వేదికపై నుంచి ప్రసంగిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్‌కు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని, తెలంగాణలో డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచే కమలం వికసించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ మైదానంలో నిర్వహించిన బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మధ్యాహ్నం 12.45 గంటలకు హెలిక్యాప్టర్‌లో సభా స్థలానికి చేరుకున్న అమిత్‌షా ‘మేరేసాత్ బోలియే.. భారత్ మాతాకీ జై’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
దాదాపు 20 నిమిషాల పాటు ఏకధాటిగా ఉత్సాహభరితంగా మాట్లాడారు. అమిత్‌షా హిందీ భాషలో ప్రసంగించగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలుగులో అనువాదం చేశారు. ఈ బహిరంగ సభలో ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు పాయల్ శంకర్, మడావి రాజు, సట్ల అశోక్, అజ్మీరా ఆత్మారాం, ఏమాజీ పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపెల్లి వేణుగోపాల్, జిల్లా నాయకులు సుహాసినిరెడ్డి, వి.ఆదినాథ్, కుమురంభీం జిల్లా అధ్యక్షుడు ఫౌడెల్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ హామీలేమయ్యాయి..
గత ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అమిత్‌షా ప్రశ్నించారు. పెన్‌గంగా ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పి విస్మరించారన్నారు. విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయలేకపోయారని, డబుల్ బెడ్‌రూమ్ ఏ ఒక్క పేదవాడికీ అందించలేదని విమర్శించారు. డబుల్‌బెడ్ రూంలకు రూ.80 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్న కేసీఆర్ రూ.8 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పేరును పథకాల్లో పొందుపర్చకపోవడం శోచనీయమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పుకోవడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలపై తెలంగాణలో ప్రచారం చేపడితే బీజేపీకి ప్రజల్లో నమ్మకం పెరుగుతుందనే ఉద్దేశంతో వాటిపై ప్రస్తావన చేయడం లేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి తానే సీఎం గద్దెనెక్కాడని దుయ్యట్టారు. గతంలో అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామని చెబుతూ తెలంగాణలో రాహుల్ బాబా పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
విమోచన దినోత్సవం నిర్వహిస్తాం
సెప్టెంబర్ 17న నిర్వహించాల్సిన విమోచన దినోత్సవాన్ని ఎంఐఎం పార్టీకి భయపడి కేసీఆర్ అధికారికంగా జరుపడంలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే గల్లీగల్లీలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీ ముద్దుబిడ్డ కుమురం భీం పోరాటాలు చేయకపోతే ఆదిలాబాద్‌కు రావాలంటే తాను పాస్‌ఫొటో తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment