సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ సంస్కృతిని నిర్వీర్యం చేసి కేసీఆర్ ప్రభుత్వం పబ్‌లు, క్లబ్‌లు, గంజాయిని ప్రోత్సహిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన పాలకులు.. బెల్టుషాప్‌లు, మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ తాగుబోతులను తయా రు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గంజాయి, డ్రగ్స్, పబ్స్‌కు యువతను బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు.
ఏడేళ్ల కిందట రూ.10 వేల కోట్లున్న ఎక్సైజ్ ఆదాయాన్ని రూ.36 వేల కోట్లకు పెంచుకున్నారని, హైదరాబాద్‌లో ఆరు పబ్‌లుంటే వాటిని 89కి పెంచారని విమర్శించారు. వరంగ ల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో మే 6వ తేదీన జరగనున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ ఏర్పాట్లను పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీ, ఏఐసీసీ నేతలు ఏలేటి మహే శ్వర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలతో కలిసి రేవంత్ గురువారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
మూడు నెలలకోసారి రాహుల్ పర్యటన
వరంగల్ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా చీప్‌గా ఉన్నాయని, అన్నీ అసత్యాలేనని రేవంత్ అన్నారు. ‘తెలంగాణ ఇస్తే చాలు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న మీ అయ్య సీఎం కుర్చీ లాక్కోలేదా.. ఉద్యమానికి వెన్నంటి ఉన్న కేకే మహేందర్ రెడ్డిని తప్పించి ఆయన గొంతుకోసి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అయిన నీకు పదవీ వ్యామోహం లేదా? పైగా పదవులు ఎడమకాలి చెప్పు తో సమానమంటావా?’ అంటూ విమర్శలు చేశారు. తెలం గాణలో ఎక్కడ భూఆక్ర మణలు, కబ్జాలు, హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు జరిగినా.. వాటి వెనుక టీఆర్ ఎస్ నాయకులే ఉంటున్నారని విమర్శించారు.
మే 6, 7న రాహుల్ పర్యటన: రాహుల్ గాంధీ ప్రతి 3 నెలలకు ఒకసారి రాష్ట్రంలో పర్యటిస్తారని, మే 6, 7న రాహుల్ రాష్ట్ర పర్యటన ఉంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. మే 6న జరిగే రైతు సంఘర్షణ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
జీవో 111 రద్దు మరో మోసం: జీవో నంబర్ 111 రద్దు నిర్ణయం మోసగాడి మరో మోసం అని రేవంత్‌రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ జీవోపై హైకోర్టు 2007లో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే విధించిందని గుర్తు చేశారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన 69 జీవో చెల్లదన్నారు.
కుర్చీల కోసం కుమ్ములాట
టీపీసీసీ అధ్యక్షుడి సాక్షిగా జిల్లా కాంగ్రెస్ పార్టీలోని వర్గపోరు బయటపడింది. రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ముందువరుసలో కూర్చునే విషయమై రెండు వర్గాలు గొడవపడ్డాయి. వరద రాజేశ్వర్‌రావు అనుచరులపై నాయిని రాజేందర్‌రెడ్డి వర్గం వాగ్వాదానికి దిగి పిడిగుద్దులు కురిపించింది. అలాగే, రేవంత్ వెంట కాన్వాయ్ బయలుదేరేటపుడు తామంటే తాము ముందు వెళ్తామంటూ జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి వర్గీయులు తోపులాటకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment