సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్. మొత్తం 119 స్థానాలకు గానూ ఒకే విడతలో 115 మందితో కూడిన తొలి విడత అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. వీరిలో తొమ్మిదిమంది సిట్టింగ్‌లకు హ్యండ్ ఇచ్చారు. మరో నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒకే విడతలో భారీ సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. తాజాగా మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో తెలంగాణ కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
బుధవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరణ జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత చాలా కాలంగా ఆయన స్థానం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో ఈటల స్థానంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా కామారెడ్డి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో టికెట్ కోల్పోయిన స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్దన్ ను కేబినెట్‌లోకి తీసుకునే ఛాన్స్ ఉంది.
చదవండి: 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తాం.. అక్టోబర్ 16న బీఆర్‌ఎస్ మేనిఫెస్టో
మంత్రి వర్గంలో 18 మందికి ఛాన్స్ ఉంది. ఎన్నికల వేళ అసంతృప్తితో రగలిపోతున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకోనున్నారు. తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి రోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేసీఆర్ ప్రకటించారు. అదే స్థానాన్ని కోరుకున్న మహేందర్ రెడ్డిని ఏదోవిధంగా సర్ధుబాటు చేయాలని భావించారు. బుధవారం కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
గతంలో 2014 తెలంగాణ ప్రభుత్వ మొదటి క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా మహేందర్ రెడ్డి పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికై బీఆర్ఎస్ లో చేరిన సబితారెడ్డి.. కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్ప్ దక్కించుకోవడంతో… మహేందర్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకదశలో పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల ముందు సడెన్ గా పట్నంకు కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు.
ఇక గంపా గోవర్ధన్ పేరు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీంతో ఇద్దరిని తీసుకోవాలంటే ఎవరో ఒకరికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. ప్రస్తుతం కెసిఆర్ మంత్రి వర్గంలో ముగ్గురు (సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి) రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే .. సమీకరణాలు మారుతాయి కాబట్టి ఓ రెడ్డి మంత్రిని తప్పించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు మూడు నెలలే ఉంది కాబట్టి ఒకరిని బుజ్జగించి మంత్రి పదవి నుంచి తప్పుకోమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాబట్టి అదే జిల్లాకు చెందిన సబితాకు నచ్చజెపుతారా అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఎవరికి ఉధ్వాసన పలుకనున్నారు? లేదా కేవలం మహేందర్ రెడ్డి వరకే పరిమితం చేసి విస్తరణ చేస్తారా అనేది తెలియాల్సి ఉండాలి. కేబినెట్ విస్తరణపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పాండిచ్చేరి నుంచి ఈ రాత్రికి గవర్నర్ హైదరాబాద్ రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment