సాక్షి, సిటీబ్యూరో: కోకాపేట భూముల చిక్కుముడి వీడింది. 19 ఏళ్ల క్రితం హెచ్‌ఎండీఏ వేలం వేసిన 187 ఎకరాల భూముల విషయంలో బిడ్డర్స్‌కు డబ్బులు వెనక్కి ఇచ్చే అవసరం లేదని సుప్రీంకోర్టు హెచ్‌ఎండీఏకు అనుకూలంగా తీర్పును రిజర్వు చేయడంతో ఊపిరి పీల్చుకుంది. ఇప్పటివరకు చెల్లించిన డబ్బులకు సమానంగా భూమి ఇవ్వాలని, లేదంటే గతంలో వేలంపాటలో కోట్ చేసిన ధరకు అనుగుణంగా మిగిలిన డబ్బులు చెల్లిస్తే మొత్తం భూమి కేటాయించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఉండడంతో సాధ్యమైనంత తొందరగా ఈ విషయాన్ని సెటిల్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. 2007లో 187 ఎకరాల కోకాపేట భూములను వేలం ద్వారా దక్కించుకున్న 15 సంస్థలు రూ.687 కోట్లు చెల్లించాయి.
ఆ తర్వాత ఈ భూముల యజమాన్యహక్కులు వివాదాన్ని దాచారంటూ బిడ్డర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాము చెల్లించిన డబ్బులు వెనక్కి ఇచ్చేలా హెచ్‌ఎండీఏను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టు గడప తొక్కడంతో యజమాన్య హక్కులు తేలే వరకు వాయిదాలుగా వస్తున్న ఈ పిటిషన్‌ను కొట్టివేసి తీర్పును రిజర్వ్ చేశారు. గతేడాది సుప్రీంకోర్టులోనే కోకాపేట యజమాన్య హక్కులు కేఎస్‌బీ అలీకి చెందవని, హెచ్‌ఎండీఏవేనంటూ తీర్పును ఆధారంగా చేసుకొని తాజాగా కోకాపేట భూముల విషయంలోనూ హెచ్‌ఎండీఏకే అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.
ఏళ్లుగా పోరాటం....
2007లో కోకాపేటలోని భూములకు వేలం నిర్వహించిన హెచ్‌ఎండీఏ వివిధ సంస్థలకు వాటిని విక్రయించింది. ప్రధానంగా గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో 100 ఎకరాలు, ఎంపైర్–1, 2 పేరుతో 87 ఎకరాలు మొత్తం 187 ఎకరాల భూమిని వేలం ద్వారా విక్రయించింది. అప్పట్లో విపరీతమైన రియల్‌బూమ్ కారణంగా ఎకరం ధర రూ.ఐదు కోట్ల నుంచి 14 కోట్ల వరకు పలికింది. ఈ భూముల విక్రయం ద్వారా రూ.1,755 కోట్ల ఆదాయం వస్తున్నట్టు అప్పట్లో లెక్క తేలింది. వేలం పాటలో ఈ భూములు దక్కించుకున్న 15 సంస్థలు రెండు వాయిదాల్లో రూ.687 కోట్లు చెల్లించేశాయి. అప్పట్లో ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు హెచ్‌ఎండీఏ జమ చేసింది. ఆ తర్వాత రియల్ బూమ్ పడిపోవడంతో భూములకు డిమాండ్ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కోకాపేట భూములు కొనుగోలు చేసిన సంస్థల్లో 14 సంస్థలు తాము వేలంపాటలో దక్కించుకున్న భూములకు సంబంధించి యాజమాన్య హక్కుల వివాదం ఉందని, దీన్ని తమకు చెప్పకుండా హెచ్‌ఎండీఏ దాచిపెట్టిందనే సాకుతో తమ సొమ్మును తిరిగి చెల్లించాలని హైకోర్టులో కేసు వేశాయి. వాదోపవాదాల అనంతరం కోకాపేట భూముల వివాదంలో ఉన్న విషయం తెలియజేయకుండా వేలం వేయడాన్ని తప్పుపడుతూ ఆయా సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాలని సింగిల్ జడ్జి 2010లో ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో తాము చెల్లించిన డబ్బులు వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోకాపేట భూములు దక్కించుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం భూమి అమ్మే హక్కు హెచ్‌ఎండీఏకు ఉందని, మిగిలిన 60 శాతం డబ్బును హెచ్‌ఎండీఏకు చెల్లించాలంటూ ఆదేశించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇప్పటికే కోకాపేట టైటిల్ వివాదం కొనసాగుతుండడంతో అది తేలాక డబ్బులు ఇచ్చే విషయం ఆలోచిస్తామని హెచ్‌ఎండీఏ వివరణ ఇచ్చింది. అయితే టైటిల్ వివాదంపై తీర్పు రావడంతో కోకాపేట భూముల విషయంలోనూ హెచ్‌ఎండీఏకే అనుకూల తీర్పును రిజర్వ్ చేసినట్టుతెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment