కూసుమంచి: ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు అన్నారు. సోమవారం పాలేరులోని బీబీ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏమయ్యాయని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ రైతులను నిలువునా ముంచుతుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు నష్ట పోతున్నారని, టమాట రైతులు పంటను రోడ్లపై పోసే దుస్థితి నెలకొందని అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో దళారులు, కమీషన్ దారులు కుమ్మక్కై రైతుల వద్ద రోజుకు రూ.లక్షలు దండుకుంటున్నారని విమర్శించారు.
మార్కెట్‌లోకి ఇతర రాజకీయ పార్టీల నాయకులను, మీడియాను అనుమతించటం లేదని, ఇది ప్రభుత్వ దాష్టీకానికి నిదర్శనమని అన్నారు. మంగళవారం జరిగే మార్కెట్ ముట్టడి కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. సబ్సిడీ ట్రాక్టర్లను రైతులు కానీ వారికి, పార్టీ నాయకులకే కట్టబెట్టారని లక్కినేని విమర్శించారు. జక్కేపల్లి ఉప ఎన్నికలో హామీలు ఇచ్చిన పార్టీ నాయకులు ఎన్నికల తరువాత ముఖం చాటేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలో కంకర రహదారే ఉండదని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి తుమ్మలకు గురువాయిగూడెం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
నాలుగేళ్ల ప్రభుత్వ పాలన ముగిసినా నేటి వరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవ్చేలేని సీఎంకే సీఆర్ దేశం దిశను మారుస్తా అనటం హాస్యస్పదంగా ఉందని అన్నారు. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని సూచించారు. పార్టీ మండల అధ్యక్షుడు వైవీడీ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తా నరేందర్‌రెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి రోషిరెడ్డి, నాయకులు బండ్ల వెంకటరెడ్డి, నూకల హుస్సేన్, ఎడవెల్లి పుల్లారెడ్డి, కొత్తా వెంకటేశ్వరరెడ్డి, ఆతుకూరి చినరాములు, విజయ్‌పాల్‌రెడ్డి, గోపె రాము, ఉపేందర్‌రెడ్డి, జగత్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నారాయణరెడ్డి, చిన వెంకన్న,అనంతరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment