గోరంత గెలుపు.. కొండంత కులుకు | congress got good days now | Sakshi
Sakshi News home page

గోరంత గెలుపు.. కొండంత కులుకు

Published Sat, Nov 28 2015 12:52 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

గోరంత గెలుపు.. కొండంత కులుకు - Sakshi

గోరంత గెలుపు.. కొండంత కులుకు

జాతిహితం
మంచి రోజులు మళ్లీ వచ్చాయని కాంగ్రెస్ భావిస్తోంది. మూడో భాగస్వామిగా ఒక ఎన్నిక, ఒక ఉపఎన్నిక, కొన్ని చర్చనీయాంశాలు, తిరిగి పతాక శీర్షికలకు ఎక్కడంతోనే పార్టీ పునరుజ్జీవం చెందినట్టు కాదు. నాయకులు, గొప్ప కొత్త భావాలు, దృష్టి కేంద్రీకరణ, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడమే కాంగ్రెస్‌కు సంబంధించిన మౌలిక వాస్తవం. దాన్ని ఇవేవీ మార్చలేవు. దాదాపు చచ్చిన పిల్లిలో ఒక్కోసారి ఉత్సాహం ఉప్పొంగవచ్చు. కానీ అది దాని కాళ్ల మీద నిలవాలంటే చర్చనీయాంశాల కంటే ఎక్కువే కావాలి.
 
మూడేళ్ల తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ వారి మొహాల్లో నవ్వు కనిపిస్తోంది. తమ పార్టీ పునరుజ్జీవం బాట పట్టిందన్నట్టుంది వారి తీరు. అదీ నిజమే. అయితే అది ఆ పార్టీ తిరిగి పత్రికల మొదటి పేజీ పతాక శీర్షికలకు ఎక్కేట్టుగా చేయడానికే పరిమితం. కాంగ్రెస్ వారి నవ్వు ముఖాలకు ఐదు సబబైన కారణాలూ ఉన్నాయి. ఒకటి, బిహార్‌లో వారు అనుసరించిన సరళ మైన, వినమ్రతతో కూడిన వ్యూహం విజయవంతం కావడం. రెండు, మధ్య ప్రదేశ్‌లోని రత్లామ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక గెలుపు. అధికార పార్టీలు ఉప ఎన్నికల్లో ఓడిపోవడంలో అంత నాటకీయతేమీ లేదు. కానీ మధ్యప్రదేశ్ బీజేపీకి కంచు కోటలాంటి రాష్ట్రం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అక్కడ రెండు లోక్‌సభ స్థానాలే దక్కాయి. అవి కూడా కమల్‌నాథ్, జ్యోతి రాదిత్య సింథియాల వ్యక్తిగత గుత్తాధిపత్యం ఉన్న స్థానాలు. మొత్తం దృశ్యం స్పష్టంగా కళ్లకు కట్టాలంటే, శ్రీనగర్ నుంచి ముంబై వరకు ఉన్న 173 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు ఉన్నవి తొమ్మిదేనని గమనించాలి.  
 
మూడు, బీజేపీ నాయకత్వాన్ని మోదీ-షా ద్వయం కైవసం చేసుకున్న ప్పటి నుంచి మొదటిసారిగా ఆ పార్టీలో అసంతృప్తి ధ్వనులు వినిపిస్తు న్నాయి. నాలుగు, ప్రతిపక్షాలు ఏకమైతే మోదీ-షాల దాడిని నిలువరించగల వని బిహార్ తెలియజేసింది. పౌర సమాజం, మేధావులు, జనబాహుళ్యంలోని చాలా మంది బీజేపీ విమర్శకులకు ఇది ధైర్యాన్ని కలుగజేసింది. ఐదు, రాహుల్ నోరు విప్పుతుండటం, ఎక్కువగా కనిపిస్తుండటం ఆయన అనుచ రుల్లోనూ, శత్రువుల్లోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. పంజాబ్‌లో ఆయన తమ పార్టీ నిర్మాణాన్ని సమూలంగా మారుస్తూ, వచ్చే ఏడాది అధ్యక్ష పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని సంకేతాలను పంపుతున్నారు.
 
శుభ వార్తలు.. నగు మోములు
ఆయనకు సంబంధించి మౌలికమైన మార్పేమీ వచ్చినట్టు కనబడదు. కాక పోతే ఎట్టకేలకు ఆయన రాజకీయాల్లోని ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుంది. కాంగ్రెస్ ఈ పార్లమెంటు సమావేశాలను మరింత మెరుగైన నైతిక స్థైర్యంతో ప్రారంభించింది. మోదీ ప్రభుత్వంపైకి విమర్శనాస్త్రాలను సంధిస్తూ కూడా సోనియాగాంధీ నవ్వుతూ కనిపిస్తున్నారు. జీఎస్‌టీ బిల్లుపై చర్చించడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ, మన్మోహన్‌సింగ్‌ను, సోనియాగాంధీని తేనీటి విందుకు  ఆహ్వానించారు. సాధారణంగానైతే అది పరిస్థితిలో పెద్ద మార్పును తెచ్చేదేమీ కాదు. పార్లమెంటరీ మర్యాదలను పాటించడం కోసమైనా బీజేపీ ప్రధాన ప్రతిపక్షానికి ప్రతిపక్ష నాయక హోదాను ఇవ్వలేదు. 283 సీట్ల బలం అహంకారం తలకెక్కడమే అందుకు కారణం. అలాంటి తలబిరుసు తనం ప్రదర్శించగలిగేటంత సంఖ్యా బలం తమ ప్రభుత్వానికి లేదని అవమానకర మైన రీతిలో అది వారికి గుర్తుచేసింది. ఆ మేరకు ఆ ఆహ్వానం సాధారణమైన, శాంతికాలపు రాజకీయాల పునరుద్ధరణకు సంకేతం అవుతుంది.

కాంగ్రెస్‌కు అందుతున్న శుభ వార్తలు ఇక్కడితో ఇక ముగుస్తాయని నా భయం. 2014 వేసవి ఎన్నికల తదుపరి బీజేపీ తొలిసారిగా ఎదురుదెబ్బలు తిన్న మాట నిజమే. అయినా కాంగ్రెస్ వారిలో కలుగుతున్న ఈ పునరుజ్జీవ మనే భావన ఎక్కువగా అంతర్గతమైనదే తప్ప అంత ప్రాముఖ్యత గలది కాదు. 1989 నుంచి కాంగ్రెస్ అవసాన కాలపు క్షీణతను ఎదుర్కొంటోంది. పాతికేళ్లకు పైగా కాలంలో ఈ ధోరణిని వ్యతిరేక దిశకు మార్చగలిగేదేమీ జరగలేదు. రెండు దఫాలు (1991-95, 2004-14) కాంగ్రెస్ తిరిగి అధికారం లోకి వచ్చింది. దీన్ని స్టాక్‌మార్కెట్ పరిభాషలో చచ్చిన పిల్లి ఎగిరిపడ్డ చందం (స్వల్పకాలిక పునర్వికాసం) మాత్రమేనని భావిస్తాను. కాంగ్రెస్ ఎంత పెద్ద పిల్లంటే అది కింద పడ్డప్పుడు ఎగిరి రెండుసార్లు తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే ఆ పార్టీ 1984-89 మధ్య 415 లోక్‌సభ స్థానాలతో ప్రారం భించి 1991కి 231కి పడిపోయింది. ఆ తర్వాత అది సాధించిన అత్యధిక సంఖ్య 2009 నాటి 206! ఇప్పుడది రత్లామ్‌తో కలిసి 45కు క్షీణించింది.

కాంగ్రెస్ ఓట్లకు ‘ప్రాంతీయం’ గండం
సీట్ల సంఖ్య కంటే ఎక్కువ ముఖ్యమైనది ఓట్ల వాటా ధోరణిలో మార్పు. మొత్తంగా చూస్తే, ఉత్తరాది, ప్రధాన హిందీ ప్రాంతం, గుజరాత్‌లలో కాంగ్రెస్ ఓట్ల వాటా 2004-09 మధ్య కాలంలోని రెండు మెరుపులను మిన హాయిస్తే  సార్వత్రికంగానే క్షీణించింది. 20 శాతం కంటే కొద్దిగా ఎక్కువ ఓట్లే దాని డిఫాల్ట్ (ముందస్తుగా నిర్ణయమైన) స్కోర్‌గా ఉంటోంది. 2014లో అది అంతకంటే కూడా కొద్దిగా తగ్గింది. కాబట్టి కాంగ్రెస్ ఓట్ల వాటా దీర్ఘకాలిక క్షీణ ధోరణి రేఖగా ఉంటోంది. కీలకమైన వివిధ రాష్ట్రాల్లో విడివిడిగా ఓట్ల వాటాల్లో వచ్చిన మార్పులను బట్టి చూస్తే ఇది మరింత స్పష్టంగా కనిపి స్తుంది. కాంగ్రెస్ క్షీణిస్తోంది కాబట్టి బీజేపీ, ప్రాంతీయ పార్టీల ఓట్ల వాటా పెరిగింది. అంటే కాంగ్రెస్ ఓట్లలో కొన్ని మాత్రమే బీజేపీకి పోతుండొచ్చు. మిగతా వాటిని ప్రాంతీయ ప్రత్యర్థులు టోకుగా తన్నుకుపోతున్నారు. కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకున్న మాట నిజమే. అయినా, బీజేపీ దాన్ని కొల్లగొట్టలేకపోతోంది.

కాంగ్రెస్ తరహా భావజాలాన్ని లేదా బడుగువర్గాల పార్టీగా గుర్తింపున్న స్థానిక పార్టీ ముందుకు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ తన సంప్రదాయక ఓట్ల వాటాను వాటికి అప్పజెప్పాల్సి వస్తోంది. దేశ ప్రధాన భూభాగంలో  మండల్‌వాదులు, మాయావతితో ఈ ధోరణి ప్రారంభమై, ఆ తదుపరి విస్తరించింది. ఒడిశాలో నవీన్ పట్నాయక్, బెంగాల్‌లో మమతా బెనర్జీ, సీమాంధ్ర-తెలంగాణలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖర రావులూ ఆ పార్టీ స్థానాన్ని ఆక్రమించారు. ఇక చివరగా, ఢిల్లీలో కేజ్రీవాల్ పార్టీ ఆప్ ఆ పని చేసింది. కేజ్రీవాల్  సాధించిన 67/70 ఘన విజయం,  కాంగ్రెస్ ఓట్లను వాక్యూమ్ క్లీనర్‌తో ఊడ్చిపారేయడం వల్ల సమకూరినదే. కాంగ్రెస్ ఓట్ల వాటా  2008లోని 40.3% నుంచి 9.7% పడిపోయింది. కాగా బీజేపీ తన చారిత్రక సాధారణ వాటా 32%కు (2008లో 36.34%) తిరిగి రావడమే జరిగింది. పైగా కాంగ్రెస్ ఒక్కసారి తన ఓట్ల వాటాను కొత్త, ప్రాంతీయ పార్టీకి వదులుకోవాల్సి వచ్చాక తిరిగి దాన్ని సాధించుకోగలగడం అరుదనేది కూడా ప్రాధాన్యతగల అంశం. చాలా కాలం క్రితం ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ ఓట్లను తిరిగి రాబట్టుకోగలిగారు. 2017లో పంజాబ్‌లో కూడా కాంగ్రెస్ అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చేట్టుంది. వాస్తవానికి ఇప్పుడే గనుక ఎన్నికలు జరిగితే అక్కడ ఆప్ అధికారంలోకి వస్తుందని నా అంచనా.  

అచ్చే దిన్(మంచి రోజులు) మళ్లీ వచ్చాయని కాంగ్రెస్ వారంతా భావి స్తున్న గత కొన్ని వారాల్లో ఇదేమీ మారింది లేదు. మూడో భాగస్వామిగా ఒక ఎన్నిక, ఒక ఉప ఎన్నిక, కొన్ని చర్చనీయాంశాలు, తిరిగి పతాక శీర్షికలకు ఎక్కడం, మేధావుల్లోనూ, జనబాహుళ్యంలోనూ అధికార పార్టీపై విమర్శలు రేగడం కలిసినంత మాత్రానే ఆ పార్టీ పునరుజ్జీవితం అయినట్టు కాదు. నాయ కులు, కొత్త భావాలు, దృష్టి కేంద్రీకరణ, మరీ ముఖ్యంగా అంతర్గత ప్రజా స్వామ్యం లోపించడమనేదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మౌలిక వాస్తవం. దాన్ని ఇవేవీ మార్చలేవు. పార్టీ అంతర్గత వ్యవస్థలు, పై నుంచి కింది వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు అన్నీ దీర్ఘకాలిక కోమాలోకి వెళ్లిపోయాయి.
 
‘వారసత్వం’ ఫలితం నాయకత్వ కొరత
నాయకుల కొరత కాంగ్రెస్ ఎదుర్కొంటున్న అతి పెద్ద బలహీనత. అత్యంత సీనియర్ నేతలంతా... కనీసం రాహుల్ ప్రమాణాలరీత్యా చూసినా... వృద్ధు లైపోతున్నారు. బీజేపీ వ్యక్తి పూజను ప్రోత్సహిస్తోందనవచ్చు. కానీ కాంగ్రెస్ దాన్ని పూర్తిగా వ్యవస్థీకృతం చేసేసింది. గాంధీ కుటుంబమే ఆదర్శంగా ఆ పార్టీ సీనియర్ నేతలంతా తమ సొంత వారసత్వ పరంపరను నిర్మిస్తూ వచ్చారు. అది అంతర్గత పోటీని, అవకాశాలను చంపేసింది. ఇక బీజేపీకి వస్తే మోదీ తన రాష్ట్రంలోని అన్ని స్థానాలను గెలుచుకొస్తే, వసుంధర రాజ స్థాన్‌లో, రమణ్‌సింగ్ ఛత్తీస్‌గడ్‌లో, శివరాజ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లో అదే పని చేశారు. కాంగ్రెస్‌కు అలాంటి నేతలు లేరు. ఆ పార్టీలోని అలాంటి చిట్ట చివరి నేత వైఎస్‌ఆర్. కాగా, హర్యానాలో హుడాలు,  పంజాబ్‌లో అమరిందర్ ఆధి క్యతను కాపాడుకుంటూ వచ్చారు.

ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గడ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్‌లలో అలాంటి నేతలే లేరు. కాంగ్రెస్ ఏకైక బలమైన నేత కర్నాటకలోని సిద్ధరామయ్య. అయన కూడా ఇటీవలే దిగుమతి అయిన బాపతు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఈ నాయకత్వ ప్రతిభ కొరత సమస్యను ఆ పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అస్సాంను 30 ఏళ్లు పాలించింది. వృద్ధుడైన గొగోయ్ ఇంకా బాగా వృద్ధుడయ్యారు. యువ గొగోయ్ ఇంకా నాయకత్వానికి సిద్ధం కాలేదు. అత్యంత ప్రతిభావంతుడైన మరో నేత హిమాంత బిశ్వ శర్మ అసం తృప్తితో బీజేపీలోకి ఫిరాయించారు. ప్రజలను రెండు శిబిరాలుగా చీల్చే తన వ్యూహాన్ని బీజేపీ కొనసాగించేట్టయితే, బిహార్ లాంటి కూటమి కాంగ్రెస్‌కు అస్సాంలో అనుకోని అవకాశాన్ని అందించవచ్చు. అయినాగానీ నాయకు నిగా చూపడానికంటూ ఒకరు లేకపోవడం ప్రతికూలతగానే ఉంటుంది.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం ఎప్పటి కంటే అతి కనీస స్థాయికి, 20% కంటే కొద్దిగా తక్కువకు పడిపోయింది. కానీ ఈ విషయాన్ని ఓట్ల శాతం, సీట్ల సంఖ్యల కంటే భిన్నమైన కోణం నుంచి చూసినట్టయితే... అంతటి ఘోర పరాజయంలో సైతం అది దాదాపు 11.5 కోట్ల ఓట్లను సాధిం చిందని స్ఫురిస్తుంది. పైగా దానికి సమయం కూడా ఉంది. కాకపోతే అది ఇతర పార్టీలతో కలసికట్టుగా ఉండటం మాత్రం చే యాలి. చాలా ఏళ్ల క్రితం సింగపూర్‌కు చెందిన ఒక అత్యున్నత స్థాయి దౌత్యవేత్త ఒకరు... మీ రాజకీయ వేత్తలు ఎంత సుదీర్ఘంగా కొనసాగగలుగుతారనే దాన్ని బట్టి చూస్తే యువ కుడైన రాహుల్ ఏదో ఒక నాటికి ప్రధాని అవుతారని అన్నారు. అయితే ఇప్పుడిక ఏవీ ఎంత మాత్రమూ అనివార్యంగా జరిగిపోయేవిగా ఉండటం లేదు. దాదాపుగా  చనిపోయిన పిల్లిలో సైతం ఒక్కోసారి అసాధారణమైన ఉత్సాహోత్తేజాలు ఉప్పొంగవచ్చు. అయితే అది తిరిగి దాని కాళ్ల మీద నిలవా లంటే మాత్రం చర్చనీయాంశాల కంటే ఎక్కువే దానికి కావాలి.

శేఖర్ గుప్తా, twitter@shekargupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement