ఫలితాలు తెరదించనున్నాయా?
రాష్ట్ర విభజన తర్వాత, తెలంగాణా ఇచ్చిన పార్టీగా పేరున్నప్పటికీ కాంగ్రెస్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఇందుకు కారణం ప్రజల్లో ఆదరణ లేకపోవడం కాదు. నాయకత్వ వైఫల్యం ప్రధాన కారణం. మొదటి ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ సారథిగా సహజంగానే కేసీఆర్‌కు కొంత సానుకూలత ఉన్నది. కానీ దాన్ని అధిగమించగలిగే సంస్థాగత బలం, కేంద్ర–రాష్ట్రాల్లో అధికారం, తెలంగాణ ఇచ్చిన పార్టీ అనే ఖ్యాతి కాంగ్రెస్‌కు ఉన్నాయి.
కానీ కేసీఆర్ జనాకర్షణతో పోల్చినప్పుడు అందుకు దీటైన నాయకుడు కాంగ్రెస్‌లో లేకపోవడం ఎన్నికల ఫలితాలను శాసించింది. రెండోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వబోతున్నదని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా చారిత్రక తప్పిదానికి ఒడిగట్టి తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకొని భారీమూల్యం చెల్లించింది. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో మూడొంతులమంది అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ ఫిరాయింపుల పర్వం కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో పలుచన చేసింది. సరిగ్గా ఈ సమయంలోనే తెలంగాణలో బీజేపీ వేట మొదలైంది. కాంగ్రెస్ బలహీనపడుతున్న క్షణాలను తనకు అను కూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు సీట్లు గెలిస్తే, బీజేపీ నాలుగు చోట్ల గెలవడం ఆ పార్టీకి అనుకోకుండా ఊపు తెచ్చింది. బీఆర్‌ఎస్ నాయకత్వం చేసిన పొరపాట్ల వల్ల హుజూరాబాద్, దుబ్బాక నియోజక వర్గాల్లో గెలిచి, బీజేపీ ఒక సంచలనానికి కారణమైంది. మునుగోడులో విజయతీరాల దాకా చేరుకున్నా బీఆర్‌ఎస్ అప్రమత్తత వల్ల కొద్ది తేడాలో ఓడిపోయింది.
తెలంగాణలో తాను బలపడ్డాననే అభిప్రాయం కలిగించడం కోసం బీజేపీ ఉప ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసింది. అదే సమయంలో ఫిరాయింపుల ద్వారా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి ఆ స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నది. ఈ కార్యక్రమంలో తాను ఆశించినంత కాకపోయినా ఎంతో కొంత మేరకు బీజేపీ విజయం సాధించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ‘బీఆర్‌ఎస్ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? కాంగ్రెసా... కాషాయ పార్టీనా’ అనే సందిగ్ధత జనంలో ఏర్పడింది.
కర్ణాటక ఫలితాలు సహజంగానే కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్నీ, బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహాన్నీ నింపుతాయి. ఈ ప్రభావం ఎలా ఉండ బోతున్నది? బీఆర్‌ఎస్‌కు లాభమా–నష్టమా? కాంగ్రెస్ పార్టీ పుంజుకొని అధికార పార్టీని సవాల్ చేయగలగుతుందా? కర్ణా టక గాయాన్ని మరచిపోవడానికి బీజేపీ తెలంగాణలో విజృంభి స్తుందా? ఈ విషయాల మీద స్పష్టత రావాలంటే క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల బలాబలాలను పరిశీలించాలి.
ఓట్ల చీలిక కారణంగా మూడోవంతు ఓట్లతోనే బీఆర్‌ఎస్ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ‘చారిత్రక’ తప్పిదం వల్ల రెండోసారి ఆ పార్టీ ఓట్ల శాతం 47కు పెరిగింది. నాలుగు మాసాల తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో 41 శాతానికి దాని మద్దతు పడిపోయింది. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీకి ఎంతోకొంత వ్యతిరేకత సహజం. బీఆర్‌ఎస్ విషయంలో ఈ వ్యతిరేకత కొంత ఎక్కువగానే కనిపిస్తున్నది. ముఖ్యంగా నలభయ్యేళ్లలోపు యువతలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా బీఆర్‌ఎస్‌కే ఓటువేసే వారి సంఖ్య కూడా తక్కువ లేదు.
ఇటువంటి ఓటర్లు సుమారు 35 శాతం ఉంటారని అంచనా ఉన్నది. ఇంకో ఐదారు శాతం మందికి బీఆర్‌ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకతగానీ, వల్లమాలిన అభిమానం గానీ ఉండకపోవచ్చు. పరిస్థితులను బట్టి వారు ఆ పార్టీకి అనుకూలంగానో, ప్రతికూలంగానో స్పందించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌కు ఓటు వేయని వారు 60 శాతం వరకు ఉండొచ్చని కొన్ని క్షేత్రస్థాయి పరిశీలనలు సూచిస్తున్నాయి. ఇందులో నాలుగైదు శాతం ఓట్లు చిన్న పార్టీలకు పడొచ్చు. నికరంగా 55 శాతం బీఆర్‌ఎస్ వ్యతిరేక ఓటు. కాంగ్రెస్ బీజేపీలు ఈ ఓట్లను పంచుకోవాలి.
ఇందులో కాంగ్రెస్ నికర ఓటు ఎంత? బీజేపీ నికర ఓటు ఎంత? అనే పరిశీలన అవసరం. గడచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దాదాపుగా 30 శాతం ఓట్లు పడ్డాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 25 శాతం పైచిలుకు ఓట్లు పడ్డాయి. కనుక కాంగ్రెస్ నికర ఓటును 25 శాతంగా పరిగణించవచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు మాత్రమే సంపాదించిన బీజేపీ 4 నెలల్లోనే లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 20 శాతం ఓట్లు సంపాదించింది.
లోక్‌సభ ఎన్నికల్లో 20 శాతం ఓట్లు సంపాదించడం బీజేపీకి మొదటిసారి కాదు. 1998 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి, దాదాపు ఇదే శాతం ఓట్లను ఆ పార్టీ పొంద గలిగింది. తర్వాత కాలంలో టీడీపీతో పొత్తు వల్ల బీజేపీ చిక్కి శల్యమైంది. ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ డబుల్ డిజిట్‌ను తాకలేక పోయింది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతాన్నీ, ఈ మధ్యకాలంలో పెరిగిన విస్తరణనూ పరిగణనలోకి తీసుకుంటే 15 శాతం వరకు బీజేపీ నికర ఓటు ఉంటుందని భావించవచ్చు.
సీట్లవారీగా క్షేత్ర స్థాయి పరిశీలన సైతం ఇదే స్థాయి నికర ఓటును నిర్ధారిస్తున్నాయి. దాదాపు వంద సీట్లలో బీఆర్‌ఎస్ ప్రధాన పోటీదారుగా ఉంటుంది. అంటే గెలవడమో, లేదా రెండో స్థానంలో నిలవడమో అన్నమాట. కాంగ్రెస్‌కు అటువంటి నియోజక వర్గాలు అరవైకి పైనే కనిపిస్తున్నాయి. బీజేపీకి సుమారు ముప్ఫయ్ నియోజక వర్గాలున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండి, అర్ధబలం... అంగబలం దండిగా ఉన్న బీజేపీ తెలంగాణలో వేట మొదలుపెట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంకా రెండో స్థానానికి చేరుకోలేకపోవడానికి కారణాలేమిటి? అనుకున్న స్థాయిలో చేరికలు ఎందుకు ఉండడం లేదు? అనైక్యతతో, క్రమశిక్షణా రాహిత్యంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడంలో బీజేపీ నేతలు ఎందుకు విజయం సాధించలేకపోతున్నారు?
బీజేపీ వ్యూహమే దాని ఎదుగుదలకు గుదిబండగా మారుతున్నదన్న అభిప్రాయం కూడా ఉన్నది. తెలంగాణలో ఎకాయెకిని హార్డ్‌కోర్ హిందూత్వ ఎజెండాను తలకెత్తుకున్నట్టు కనిపిస్తున్నది. జాతీయ స్థాయిలో హార్డ్‌కోర్ హిందూత్వ ఎజెండాతో అడ్వాణీ రథయాత్రలు చేయడం వల్ల పార్టీ విస్తరణ జరిగిందే కానీ, అధికారం సిద్ధించలేదు. అటల్ బిహారీ వాజ్‌పేయి లాంటి సాఫ్ట్ హిందూత్వ ముఖాన్ని ముందుపెట్టిన తర్వాతే తొలిసారి బీజేపీకి కేంద్ర పీఠం దక్కింది. ఆ పునాదుల మీదనే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నిలబడింది. హార్డ్‌కోర్ హిందూత్వ ఎజెండానే బీజేపీ బలంగా ముందుకు తోస్తే... ఇరవై శాతం ఓట్ల మార్కును దాటడం కష్టమే! ఆ వైతరణీ నదిని దాటాలంటే కచ్చితంగా సెక్యులర్, లేదా సాఫ్ట్ హిందూత్వ ఎజెండాయే శరణ్యం.
ఇక కాంగ్రెస్ పార్టీ గణాంకాలు చూస్తే బాగానే ఉన్నా, ఎక్స్‌రే మాత్రం బలహీనతలను ఎత్తిచూపుతున్నది. నాయక శ్రేణుల్లో ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. ఆ పార్టీలో ఐక్యత ఓ మరీచిక. అగ్రనాయకత్వంపై అందరికీ విశ్వాసం లేదు. ఒకరినొకరు ఓడించుకునే అవకాశాలను తోసిపుచ్చలేము. ఎన్నికలకు ముందే ఆ పార్టీ అభ్యర్థులందరూ పార్టీ ఫిరాయించబోమని బహిరంగంగా ప్రమాణాలు చేస్తే తప్ప ప్రజలు నమ్మలేని పరిస్థితులు కూడా ఉన్నాయి.
కర్ణాటక ఎన్నికల ఫలితాల ఉత్సాహంతో ఈ బలహీనతలన్నింటినీ అధిగమించగలిగితే గట్టి పోటీదారుగా నిలబడగలిగే అవకాశం ఇప్పటికీ కాంగ్రెస్‌కు ఉన్నది. అదే సందర్భంలో కర్ణాటకను కోల్పోయిన బీజేపీ దక్షిణాదిన మరో స్థావరం కోసం గాయపడ్డ పులిలా విరుచుకుపడడం ఖాయం. ఇతర పార్టీల్లో ప్రజాదరణ గల నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకొని ఒక ప్రభంజనం సృష్టించే ప్రయత్నం తప్పక చేస్తుంది. ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తే... జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామమే!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
తెలం‘గానా’నికి కర్ణాటక సంగీతం!
Published Sun, May 14 2023 3:19 AM | Last Updated on Sun, May 14 2023 3:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment