ఇసుక తోడేస్తున్నారు.. | sand mafia bye trs party leaders | Sakshi
Sakshi News home page

ఇసుక తోడేస్తున్నారు..

Published Mon, Feb 12 2018 2:57 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

sand mafia bye trs party leaders - Sakshi

చెన్నూర్‌ గోదావరినది పలుగుల రోడ్డు నుంచి అధికార పార్టీ నాయకుని ట్రాక్టర్‌లో  ఇసుక నింపుతున్న కూలీలు

చెన్నూర్‌ : ఇసుక.. కొందరు అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తోంది. అధి నాయకుల అండదండలతో అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో గోదావరి నది గుంతలమయంగా మారుతోంది. చెన్నూర్, జైపూర్‌ మండలాలు, ఇందారంలో గోదావరినది నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. గోదావరి తీరం సమృద్ధిగా పంటలు పండడంతోపాటు భూగర్భ జల సంపద పెంపు, అడవుల సంరక్షణకు దోహదపడుతుంది. అలాంటి నదిలో నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. రోజుకు వందలాది ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ ట్రిప్పు ఇసుక రూ.3 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన వారే అక్రమ రవాణాకు పాల్పడితే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం గోదావరి ఇసుక కావాలని నిరుపేదలు అనుమతి కోసం వెళ్తే.. అనుమతి లేదంటూ అధికారులు చెబుతున్నారు. అధికార పార్టీ నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా తరలిస్తుంటే అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 


నిబంధనలకు విరుద్ధంగా..


గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. రెండేళ్ల క్రితం భూగర్భ జలాలను  కాపాడాలనే ఉద్దేశంతో çగోదావరినదిలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనుమతి రద్దు చేసింది. గోదావరినదిలో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. గోదావరినదిలో ఇసుక తవ్వకాలు నిర్వహించడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుక రవాణా సాగిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇసుక తవ్వకాలపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారగణం ప్రేక్షక పాత్ర పోషించడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 


కొందరి ట్రాక్టర్లే...


చెన్నూర్‌ పట్టణంలోని గోదావరినది నుంచి ముగ్గురు అధికార పార్టీకి చెందిన నాయకల ట్రాక్టర్లు మాత్రమే ఇసుక రవాణా సాగిస్తున్నాయి. చెన్నూర్‌ పట్టణంలో సుమారు వంద ట్రాక్టర్లు ఉన్నాయి. ఈ ట్రాక్టర్ల యాజమానులు గోదావరి నది నుంచి ఇసుక తరలిస్తే అధికారులు కేసులు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్‌ చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ట్రాక్టర్లు పట్టపగలే ఇసుక రవాణా సాగిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ట్రాక్టర్‌ యాజమానులు అంటున్నారు. జైపూర్‌ మండలంలోని ఇందారం గోదావరినది నుంచి రాత్రివేళల్లో అధికార పార్టీ నాయకుల ట్రాక్టర్లు మాత్రమే ఇసుక రవాణా సాగిస్తున్నాయి. 


ట్రాక్టర్‌ ఇసుకు రూ.3 వేలు..


ఇసుక లభించకపోవడంతో కొందరు అక్రమంగా గోదావరినది ఇసుకను కొల్లగొట్టి ట్రాక్టర్‌ ఇసుకకు రూ.3 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. భవన నిర్మాణానికి గోదావరినది ఇసుకను వాడితే నాణ్యత ఉం టుందన్న నమ్మకంతో డిమాండ్‌ పలుకుతుంది. నిర్మాణదారుల బలహీనతలను ఆసరగా చేసుకుని అక్రమార్కులు ఇసుక వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. 


నదికి ఎంతో ప్రాశస్త్యం..


జిల్లాలోని చెన్నూర్‌ గోదావరి నదికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. కాశీలో గల గోదావరినదికి ఎంతో ప్రాముఖ్యత ఉందో చెన్నూర్‌ గోదావరినదికి అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు. కాశీలోని గోదావరినది ఉత్తర దిశగా> రెండు కోశులు ప్రవహిస్తే చెన్నూర్‌ గోదావరి నది ఉత్తర దిశగా ఐదు కోశులు ప్రవహిస్తుంది. దీంతో చెన్నూర్‌ గోదావరినదికి ఉత్తర వాహిని గోదావరినదిగా పేరుంది. 12 ఏళ్లకు ఒక్కసారి గోదావరినది పుష్కరాలు జరుగుతాయి. వివిధ పట్టణాల నుంచి వేలాది మంది తమ పితృదేవతల అస్థికలను కలిపేందుకు వస్తుంటారు. ఉత్సవాల సందర్భాల్లోనే కాకుండా ప్రతి రోజు వందలాది మంది గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన గోదావరినదిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. 


ఇదెక్కడి న్యాయం..


ప్రభుత్వ నిబంధనలు సామాన్యులు, అధికార పార్టీ నాయకులకు వేర్వేరుగా ఉంటా యా. అధికారులు పార్టీ నాయకుల కోసం పని చేస్తున్నారు. ప్రజలను పట్టించుకోవడం లేదు. పట్టపగలు అక్రమంగా ఇసుక తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు. నిరుపేదలు గోదావరి ఇసుక తీసుకొని వస్తే కేసులు బనాయిస్తారు. అధికార పార్టీ నాయకులు తప్పు చేస్తే కేసులు ఉండవా..? ఇదెక్కడి న్యాయం..! గోదావరి నది నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్న ట్రాక్టర్లను సీజ్‌ చేసి అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలి. గోదావరి ఇసుక అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్‌ స్పందించాలి.  
       – సుశీల్‌కుమార్, చెన్నూర్‌ 


అనుమతి లేదు..


గోదావరినది ఇసుక తరలింపునకు గాను ఇప్పటివరకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. ప్రభు త్వ నిబంధనలు అతిక్రమించి నదిలో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. భూ ప్రక్షాళన సర్వే కారణంగా కొంత బీజీగా ఉన్నాం. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక బృం దాన్ని ఏర్పాటు చేస్తాం. ఎంతటి వారినైనా వదిలేదిలేదు. – దిలీప్‌కుమార్, తహసీల్దార్, చెన్నూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement