ఇబ్బందులు కలగని రీతిలో ఉత్సవాల నిర్వహణ | KCR On State Formation Day Arrangements | Sakshi
Sakshi News home page

ఇబ్బందులు కలగని రీతిలో ఉత్సవాల నిర్వహణ

Published Sat, May 18 2019 1:46 AM | Last Updated on Sat, May 18 2019 1:46 AM

KCR On State Formation Day Arrangements - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలుగని రీతిలో, మరింత వైభవంగా నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రజలకు, విద్యార్థులకు, పోలీసులకు ఎలాంటి యాతన లేకుండా ఈ మూడు ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఆలోచించాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర పండుగల నిర్వహణకు అనుసరించాల్సిన పద్ధతులపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. స్వాతంత్య్ర, గణతంత్ర, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రస్తుత పద్ధతిలోనే నిర్వహించాలా? ఏమైనా మార్పులు చేయాలా? అనే విషయంపై సమావేశంలో చర్చించారు.

‘‘రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2న జరుగుతుంది. ఆ రోజు విపరీతమైన ఎండ, వడగాడ్పులు ఉంటాయి. ఈ సమయంలో విద్యార్థులను ఇళ్ల్ల నుంచి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. ఎండలో కవాతు చేయడం వల్ల పోలీసులు, విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయి. పరేడ్‌ గ్రౌండ్‌ కూడా ఉత్సవాల నిర్వహణకు అనువుగా లేదు’’అని అధికారులు అభిప్రాయపడ్డారు. పబ్లిక్‌ గార్డెన్‌లోని జూబ్లీ హాల్‌కు ఎదురుగా ఉన్న మైదానంలో ఉత్సవాలు నిర్వహిస్తే సబబుగా ఉంటుందని సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రతిపాదించారు. ఇతర అధికారులూ దీన్ని అంగీకరించారు. పోలీసులు, విద్యార్థులతో కవాతు జరిపే పద్ధతికి చాలా రాష్ట్రాలు స్వస్తి పలికాయని, తెలంగాణలోనూ వాటిని మినహాయించడం సముచితమని చెప్పారు. పతాకావిష్కరణ, ముఖ్యఅతిథి ప్రసంగాలకే పరిమితం కాకుండా, ఎట్‌ హోం, కవి సమ్మేళనాలు, అవార్డుల ప్రదానోత్సవాలు జరపాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం నాటి సమీక్షలో వచ్చిన అభిప్రాయాల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర పండుగలు ఎక్కడ నిర్వహించాలి? ఎలా జరపాలి? ప్రస్తుతం అనుసరిస్తున్న సంప్రదాయాలు, పద్ధతుల్లో ఏమైనా మార్పులు అవసరమా? అనే అంశాలపై సీనియర్‌ అధికారులతో చర్చించి, రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్‌ సీఎఎస్‌ ఎస్‌.కె..జోషిని ఆదేశించారు.  

రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమం ఖరారు
వచ్చే నెల 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవంనాటి కార్యక్రమాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పిస్తారు. ఉదయం 9 గంటల నుంచి వరుసగా పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం, సీఎం సందేశం తదితర కార్యక్రమాలుంటాయి. 10.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎట్‌ హోం నిర్వహిస్తారు. 11 గంటలకు జూబ్లీ హాలులో తెలంగాణ రాష్ట్ర అవతరణ అంశంపై కవి సమ్మేళనం జరుగుతుంది. సాయంత్రం అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. అవతరణ ఉత్సవాలకు స్వాతంత్య్ర సమరయోధులను, ప్రజాప్రతినిధులను, ముఖ్యమైన ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించాలని  నిర్ణయించారు. సమీక్షలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement