ఎన్‌కౌంటర్‌పై శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా: ‘దిశ’కేసు నిందితులు చటాన్‌పల్లి వద్ద పోలీసులపై దాడి చేయడంతోపాటు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్ చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. దిశను దహనం చేసిన ప్రాంతంలో మరిన్ని ఆధారాల సేకరణ కోసం శుక్రవారం ఉదయం 5.45 గంటల సమయంలో నలుగురు నిందితులను తీసుకెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగినట్టు చెప్పారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డితో కలిసి కాల్పులు జరిగిన తీరు, అందుకు దారితీసిన కారణాలను సజ్జనార్ మీడియాకు వివరించారు. ‘‘ఈ ప్రాంతానికి సమీపంలో భూమిలో పాతిపెట్టిన దిశ సెల్‌ఫోన్, పవర్‌బ్యాంక్ తదితర వస్తువులను తీయించడానికి నిందితులను తీసుకొచ్చాం.
ఈ క్రమంలో వారు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఏ2 జొల్లు శివ, ఏ3 జొల్లు నవీన్ పోలీసులపై రాళ్లు రువ్వడంతోపాటు కర్రలతో దాడి చేశారు. ఏ1 మహమ్మద్ ఆరిఫ్, ఏ4 చింతకుంట చెన్నకేశవులు పోలీసుల వద్ద ఆయుధాలు లాక్కొని కాల్పులు మొదలుపెట్టారు. అప్పటికీ ఆయుధాలు, రాళ్లు కింద పడేసి లొంగిపోవాలని హెచ్చరించినా.. వినకపోగా పోలీసుల పైకి కాల్పులు కొనసాగించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు చేయాల్సి వచ్చింది.
దీంతో నలుగురు నిందితులు బుల్లెట్ గాయాలతో మరణించారు. నిందితుల దాడిలో నందిగామ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తలకు, కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్‌కు గాయాలయ్యాయి. వారికి స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించి హైదరాబాద్ కేర్ ఆస్పత్రికి తరలించాం’’అని సీపీ తెలిపారు. వారికి రాళ్లు, కర్రల దెబ్బలు మాత్రమే తగిలాయని.. బుల్లెట్ గాయాలు కావని ఆయన స్పష్టం చేశారు. ఘటనా స్థలంలో రెండు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
30 నిమిషాల్లోనే..
‘‘గతనెల 27న శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద కిడ్నాప్‌నకు గురైన దిశపై లైంగికిదాడి, హత్య చేసి మరుసటి రోజు తెల్లవారుజామున షాద్‌నగర్ వద్ద చటాన్‌పల్లి అండర్‌పాస్ కింద ఆమెను దహనం చేశారు. ఈ కేసుని శంషాబాద్ డీసీపీ లోతైన దర్యాప్తు చేశారు. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలతోపాటు రెండు చోట్ల భౌతిక ఆనవాళ్లు సేకరించాం. వీటి ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి 30న మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఈనెల 4న చర్లపల్లి జైలు నుంచి నిందితులను 10రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నాం. ఆరోజు, మరుసటి రోజు విచారణ జరపగా చాలా విషయా లు చెప్పారు. దిశకు చెందిన సెల్‌ఫోన్, వాచీ తదితర వస్తువులు చటాన్‌పల్లి వద్ద దాచిపెట్టినట్లు వెల్లడించారు. వీటిని సేకరించడానికి నిందితులను అక్కడికి తీసుకెళ్లగా పోలీసులపైకి కాల్పులు మొదలుపెట్టడంతో ఇంచుమించు 50 మీటర్ల దూరం నుంచి ఎదురుకాల్పులు చేశారు. మొత్తం 30 నిమిషాల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది’’అని సజ్జనార్ వివరించారు.
గత నేరాలపై ఆరా..
నలుగురు నిందితుల గత నేర చరిత్రపై ఆరా తీస్తున్నట్లు సీపీ వెల్లడించారు. వాళ్లు కరుడుగట్టిన నేరస్తులని, నిందితుల డీఎన్‌ఏ విశ్లేషణ చేసి, దాని ఆధారంగా.. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలు కిడ్నాప్‌నకు గురై దహనమైన కేసులను తేల్చుతామని వివరించారు. వదంతులను ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఒక మహిళ కుటుంబ పరువుకు సంబంధించిన కేసు అని, ఇది అత్యంత సున్నితమైందని చెప్పారు. దిశ కుటుంబ సభ్యుల ప్రైవసీ కాపాడాలని కోరారు. వారితో పదేపదే మాట్లాడి ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు అందాయా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఈ ఎన్‌కౌంటర్ అనుకోకుండా జరిగిన ఘటన అని సజ్జనార్ బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment