సాక్షి, హైదరాబాద్: మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలవబోతున్నారని ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మల్లారెడ్డి తన రాజకీయం అనుభవంతోనే ఈటలపై ఆ కామెంట్స్ చేశారని పేర్కొన్నారు. మల్లారెడ్డి చాలా తెలివిగల వ్యక్తి అని, ఈటల రాజేందర్‌ను మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలనేది ఆయన వ్యూహమని తెలిపారు.
బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈటలపై చేసిన వ్యాఖ్యల విషయంలో మల్లారెడ్డి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారని తెలిపారు. మల్లారెడ్డి మాటల అంతరార్థం తెలియక కొంతమంది ఆగమాగమవుతున్నారని, ఆయన వ్యాక్యాలు సీరియస్‌గా తీసుకోవద్దని తెలిపారు. మల్కాజ్‌గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. అది ఈటల రాజేందర్‌కు కూడా తెలుసన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధిక స్థానాలు గెలుచుకోబోతుందని చెప్పారు కేటీఆర్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి,నేషనల్ మీడియాలో ప్రధాని మోదీకి ఓటేయ్యండి అంటూ చెబుతున్నారని విమర్శించారు. త్వరలో రేవంత్ ఖచ్చితంగా బీజేపీలోకి వెళతారని పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికీ వరకు ప్రతి ఇంట్లో కేసీఆర్‌ను తలుచుకోని రోజు లేదని అన్నారు. అధికార కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వస్తోందని దుయ్యబట్టారు.
చదవండి: కోమటిరెడ్డి.. మాటలు జాగ్రత్త: కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు
‘రేవంత్ రెడ్డి సీక్వెన్స్ మోసాల సినిమాలు చూపిస్తున్నాడు. దేవుడి మీద ఒట్లు పెడుతూ, ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేస్తున్నాడు. కొండంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం అన్నాడు కదా. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలు అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు.
2014లో బడే బాయ్ బడా మోసం చేశారు. అనేక హామీలు ఇచ్చిన మోదీ ఏవీ చేయలేదు. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ. ప్రపంచ వ్యాప్తంగా క్రుడ్ ఆయిల్ ధరలు తగ్గితే కనీసం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. టోల్ లేని జాతీయ రహదారులు ఉన్నాయా? దేశంలో టోల్ పెట్టీ తోలు తీస్తుంది మోదీ ప్రభుత్వం. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీతో జతకట్టి కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టింది . మమ్మల్ని 10 నుంచి 12 సీట్లతో గెలిపించండి. కాంగ్రెస్ మెడలు వంచుతాం.
కడియం శ్రీహరి చేసిన ద్రోహం వరంగల్ లో ఏ నాయకుడు చేయలేదు. వరంగల్ ప్రజలను దారుణంగా మోసం చేశారు కడియం. ప్రపంచం వరంగల్ వైపు చూసేలా చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి ముందుగా వరంగల్ కళతోరణం రాష్ట్ర అధికారిక ముద్రలో తీసినందుకు క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment