ప్రజాస్వామ్యాన్నిఖూనీ చేస్తున్నారు
దేవరుప్పుల : పార్టీ ఫిరాయింపులతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల బస్సుయాత్ర మంగళవారం దేవరుప్పులకు చేరుకుంది. తొలుత జగగామ జిల్లా సాధన కోసం చేపట్టే రిలే నిరాహార దీక్షలకు సంఘీబావం తెలిపిన అనంతరం కామారెడ్డిగూడెం బస్‌స్టేజీ వద్ద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు షెక్ బందగీ స్మారక స్థూపం, సమాధి వద్ద నివాళులు అర్పించి ఎర్ర జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం.. మలిదశ ఉద్యమం.. అమరుల త్యాగాల చరిత్ర నేటి తరానికి తెలియజేసేందుకే బస్సు యాత్ర చేపట్టినట్లు వివరించారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా అనేక పోరాటాలు, త్యాగాలు చేసిన చరిత్ర తమ పార్టీకి ఉందన్నారు. భూస్వామ్య విధానం పోయినప్పటీకీ ఇంకా వెట్టిచాకిరిæ అవశేషాలు ఉన్నాయన్నారు. తెలంగాణ వచ్చాక పరిపాలనలో సమూలమైన మార్పులు జరుగుతాయనుకుంటే కెసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, ప్రజాసేవకులకు కాకుండా పారిశ్రామికవేత్తలకు, రియల్టర్లకు, గుండాలకు పదవులు వరించాయని విమర్శించారు, రాష్ట్ర ప్రభుత్వ పునర్నిర్మాణం పేరిట వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలో తీసుకపోవడమేగాక విద్య, ఉపాధి కల్పన వంటి మౌలిక వసతులపై ప్రభుత్వానికి పట్టింపులేదన్నారు.
ఈ క్రమంలో నాటి త్యాగధనులైన దొడ్డి కొమురయ్య, షెక్ బందగీ, చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో భవిష్యత్ కార్యాచరణతో ముందుకు సాగుతామని వెల్లడించారు. ఈ నెల 17 న హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ సాయుధ ఫోరాట వారోత్సవ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ, రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.విశ్వేశ్వర్‌రావు, యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాములుయాదవ్, ఏఐఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, నాయకులు అంజయ్యనాయక్, ఓమ బిక్షపతి, బిల్లా తిరుపతిరెడ్డి, పల్లె నర్సయ్య, ఉప్పలయ్య పాల్గొన్నారు.