ఆ ముగ్గురు నేతలకు షోకాజ్ నోటీసులు!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కె. మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్‌లకు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. శనివారం గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం సమావేశం అయింది.
ఈ నేపథ్యంలో మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్ పరస్పర ఆరోపణలపై షోకాజ్ నోటీసులు పంపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు పాల్వాయి గోవర్థన్ రెడ్డిని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అదేవిధంగా మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్‌లు చేసిన ఆరోపణలపై కూడా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ నెల 17న వివరణ ఇవ్వాల్సిందిగా ముగ్గురు నేతలను టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఆదేశించింది.
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ మాజీ ఛైర్మన్ శ్యాంసుందర్‌ను కూడా సస్పెండ్ చేసినట్టు తెలిసింది. జిల్లా కాంగ్రెస్ మీటింగ్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వేటు వేశారు. శ్వాంసుందర్‌ను కూడా వారంలోగా వివరణ ఇవ్వాలని టీపీసీసీ నోటీసులు ఇచ్చినస్టు సమాచారం.