కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి | Congress Party Criticised TRS Government | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి

Published Mon, Apr 2 2018 7:15 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Party Criticised TRS Government - Sakshi

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడానికి సింగరేణి కార్మికులదే కీలక భూమిక పోషించారు. అలాంటి వారికి కేసీఆర్‌ హామీలు      ఇచ్చి మోసగించారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో కార్మికులు.. వారి కుటుంబాలకు అన్యాయం జరిగింది. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరని స్వయంగా అసెంబ్లీలో ప్రకటించి వారిని పర్మినెంట్‌ చేయకుండా ఇబ్బందులకు గురిచేశారు. గైర్హాజరు పేరుతో డిస్మిస్‌కు గురైన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పి విస్మరించారు.’ రూ.10 లక్షల ఇంటి రుణం హామీ అమలుకాలేదు. కొత్త గనులు, ఉద్యోగాల కల్పన గాలికొదిలారు. అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి గోదావరిఖనిలో జరిగిన కాంగ్రెస్‌ ప్రజాచైతన్య యాత్రలో మాట్లాడారు.

గోదావరిఖని :  రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సింగరేణి కార్మికులే కీలకభూమిక పోషించారని, అలాంటి వారికి అనేక హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసగించారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రెండోవిడత ప్రజాచైత న్య బస్సుయాత్రలో భాగంగా ఆదివారం గోదావరిఖనిలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో జరిగిన బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో కేసీఆర్‌ కా ర్మికులను, వారి కుటుంబాలను మోసం చేశారన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరని స్వయంగా అసెంబ్లీలో ప్రకటించి వారిని పర్మినెంట్‌ చేయకుండా ఇబ్బందులకు గురిచేశారని దుయ్యబట్టారు. గైర్హాజరు పేరుతో డిస్మిస్‌కు గురైన కార్మికులనూ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పి మోసం చేశారన్నారు. 2014 ఎన్నికల్లోనే రూ.10లక్షలు ఇంటి రుణం ఇప్పిస్తామన్న హామీ అమలు చేయలేదన్నారు. కొత్తగనులు, ఉద్యోగాల కల్పన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. 20 అసెంబ్లీ స్థానాల్లో సింగరేణి కా ర్మికుల ప్రభావం ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి సింగరేణి కార్మికులు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

ప్రజా వ్యతిరేక పాలనపై యుద్ధం : మక్కాన్‌సింగ్‌
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలనపై యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ నాయకులు మక్కాన్‌సింగ్‌రాజ్‌ఠాకూర్‌ అన్నారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని, కానీ నేటి ప్రభుత్వంలో పక్కనే ఉన్న రామగుండంకు తాగు, సాగునీరు ఇప్పించలేని పరిస్థితి ఉందన్నారు. సాగు, తాగునీటి కోసం పాదయాత్ర చేస్తే ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, కానీ అది పూర్తవుతుందా లేదా అనేది నమ్మకం లేదన్నారు. 62.5 మెగావాట్ల రామగుండం విద్యుత్‌ కేంద్రాన్ని పునరుద్ధరిస్తామన్న హామీ నెరవేరలేదన్నారు. ప్రశ్నించేవారిని గొంతునొక్కుతున్న ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పకతప్పదన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కె.మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగసభలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు టి.జీవన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, దానం నాగేందర్, డి.శ్రీధర్‌బాబు, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఆరెపెల్లి మోహన్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మల్లు రవి, గోమాస శ్రీనివాస్, హర్కర వేణుగోపాల్‌రావు, జనక్‌ప్రసాద్‌ మాట్లాడారు. బోడ జనార్దన్, ప్రేమ్‌సాగర్‌రావు, నేరెళ్ల శారద, ఫకృద్దీన్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, గంట సత్యనారాయణరెడ్డి, దాసోజు శ్రావణ్, భార్గవ్‌ దేశ్‌పాండే, అరవిందరెడ్డి, బడికెల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

తరలివచ్చిన ప్రజానీకం
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చాలా రోజుల తర్వాత రామగుండం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బహిరంగసభ నిర్వహించగా.. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రామగుండం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లతోపాటు పాలకుర్తి, అంతర్గాం మండలాల నుంచి ప్రజలను సమీకరించారు. బహిరంగసభ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహ నిండింది. సభ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ దూరప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, ప్రజలు సభ ముగిసేవరకు ఉన్నారు.  

రాష్ట్రంలో సోయిలేని పాలన: రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో సోయిలేని పాలన సాగుతోందని... గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా సచివాలయానికి వెళ్లేవారని.. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లోనే ఉంటూ పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. 12 వందల మంది విద్యార్థుల బలిదానంతో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్, వారి కుటుంబం అధికారాన్ని చేపట్టి ఆర్థికంగా బలపడుతున్నారని ఆయన అన్నారు. సింగరేణిలో ఎన్నికల సమయంలో దసరా పండుగకు ఓటేస్తే.. దీపావళి పండుగకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్, టీఆర్‌ఎస్‌ నాయకుల మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న తెలంగాణను.. అప్పుల తెలంగాణగా మార్చారని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement