
సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్ దిశ కేసులోని నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్పందించారు. దిశ ఘటనలోని నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారన్న వార్తను ఉదయం చూశానని.. నిజంగా ఇది ఆ కుటుంబానికి సత్వర న్యాయం అని భావించినట్టు ఆయన చెప్పారు. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించే విషయమన్నారు. ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలన్నారు.
ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృత్తం కాకుండా నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో దిశ తల్లిదండ్రుల ఆవేదనకు కొంత ఊరట లభించిందని తెలిపారు. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కిరావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ఆయన ప్రశంసలు కురిపించారు. సీపీ సజ్జనార్ లాంటి వ్యక్తులు ఉన్న పోలీస్ వ్యవస్థకు.. కేసీఆర్ ప్రభుత్వానికి చిరంజీవి అభినందనలు తెలియజేశారు.
చదవండి: భగవంతుడే పోలీసుల రూపంలో: బాలకృష్ణ