పాల్వాయికి 'డాటర్ స్ట్రోక్'
ఎండాకాలంపైగా ఎన్నికల సమయం... ప్రచారం కోసం తిరిగే సన్ స్ట్రోక్ తగలాలి. కాని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డికి మాత్రం 'డాటర్ స్ట్రోక్' తగిలింది. ఇదేమిటీ అని అనుకుంటున్నారా? నిజమండీ. సదరు ఎంపీగారి కుమార్తె పాల్వాయి స్రవంతి దెబ్బకు ఆమె తండ్రి గోవర్థన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ శుక్రవారం చేసింది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యునిగా ఉండి ఆ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాంటూ పాల్వాయిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కోదండరెడ్డి ఓ నివేదిక తయారు చేసి అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్కు నివేదిక అందజేశారు. ఆ అంశంపై శుక్రవారం గాంధీ భవన్లో చర్చించి పాల్వాయికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
అసలు జరిగిందేంటి : పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె స్రవంతి 2009లో మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. అందుకో లేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలోనో కానీ ఆమె తండ్రి పాల్వాయి గోవర్థన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలిచి మరీ రాజ్యసభ సీటు అప్పగించింది. దాంతో ఆయన మహా ఖుషీ అయ్యారు. అయితే తన తండ్రికేనా తనకు ఎమ్మెల్యే సీటైనా లేకపోతే ఏట్లా అనుకుందో ఏమో కానీ స్రవంతి రానున్న ఎన్నికల బరిలో నిలబడాలని గట్టిగా నిర్ణయించుకుంది. 2014లో ఎన్నికలు రానే వచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని ఆశ పెట్టుకుంది. కానీ తెలంగాణలో పొత్తులో భాగంగా సీపీఐ నుంచి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి మిత్రపక్షాల అభ్యర్థిగా మునుగోడు నుంచి రంగంలోకి దిగారు. తనకు టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహించిన స్రవంతి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె వినిపించుకోలేదు.
దీంతో ఓట్లు చీలే ప్రమాదం ఉందని భావించిన అధిష్టానం కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ రంగంలో దింపింది. ఆ క్రమంలో కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ సైతం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లి నామినేషన్ ఉపసంహరించుకోవాలని సూచించారు. కుమార్తె స్రవంతికి నచ్చ చెప్పుకోవాలని పాల్వాయికి హితవు పలికారు. తన కుమార్తె తన మాట వినడం లేదు మహాప్రభో అంటూ గోవర్థన్ రెడ్డి... జైరాం రమేష్ ఎదుట వాపోయారు. ఇంకే చేస్తాం కనీసం కుమార్తెకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలని గోవర్థన్ రెడ్డికి జైరాం రమేశ్ హితవు పలికారు.
విడవమంటే పాము కోపం పట్టమంటే కప్పకు కోపం అన్నట్లు తయారైంది గోవర్థన్ రెడ్డి పరిస్థితి. కుమార్తె స్రవంతి తరపున ప్రచారం చేయాలని కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి రోజురోజూకు అధికమైంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల మాట వినక తప్పదని నిర్ణయానికి వచ్చిన పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె తరపున ప్రచారం చేస్తున్నారు. పిలిచి రాజ్యసభ సీటు ఎక్కిస్తే కూతురు కూతురంటూ ఆమె తరఫున ప్రచారం చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతావా అంటూ అధిష్టానం పాల్వాయిపై ధ్వజమెత్తింది.