రైతుల ఉసురు పోసుకుంటున్న సర్కారు
శంషాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని పీసీసీ ఉపాధ్యక్షురాలు, మాజీ హోమంత్రి సబితారెడ్డి విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేని ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు ఉత్తుత్తి ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి సీఎం కేసీఆర్ ఆయన కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారని ఎద్దేవా చేశారు. కనీసం ఊరికో ఉద్యోగాన్ని కూడా కల్పించలేదన్నారు.
ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా యాభైవేల ఉపాధ్యాయుల భర్తీ చేయాల్సి ఉన్నప్పటికి ఇంతవరకు వాటి గురించి పట్టించుకున్న దాఖలాలే లేవని మండిపడ్డారు. కేజీ టూ పీజీ ఉత్తిదేనని తేలిపోయిందని దుయ్యబట్టారు. కమిషన్ల కోసమే ప్రభుత్వ మిషన్ భగీరథ చేపడుతోందని మండిపడ్డారు. మహిళా సంఘాలను సైతం రాష్ట్ర సర్కారు నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రిజర్వేషన్ల పేరిట రాష్ట్ర సర్కారు అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందన్నారు. కుల,మతబేధం లేని సమాజ నిర్మాణానికి కాంగ్రెస్ కృషి చేస్తే కులాలను విడదీస్తూ టీఆర్‌ఎస్ సర్కారు విభజించి పాలిస్తోందని మాజీ మంత్రి విమర్శించారు.